Best Web Hosting Provider In India 2024
Sunday Motivation: జీవితంలో ఏది సాధించాలన్నా ముందడుగు వేయాలి. అడుగుల ముందుకు కదలకుండా నిలుచున్న చోటే విజయాన్ని అందుకోవడం చాలా కష్టం. ఎంతోమంది తనపై తమకు నమ్మకం లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఆగిపోతారు. ముందుగా మీ ఆలోచన తీరును మార్చుకోండి. ప్రతి అంశాన్ని సానుకూలంగా చూడండి. ప్రతి చర్యలోను ప్రతికూలతలను ఆలోచించకండి. ఎన్నో అడ్డంకులను, సమస్యలను దాటి వెళితేనే మీ సుందర స్వప్నం సాకారం అవుతుంది. దానికి మీపై నమ్మకం ఆత్మవిశ్వాసమే ముఖ్యం.
మీ బలాలు ఏంటో మీకు తెలుసు. మీ బలహీనతలు కూడా మీకు తెలుసు. వాటి పైనే మీ కలల సౌధాన్ని నిర్వహించుకోండి. మీరు ఏ విషయంలో బలంగా ఉండగలరో… ఆ విషయాలు గుర్తుతెచ్చుకుంటు ఉండండి. బలహీనతలను అధిగమించడానికి ప్రయత్నించండి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా కుంగుబాటుకు లోనుకాకుండా ఎదుర్కొనే సామర్థ్యం మీలో ఉండాలి. అప్పుడే ఏ వ్యక్తి అయినా విజయం సాధించగలడు.
సంవత్సరం మారినంత మాత్రాన రాతలు మారిపోవు. ప్రయత్నాలు ఆపేస్తే విజయం దక్కదు. గమ్యం దూరమైనా మీ ప్రయాణాన్ని మాత్రం ఆపద్దు. మార్గం కష్టంగా ఉందని ప్రయత్నాన్ని అక్కడే ఆపేయకండి.
సగం జీవితం ఏం చేయాలో ఆలోచించడానికే సరిపోతుంది. ఏం చేయాలో, ఎలా విజయం సాధించాలో నిర్ణయించుకున్నాక వెంటనే ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. నేను చేయగలను అనే నమ్మకం మీకు ఉంటే ఎలా చేయాలన్న మార్గం అదే కనిపిస్తుంది.
మీరు కావాలనుకున్న దానికోసం క్షణం కూడా వృధా చేయకుండా ప్రయత్నాలు మొదలు పెట్టండి. తీరిపోయిన గతం గురించి, తెలియని భవిష్యత్తు గురించి ఆలోచించవద్దు. ఈరోజు ఏం కావాలో, ఏం చేయాలో ఆలోచించి అడుగులు వేయండి. మార్పు మనం అనుకున్నంత తేలికగా రాదు… అలా అని పూర్తిగా అసాధ్యం కూడా కాదు. ప్రయత్నం చేస్తే జీవితాలు మారడం చాలా కష్టం.
ఆలోచన ఉన్న వ్యక్తి గడ్డిపరకను కూడా బ్రహ్మాస్త్రంలా వాడుకుని విజయాలను సాధిస్తాడు. ఏం చేయాలో ఆలోచన లేని వ్యక్తికి బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చిన గడ్డిపరకలా పక్కన పడేస్తాడు. మీరు తెలివైన వారో, తెలివి తక్కువ వారో నిర్ణయించుకోండి. మొదటిసారి గెలిచేయాలని అనుకోవద్దు. ఎన్నిసార్లు ఓడినా కూడా చివరికి గెలుపు తలుపు తట్టాలని మాత్రమే అనుకోండి. ఆలోచన పెద్దగా ఉన్నా ప్రయత్నం చిన్నగానే మొదలవుతుంది. మొదటే కుంభస్థలాన్ని కొట్టాలని అనుకోవద్దు, చిన్న చిన్న విజయాలు పెద్ద విజయాలకు మార్గాన్ని వేస్తాయి.
సవాళ్లను ఎదుర్కొని నిలిచే వారికి మాత్రమే విజయం సొంతం అవుతుంది. సవాళ్లను చూసి భయపడితే మిగిలేది మీరు ఒక్కరే. మీ వెనుక చెప్పుకోవడానికి ఏమీ ఉండదు.
విజయం సాధించే ప్రక్రియలో విమర్శలను భరించే సహనం కూడా ఉండాలి. విమర్శలను చూసి ఎంతోమంది అడుగు వెనక్కి వేస్తారు. అలా అని అత్యాశ కూడా ఉండకూడదు. ఆకలితో ఉన్న సింహం కంటే అత్యాశతో ఉన్న మనిషి మహా ప్రమాదం. కాబట్టి మీరు విజయాన్ని సాధించడానికి ఏం చేయాలో ఈరోజు నుంచే ఆలోచించుకోండి.