Best Web Hosting Provider In India 2024
Mla Tellam Venkat Rao : కాంగ్రెస్ పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS Mla) ప్రత్యక్షమయ్యారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Mla Tellam Venkat Rao) హాజరవడం చర్చనీయాంశంగా మారింది. లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశం ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. అక్కడ జరిగిన మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆ నియోజకవర్గ ఇన్చార్జి ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) హాజరయ్యారు. ఆయన నేతృత్వంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాగా ఈ సమావేశానికి భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరవ్వడం ఆశ్చర్యానికి గురిచేసింది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హాజరవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కండువా లేకుండా హాజరవ్వడం మరింత చర్చకు కారణమైంది.
ట్రెండింగ్ వార్తలు
తొలి నుంచి ఇదే చర్చ
భద్రాచలంలో బీఆర్ఎస్(BRS) తరఫున గెలుపొందిన తెల్లం వెంకట్రావు(Tellam Venkat rao) కాంగ్రెస్ పార్టీలో చేరతారని ముందు నుంచి అంతులేని చర్చ సాగుతోంది. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడైన రోజున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS) అదే రోజున కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చర్చ జరిగింది. అయినప్పటికీ అది వాస్తవం కాదని ఆయన కొట్టి పారేశారు. ఆ తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం మరింత చర్చకు కారణమైంది. ఆ తర్వాత సైతం ఎమ్మెల్యే వెంకట్రావు మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) కలిసి అభినందనలు తెలియజేశారు.
అలాగే ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించేందుకు భద్రాచలం వచ్చిన సమయంలోనూ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ సమయంలో పినపాక నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలోను తెల్లం వెంకట రావు పాల్గొనడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భద్రాద్రి ఎమ్మెల్యే(Bhadrachalam Mla) వెంకట్రావు కాంగ్రెస్ లో చేరేందుకు సానుకూలంగానే ఉన్నట్లు చర్చ జరిగింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో సైతం భద్రాద్రి ఎమ్మెల్యే పాల్గొనడం గమనార్హం. ఈ పరిణామాల నేపద్యంలో భద్రాద్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరికకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు స్పష్టమవుతుంది.
రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
సంబంధిత కథనం
టాపిక్