Karimnagar : కరీంనగర్ లో గాలి వాన బీభత్సం, సీఎం రేవంత్ రెడ్డి టూర్ రద్దు

Best Web Hosting Provider In India 2024

Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ సభలకు అంతరాయం ఏర్పడింది. గత పది రోజుల నుంచి రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనానికి అకాలవర్షంతో ఉపశమనం లభించింది.

మునుపెన్నడు లేనంతగా ఈసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో 47 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇంట్లో ఉంటే ఉక్కపోత బయటకు వెళ్లాలంటే భానుడి భగభగలతో జనం విలవిల్లాడారు. ఇలాంటి పరిస్థితిలో మంగళవారం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి వర్షం కురిసింది. వేములవాడలో భారీ వర్షం పడగా మంథని, ధర్మపురి, కరీంనగర్ లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షంతోపాటు గాలిదుమారం బీభత్సం సృష్టించింది. వారం రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన జనానికి అకాలవర్షంతో కాస్త ఉపశమనం లభించింది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు మాత్రం గండంగా మారింది.

కూలిన టెంట్లు…సభలకు అంతరాయం

ఎన్నికల వేళ ప్రచారానికి ఇక నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు అగ్రనేతలు ప్రచారం ముమ్మరం చేశారు. మంగళవారం సాయంత్రం కరీంనగర్ కాంగ్రెస్ జన జాతర సభ ఏర్పాటు చేసింది. సభ ప్రారంభానికి ముందే గాలివాన భీభత్సం సృష్టించింది. గాలివానకు టెంట్లన్ని కూలిపోయాయి. కూర్చీలు సౌండ్ సిస్టం దెబ్బతింది. సభా ప్రాంగణం అస్థవ్యస్థంగా మారింది. ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురియడంతో సభకు అంతరాయం ఏర్పడింది. సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో రద్దయ్యింది. కరీంనగర్ లో అకాలవర్షంతో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాల్సిన కాంగ్రెస్ జనజాతర సభ రద్దైంది. గాలివానకు టెంట్లు కూలి సభా ప్రాంగణం అస్తవ్యస్తంగా మారింది. సభా ప్రాంగణాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, ఎమ్మెల్యేలు సత్యనారాయణ, మేడిపల్లి సత్యం సందర్శించి పరిశీలించారు.‌ వర్షం కారణంగా సీఎం జనజాతర రద్దు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రచారం ముగిసే రోజు వరకు కరీంనగర్ లో కాంగ్రెస్ జన జాతర సభ నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.‌ వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ రోడ్ షోలకు మాత్రం సీఎం హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ బయలుదేరారు.

మంథనిలో రాజస్థాన్ సీఎం సభ అస్తవ్యస్తం

అకాలవర్షంతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మంథనిలో ఏర్పాటు చేసిన బీజేపీ జన గర్జన సభకు అంతరాయం ఏర్పడింది. గాలివానకు టెంట్లు కూలిపోయాయి. ఓ ఎస్ఐకి స్వల్ప గాయాలు అయ్యాయి. సభ ప్రారంభమైన కాసేపటికే గాలివానతో జనం తలోదారి పట్టుకుని పరుగెత్తారు. వేదికపై పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ మాట్లాడుతున్న సమయంలోనే గాలివాన ఒక్కసారిగా విరుచుకుపడింది. సభకు ముఖ్య అతిథిగా రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ కాస్త ఆలస్యంగా రావడంతో ఇతర నాయకులు ప్రసంగించారు. గాలివాన నుంచి తేరుకున్నాక సభాస్థలి వద్దకు రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ చేరుకుని ప్రచార వాహనంపైకి ఎక్కి ప్రసంగించారు. అప్పటికే వర్షానికి జనమంతా వెళ్లిపోయారు. వర్షం ఎంతపని చేసిందని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

వేములవాడలో భారీ వర్షం..మోదీ సభ ఏర్పాట్లకు అంతరాయం

అటు వేములవాడలో భారీ వర్షం కురిసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ఉదయం వేములవాడను సందర్శించి శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని అక్కడ జరిగే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే మోదీ సభ కోసం చేస్తున్న ఏర్పాట్లకు అకాల వర్షంతో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి సభాప్రాంగణం బురదమయంగా మారింది. ఎండవేడి నుంచి ఉపశమనానికి టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన తడక పందిళ్ళు కూలిపోయాయి. వర్షానికి వేములవాడ అస్తవ్యవస్తంగా మారింది. ఓ వైపు మోదీ పర్యటన మరో వైపు అకాల వర్షంతో బీజేపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షంతో వారం పదిరోజులుగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం మాత్రం ఉపశమనం పొంది చల్లని వాతావరణంతో ఊపిరి పీల్చుకున్నారు.

HT Telugu Correspondent K.V.REDDY, Karimnagar

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsKarimnagarKarimnagar Lok Sabha ConstituencyTs RainsCm Revanth ReddyTelangana Congress
Source / Credits

Best Web Hosting Provider In India 2024