Best Web Hosting Provider In India 2024
TS Mlc Elections: తెలంగాణ శాసనమండలి ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. గడువు ముగిసేలోపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో కాంగ్రెస్ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్ ఎన్నిక ఖాయమైంది. 22వ తేదీన అధికారికంగా ప్రకటన వెలువడనుంది.
ట్రెండింగ్ వార్తలు
గురువారం సాయంత్రంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తి పూర్తైంది. కాంగ్రెస్ అభ్యర్థులుగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ నామినేషన్‌లు దాఖలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డికి వాటిని సమర్పించారు. ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మాత్రమే నామినేషన్‌లు వేయడంతో ఎన్నిక లాంఛనం కానుంది.
శాసనసభ ఎన్నికల్లో గెలిచిన కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డిలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలను నిర్వహిస్తున్నారు. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుంది. 22వ తేదీ సాయంత్రం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత ఎన్నికల సంఘం అనుమతితో ఫలితాలను వెల్లడిస్తారు. జనవరి 29న రెండు స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా.. ఒక్కో స్థానానికి ఒక్కరు మాత్రమే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేసే క్రమంలో వారిని బలపరుస్తూ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, మందుల సామేల్, వంశీకృష్ణ, బాలునాయక్, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, రాజ్‌ఠాకూర్, టి.రామ్మోహన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డిలు అభ్యర్థులను బలపరుస్తూ సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపా దాస్‌మున్షీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. ”పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు దక్కుతుంది. మహేశ్‌కుమార్, వెంకట్‌లను పెద్దల సభకు పంపించడమే అందుకు ఉదాహరణ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
119 ఎమ్మెల్యేలు కలిగిన తెలంగాణ అసెంబ్లీలో సీపీఐతో కలుపుకుని కాంగ్రెస్‌కు 65 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. మరోవైపు 39 మంది ఎమ్మెల్యేలు కలిగిన బీఆర్‌ఎస్ పార్టీ ఈ ఎన్నిక పక్రియకు దూరంగా ఉంది. దీంతో కాంగ్రెస్ తరపున ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఎమ్మెల్సీలుగా బల్మూరు వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.
టాపిక్