
Best Web Hosting Provider In India 2024

Blackout trailer: థియేటర్లను కాదని ఇప్పటికీ కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకే వస్తున్నాయి. అలాంటిదే క్రైమ్ థ్రిల్లర్ మూవీ బ్లాకౌట్ (Blackout) కూడా జియో సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను గురువారం (మే 30) మేకర్స్ రిలీజ్ చేశారు. విక్రాంత్ మస్సీ, మౌనీ రాయ్, సునీల్ గ్రోవర్ నటించిన ఈ డార్క్ కామెడీ ట్రైలర్ ఆకట్టుకునేలా సాగింది.
బ్లాకౌట్ ట్రైలర్
బాలీవుడ్ తోపాటు పలు వెబ్ సిరీస్ ల ద్వారానూ పేరు సంపాదించిన నటుడు విక్రాంత్ మస్సీ. అతడు నటించిన బ్లాకౌట్ మూవీ జూన్ 7న జియో సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. దేవాంగ్ షాషిన్ భవ్సార్ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ కూడా అంతే థ్రిల్లింగా సాగింది. మౌనీ రాయ్ ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ గా నటించింది.
ట్రైలర్ ఈ మూవీ అసలు కథేంటో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేసింది. మొదట్లోనే హీరో తన కారులో వెళ్తూ ఉంటాడు. అయితే ఊహించని విధంగా ఓ వ్యాను వేగంగా వచ్చి హీరో కారుని ఢీకొట్టి బోల్తా పడుతుంది. దగ్గరికి వెళ్లి చూసే సరికి అందులో ఉన్న వ్యక్తి చనిపోయి కనిపిస్తాడు. అతని పక్కనే ఎంతో బంగారం ఉండటం హీరో చూస్తాడు.
వెంటనే ఆ బాడీని, బంగారాన్ని తన కారులోకి ఎక్కించి వెళ్తుండగా.. మధ్యలో అనుకోకుండా ముగ్గురు వ్యక్తులు కలుస్తారు. దొరికిన బంగారంతో ఎంజాయ్ చేద్దామనుకునే అతడు ఈ ముగ్గురి వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నాడన్నదే ఈ బ్లాకౌట్ స్టోరీ. అసలు ఆ రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది? ఆ వ్యానులో అంత బంగారం ఎక్కడిది? చివరికి అదంతా ఎవరికి దక్కుతుంది అన్నది సినిమా చూస్తే తెలుస్తుంది.
బ్లాకౌట్‌పై నటీనటులు ఏమన్నారంటే..
ఈ బ్లాకౌట్ మూవీపై ఇందులో నటించిన యాక్టర్స్ స్పందించారు. విక్రాంత్ మస్సీ మాట్లాడుతూ.. జియో సినిమాలో బ్లాకౌట్ స్ట్రీమింగ్ అవుతుండటంతో తన మనసు ఆనందంతో ఉప్పొంగుతోందని అన్నాడు. ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుందని చెప్పాడు. ఇక కమెడియన్ సునీల్ గ్రోవర్ స్పందిస్తూ.. ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది అని అన్నాడు.
నాగిన్ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన మౌని రాయ్ ఇందులో నటించింది. ఈ మూవీలోని సస్పెన్స్, థ్రిల్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని ఆమె అభిప్రాయపడింది. ప్రతి ఒక్కరిలోనూ ఎంతో కొంత నెగటివిటీ ఉంటుందని, అదే ఈ సినిమాకు ప్రేరణగా పని చేసిందని డైరెక్టర్ భవ్సార్ అన్నాడు. తమలోని అత్యాశ తమలోని మంచిని ఎలా దూరం చేస్తుందన్నది ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేసినట్లు చెప్పాడు.
12th ఫెయిల్ మూవీ తర్వాత విక్రాంత్ మస్సీ నటించిన సినిమా ఇది. ఆ మూవీ అతని కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ బయోపిక్ గా రూపొందించిన 12th ఫెయిల్ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో విక్రాంత్ నటనకు అందరూ ఫిదా అయ్యారు.