Korrala Pongali: బ్రేక్ ఫాస్ట్‌లో కొర్రల పొంగలి వండుకోండి, డయాబెటిస్ ఉన్న వారికి ఇది బెస్ట్ అల్పాహారం

Best Web Hosting Provider In India 2024

Korrala Pongali: కొర్రలను ఫాక్స్‌టైల్ మిల్లెట్ (Foxtail Millet) అంటారు. వీటిని వండడానికి చాలా సమయం పడుతుంది. అందుకే కొర్రలతో వంటలు చేసుకునేవారి సంఖ్య తగ్గిపోయింది. వీటిని వండే ముందు కనీసం మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి. అప్పుడే గింజ త్వరగా ఉడుకుతుంది. మృదువుగా అవుతుంది. కొర్రల్లో పీచు అధికంగా ఉంటుంది. అలాగే గ్లూటెన్ ఫ్రీ కాబట్టి ఎవరైనా దీన్ని తినవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవారు, హైబీపీతో ఎంతో ఇబ్బంది పడేవారు కొర్రల పొంగలి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ కొర్రల పొంగలి చేయడం చాలా సులువు. దీన్ని ఒక్కసారి చేసుకున్నారంటే మీతో పాటు పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది.

కొర్రలు పొంగలి రెసిపీకి కావలసిన పదార్థాలు

కొర్రలు – ఒక కప్పు

మిరియాల పొడి – ఒక స్పూను

కరివేపాకులు – గుప్పెడు

జీలకర్ర – ఒక స్పూన్

పెసరపప్పు – ఒక కప్పు

ఉప్పు – రుచికి సరిపడా

నెయ్యి – నాలుగు స్పూన్లు

పచ్చిమిర్చి – రెండు

జీడిపప్పు – 10

ఇంగువ – చిటికెడు

కొర్రల పొంగలి రెసిపీ

1. కొర్రల పొంగలి చేసేందుకు ముందుగానే కొర్రలను నాలుగు గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పెసరపప్పును వేసి చిన్న మంట మీద వేయించాలి.

3. అవి వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తుంది.

4. కాస్త రంగు మారేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ స్టవ్ మీద పెట్టి నానబెట్టిన కొర్రలు, వేయించిన పెసరపప్పు, ఉప్పు, అవి ఉడకడానికి సరిపడా నీళ్లు వేసి మూత పెట్టేయాలి.

6. నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.

7. ఆవిరి పోయాక కుక్కర్ మూత తీయాలి.

8. కాస్త నీరుగా అనిపిస్తుంది. కొంచెం చల్లబడితే పొంగలి గట్టిపడుతుంది.

9. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యిని వేసి అందులో జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి.

10. తర్వాత అదే నెయ్యిలో జీలకర్ర, మిరియాల పొడి, కరివేపాకులు, ఇంగువ, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి.

11. చివర్లో జీడిపప్పును కూడా కలిపేయాలి.

12. ఈ మొత్తం మిశ్రమాన్ని కొర్రల మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే టేస్టీ కొర్రల పొంగలి రెడీ అయినట్టే.

13. దీన్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది. పెద్దగా నమలాల్సిన అవసరం లేదు. మెత్తగా ఉడికేస్తుంది. పిల్లలకు ఇది పెడితే మంచిది. ఏడాదిన్నర పిల్లల నుంచి దీన్ని తినిపించవచ్చు. ఇది వారి ఆరోగ్యానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తుంది.

చిరుధాన్యాల్లో కొర్రలు ముఖ్యమైనవి. ఒకప్పుడు వీటి వాడకం అధికంగా ఉండేది. ఎప్పుడైతే తెల్ల బియ్యాన్ని అందరం వినియోగించడం మొదలుపెట్టామో… కొర్రలు, సామలు, అరికెలు వంటివన్నీ మూలన పడ్డాయి. ఇప్పుడు మళ్లీ ఆరోగ్య స్పృహ పెరగడంతో వీటి వాడకం మొదలైంది. ఒక్కసారి మీరు ఈ కొర్రల పొంగలి రెసిపీ ట్రై చేయండి. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024