AP Land Rates : వైజాగ్ లో తగ్గుముఖం..! అమరావతిలో పెరిగిన భూముల ధరలు

Best Web Hosting Provider In India 2024


Land Rates in AP : రాష్ట్రంలో అధికారం మార్పు, అనేక మార్పులకు దారి తీస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రంలోని భూముల ధరల మార్పు జరుగుతోంది. టీడీపీ కూటమి గెలవడంతో వైజాగ్ లో భూముల ధరలు తగ్గుతున్నాయి. మరోవైపు అమరావతిలో భూముల ధరలు పెరుగుతున్నాయి. దీనివల్ల వైజాగ్ వాసుల్లో పెద్దగా దు:ఖం కనిపించటం లేదు. కానీ అమరావతి పరిసర ప్రాంతాల ప్రజల్లో మాత్రం పట్టలేనంత ఆనందం వెల్లువిరుస్తుంది.

 

2014 రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఏర్పాటు అనివార్యం అయింది. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఎంపిక కోసం నాటి యూపీఏ-2 ప్రభుత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కే.సీ శివరామకృష్ణన్ చైర్మన్ గా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ నియమించింది. ఈ కమిటీ తుది నివేదికను 2014 ఆగస్టు 31లోపు అందజేయాలని శివరామకృష్ణన్ కమిటీని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వం చెప్పిన రోజుకంటే ముందే ఆగస్టు 29న అందజేసింది.

 

కమిటీ తన నివేదికలో మూడు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేస్తే అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా చూడొచ్చనని తెలిపింది. అయితే నాటి చంద్రబాబు ప్రభుత్వం కమిటీ సిఫార్సులను పక్కనపెట్టి అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని చేపట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజధాని ప్రాంతాన్ని ఆ కమిటీ కూడా వ్యతిరేకించింది. అమరావతి ప్రాంతంలో వరదలు సంభవించే ప్రమాదం ఉందని కమిటీ పేర్కొంది. కానీ రాష్ట్రం ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదికలోని ఒక్క అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదు.

 

అమరావతిలో రాజధాని నిర్మాణం నాటి చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది. గుంటూరు, విజయవాడ ప్రాంతాలను కలుపుతూ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సిఆర్డీఏ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజధాని నిర్మాణానికి దాదాపు 35 వేల ఎకరాలను రైతుల నుంచి రాష్ట్రం ప్రభుత్వం సేకరించింది. తాత్కాలిక రాజధాని పేరుతో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలను నిర్మించింది. గత తొమ్మిదేళ్లగా అమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. తరువాత హైకోర్టు నిర్మాణం, సెక్రటేరియట్ నిర్మాణం జరిగాయి. దీంతో అక్కడి నుంచి పరిపాలన, న్యాయ వ్యవహారాలు కొనసాగుతున్నాయి.

 

దీంతో అమరావతి పరిసర ప్రాంతాల్లో భూముల రేట్లు, అపార్ట్మెంట్ రేట్లు భారీగా పెరిగాయి. భారీ స్థాయిల్లో నిర్మాణాలు జరిగాయి. రియల్ ఏస్టేట్ భారీగా జరిగింది. రాష్ట్రంలోని రియల్ ఏస్టేట్ వ్యాపారులంతా అమరావతి చుట్టు పక్కల గ్రామాల్లోనే తిష్ట వేశారు. చిన్న చితక రైతుల వద్ద భూములను అధిక ధరలకు కొనుగోలు చేశారు. ఎకరా రూ.20 లక్షలు కూడా చేయని భూమి ఒక్కసారిగా రాజధాని ప్రకటనతో రూ.90 వేల నుంచి రూ.కోటి దాటింది. దీంతో అమరావతికి దాదాపు 20 నుంచి 30 మీటర్ల మేర రైతులు తమ భూములను అమ్ముకొని… సుదూర ప్రకాశం, విజయనగరం వంటి ప్రాంతాల్లో ఎక్కువ భూములను కూడా కొనుగోలు చేశారు.

 

అయితే 2019లో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా ఓటమి చెంది, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2020 జనవరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును తెచ్చి, అమరావతిలో అసెంబ్లీ, వైజాగ్ లో సచివాలయం, కర్నూల్ లో హైకోర్టును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన రాష్ట్రంలో సంచలనం అయింది. దీంతో అమరావతిలో భూముల రేట్లు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు వైజాగ్ లో భూముల రేట్లు పెరిగాయి. అమరావతి రైతులు ఆందోళన బాట పట్టారు. అయితే ఇటీవలి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఘోర ఓటమిని చవిచూసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

 

అమరావతిలో భూముల ధరలు పెరుగుదల

సరిగ్గా ఇప్పుడు పరిస్థితి  రివర్స్ అయింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైజాగ్ లో భూముల ధరలు తగ్గి, అమరావతిలో పెరిగాయి. అమరావతిలో భూమి గజం లక్ష రూపాయాల నుంచి రూ. రెండు లక్షలకు పెరిగింది. అంటే ఎకరం భూమి దాదాపు రూ.80 కోట్లపైమాటే పలుకుంది.

