Balakrishna Anjali: అంజలిని నెట్టేయడంపై బాలకృష్ణను వెనకేసుకొచ్చిన విశ్వక్ సేన్, నాగ వంశీ

Best Web Hosting Provider In India 2024

Balakrishna Anjali: బాలకృష్ణ, అంజలి వివాదంపై గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నటుడు విశ్వక్ సేన, మూవీ నిర్మాత నాగవంశీ స్పందించారు. ఈ విషయంలో వాళ్లిద్దరూ బాలయ్యను వెనకేసుకొచ్చారు. మొత్తం వీడియో చూస్తే అసలేం జరిగిందో తెలుస్తుందని, సరదాగా జరిగిన విషయాన్ని ఎందుకు వివాదం చేస్తున్నారని వాళ్లు మీడియాను తిరిగి ప్రశ్నించారు.

బాలకృష్ణ చాలా మంచోడు: విశ్వక్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీరిలీజ్ ఈవెంట్లో స్టేజ్ పైనే నటి అంజలిని బాలకృష్ణ నెట్టేస్తున్న వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. పక్కనే ఉన్న అంజలిని జరగాల్సిందిగా బాలయ్య ఒకసారి అడిగాడు. ఆమె సరిగా వినకపోవడంతో వెంటనే అతడు నెట్టేశాడు. అది చూసి పక్కనే ఉన్న నేహా శెట్టి షాక్ తిన్నట్లుగా కనిపించింది.

బాలయ్య తరచూ ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం కామనే కావడంతో సోషల్ మీడియాలో అందరూ అతనిపై తీవ్రంగా మండిపడ్డారు. చిన్మయిలాంటి సెలబ్రిటీలు కూడా తప్పుబట్టారు. అయితే తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా హీరో విశ్వక్ మాత్రం బాలకృష్ణను వెనకేసుకొచ్చాడు. సరదాగా జరిగిన విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారని, మొత్తం వీడియో చూడాలని అతడు అనడం విశేషం.

“అతడు చాలా మంచి వ్యక్తి. సీరియస్ విషయాన్ని కూడా సరదాగా తీసుకుంటాడు. మనం కూడా దేనిని సీరియస్ గా తీసుకోవాలి, దేనిని తేలిగ్గా తీసుకోవాలో అర్థం చేసుకోవాలి. ఆ వీడియోలో కొంత భాగాన్ని వైరల్ చేశారు. మొత్తం వీడియో చూస్తే తెలుస్తుంది. చివర్లో వాళ్లిద్దరూ హైఫై కూడా కొట్టుకున్నారు” అని విశ్వక్ సేన్ అన్నాడు.

అన్నీ గ్రాఫిక్స్ చేసేస్తున్నారు: నాగవంశీ

అంజలిని బాలయ్య నెట్టడాన్ని నిర్మాత నాగవంశీ కూడా తేలిగ్గా తీసుకున్నారు. “ముగ్గురు స్నేహితులు ఒకచోట మాట్లాడుకుంటున్నారనుకోండి. ఓ వ్యక్తిని జరగమని అడిగితే అతడు జరగకపోతే ఏం చేస్తారు? ఏదో అలా నెట్టారు అంతే. అక్కడ జరిగింది అంతే. దీనిని అనవసరంగా వివాదం చేస్తున్నారు” అని నాగవంశీ అన్నాడు. ఇక ఇదే ఈవెంట్లో మరో వీడియో కూడా వైరల్ అయిన విషయం తెలుసు కదా.

అందులో బాలకృష్ణ కుర్చీ కింద మందు బాటిల్ ఉండటం చూడొచ్చు. ఈ వీడియోను కూడా నాగవంశీ తేలిగ్గా తీసుకున్నాడు. అదంతా గ్రాఫిక్స్ అని అతడు చెప్పడం గమనార్హం. ఇప్పుడన్నంటిలోనూ గ్రాఫిక్స్ జోడిస్తున్నారని నాగవంశీ చెప్పాడు. మధ్యలో జోక్యం చేసుకున్న విశ్వక్ మాట్లాడుతూ.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి పని చేసిన వ్యక్తే ఈ పని చేశాడని, అతన్ని పట్టుకున్నామని అనడం విశేషం.

అయితే అంజలిని నెట్టేసిన విషయాన్ని మాత్రం సోషల్ మీడియాలో పలువురు సీరియస్ గా తీసుకుంటున్నారు. సింగర్ చిన్మయి కూడా దీనిపై స్పందించింది. అంజలి నవ్వుతుందంటే.. ఇద్దరి మధ్యా ఏదో జరిగిందన్న అర్థంలో అందరూ కామెంట్స్ చేస్తారని ఆమె ట్వీట్ చేసింది.

మరోవైపు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ శుక్రవారం (మే 31) రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ లో వాడిన బూతులపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఈ బూతులు ఇండియన్ కాపీలో ఉండవని, ఓవర్సీస్ లోనే ఉంటాయంటూ విశ్వక్ ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

IPL_Entry_Point

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024