Best Web Hosting Provider In India 2024
TGPSC Group 1 Prelims : తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్ పై మంగళవారం తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ నెల 9న ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్‌మెంట్ పరీక్ష ఉన్నందున గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలని పిటిషనర్లు కోర్టును అభ్యర్థించారు. అయితే కోర్టు పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది.
జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్
జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే అదే రోజున ఇంటెలిజెన్స్ బ్యూరో పరిధిలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-ఐఐ/ఎగ్జిక్యూటివ్ పోస్టుకు రెండో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని హైకోర్టును ఆశ్రయిచారు. పిటిషనర్లు ఈ నెల 1న కోర్టుకు సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తెలియజేయాలని టీజీపీఎస్సీని కోర్టు సూచించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్ల కార్తీక్ మంగళవారం విచారణ చేపట్టగా… టీజీపీఎస్సీ తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లు చేశామని తెలిపింది. ముందుగా గ్రూప్-1 షెడ్యూల్ ప్రకటించామన్నారు.
టీజీపీఎస్సీ నిర్ణయం
గ్రూప్-1 ప్రిలిమ్స్ కు 4,03,645 మంది దరఖాస్తు చేసుకున్నారని టీజీపీఎస్సీ కోర్టుకు తెలిపింది. వారంతా పరీక్షకు సిద్ధమయ్యారని, కొందరి కోసం లక్షల మందిని ఇబ్బంది పెట్టడం సరికాదని, ప్రిలిమ్స్ వాయిదా వేయడం సాధ్యం కాదని టీజీపీఎస్సీ కోర్టుకు తన అభిప్రాయాన్ని తెలియజేసింది. అయినప్పటికీ పిటిషనర్ల వినతిపత్రంపై అధికారులు చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు పిటిషన్ లో ఇంకా లోతుగా వెళ్లడంలేదని, చట్టప్రకారం అధికారులు నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. గ్రూప్-1 ప్రిలిమినరీ టెస్ట్ ను ఓఎమ్ఆర్ విధానంలో ఈ నెల 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు పాటించాల్సిన సూచనలను హాల్ టికెట్లపై ప్రింట్ చేశామని టీజీపీఎస్సీ తెలిపింది. అయితే తాజాగా మరోసారి అభ్యర్థులకు సూచనలు చేసింది. హాల్ టికెట్ పై మూడు నెలలలోపు దిగిన పాస్ పోర్ట్ సైజు ఫొటోను అతికించాలని కమిషన్ పేర్కొంది. పరీక్ష హాల్ లోకి వెళ్లే ముందు పరీక్ష కేంద్రం వద్ద హాల్ టికెట్ పై అభ్యర్థి ఫొటోను అతికించాలని తెలిపింది. ఫొటో అతికించకపోతే పరీక్ష హాల్ లోకి అనుమతించమని పేర్కొంది. ఈ సూచనను హాల్ టికెట్ లో ప్రస్తావించినట్లు తెలిపింది.
అదే విధంగా అభ్యర్థి పరీక్ష హాలులో ఇన్విజిలేటర్ సమక్షంలో హాల్ టికెట్ పై సంతకం చేయాల్సి ఉందని కమిషన్ పేర్కొంది. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించడానికి హాల్ టికెట్ తప్పనిసరి అని తెలిపింది. హాల్ టికెట్ తో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డు ఒరిజినల్ అభ్యర్థి తీసుకోవాలని సూచించింది. ప్రభుత్వం జారీ చేసిన పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వీటిల్లో ఏదైనా ఒకటి పరీక్ష కేంద్రం వద్ద సిబ్బందికి చూపించాలని తెలిపింది.
సంబంధిత కథనం
టాపిక్