 

అమరావతి రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలం తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి, మందడం తదితర గ్రామాలు, మంగళగిరి మండలంలోని నిడమర్రు, కృష్ణాయపాలెం, కురగల్లు తదితర గ్రామాలు, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక తదితర గ్రామాల్లో మొన్నటి వరకు భూమి గజం రూ.3,500 నుంచి రూ.4,000 ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.45 వేలకు చేరిందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడ ఎకరం భూమి కొనుగోలు చేయలంటే, ఏకంగా రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది.

 

 రాజధానికి సమీపంలో ఉన్న విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లోనూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పంజుకున్నాయి. అలగే అపార్టమెంట్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. డబుల్ బెడ్రూం ఫ్లాంట్ ధర రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు రూ.60 లక్షల కంటే ఎక్కువే పలుకుతుంది.

 

వైజాగ్ లో భూముల ధరలు తగ్గుముఖం..!

మరోవైపు వైజాగ్ లో భూముల ధరలు, అపార్టమెంట్ ధరలు తగ్గుతున్నాయి. వైజాగ్ లో ఖరీదైన (ప్రైమ్ ఏరియాలు) ప్రాంతాలైన సీతమ్మధార, ఏంవీపీ కాలనీ, సిరిపురం జంక్షన్, దసపల్లా హిల్స్, అక్కయ్యపాలెంలో భూముల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. సీతమ్మధారలో గతంలో భూమి గజం రూ.1,60,000 నుంచి రూ.1,70,000 ఉండేది. ఇప్పుడు అక్కడ రూ.1,10,000 నుంచి రూ.1,20,000 వరకు తగ్గింది. ఏంవీపీ కాలనీలో కూడా గతంలో భూమి గజం రూ.1,60,000 ఉండేది. ఇప్పుడు అక్కడ రూ.1,10,000 వరకు తగ్గింది.

 

సిరిపురం జంక్షన్ లో గతంలో భూమి గజం రూ.1,80,000 ఉండేది. ఇప్పుడు అక్కడ రూ.1,30,000 వరకు తగ్గింది. దసపల్లా హిల్స్ లో గతంలో భూమి గజం రూ.1,80,000 నుంచి రూ.1,90,000 ఉండేది. ఇప్పుడు అక్కడ రూ.1,30,000 నుంచి రూ.1,40,000 వరకు తగ్గింది. అక్కయ్యపాలెంలో గతంలో భూమి గజం రూ.1,30,000 ఉండేది. ఇప్పుడు అక్కడ రూ.1,00,000 వరకు తగ్గింది.

 

అంటే గతంలో వైజాగ్ ప్రైమ్ ఏరియాలో ఎకరం భూమి రూ.62 కోట్ల నుంచి రూ.90 కోట్ల వరకు ఉండేది. ఇప్పుడది, రూ.48 కోట్ల నుంచి రూ.67 కోట్లకు తగ్గింది. అలాగే వైజాగ్ అనుకొని ఉన్న సాగర్ నగర్, రుషికొండ, ఎండాడ, భీమిలి ప్రాంతాల్లో గతంలో భూమి గజం రూ.1,30,000 ఉండగా, ఇప్పుడు రూ.1,00,000కి తగ్గింది. మధురవాడ, పీఎం పాలెం ప్రాంతాల్లో గతంలో భూమి గజం రూ.1,20,000 నుంచి 1,30,000 వరకు ఉండగా, ఇప్పుడు రూ.1,00,000 నుంచి రూ.90,000కు తగ్గింది. అలాగే పెందుర్తి, సబ్బవరం, అనకాపల్లి, యలమంచిలి, విజయనగరం, భోగాపురం వంటి ప్రాంతాల్లో కూడా భూముల ధరలు కాస్తా తగ్గుముఖం పట్టాయి.

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచిన పిఠాపురంలో కూడా భూముల ధరలు పెరిగాయి. గతంలో గజం రూ.5 వేల నుంచి రూ.7 వేల ఉన్న భూమి, ఇప్పుడు రూ.పది వేలకు పెరిగింది.

 

రిపోర్టింగ్ – జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు.

 

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్

AmaravatiAndhra Pradesh NewsVisakhapatnamReal Estate

Source / Credits

Best Web Hosting Provider In India 2024