Best Web Hosting Provider In India 2024

ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. గత ఆదివారం రాత్రి మహబూబాబాద్ లో ఆయన పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఎస్సై ఆత్మహత్యాయత్నం వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది. ఎస్సై శ్రీనివాస్ సెల్ఫోన్లో నమోదైన వాంగ్మూలం ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఎస్సై ఆత్మహత్య యత్నానికి కారణం సీఐ జితేందర్ రెడ్డిగా తేల్చారు.
దీంతో సీఐను ఐజి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న నలుగురు కానిస్టేబుళ్లను సైతం జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
సీఐపై అనేక ఆరోపణలు..!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు వివాదాస్పంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఐజి కార్యాలయానికి అటాచ్ అయిన సీఐ జితేందర్ రెడ్డి పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లుగా అధికారులు నిగ్గు తేల్చారు. ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ను ఆయన అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
సీఐ జితేందర్ రెడ్డి ఆయన పరిధిలో పని చేసే సిబ్బందితో పాటు అనేక సమస్యలపై స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులపై కూడా వ్యవహరించే తీరు వివాదాస్పదంగా మారింది. స్టేషన్లో కానిస్టేబుళ్లను తన వైపునకు తిప్పుకొని నేరుగా పసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో సీఐపై వేటుపడడం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాగా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలో మరో రైతు ఆత్మహత్యాయత్నం..!
ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మ హత్యలు కలకలం రేపుతున్నాయి. తన భూమిని ఆక్రమించారంటూ జిల్లాలోని చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన బోజెడ్ల ప్రభాకర్ సెల్ ఫోన్ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్పందించి విచారణకు ఆదేశించారు.
ఈ ఘటన మరిచిపోకముందే ఖమ్మం జిల్లాలో మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక మాజీ ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారి తన వ్యవసాయ భూమిని అన్యాయంగా ఆక్రమించుకుని గత మూడు సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాడని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఆలియా తండా గ్రామానికి చెందిన పచ్చిపాల భద్రయ్య అనే రైతు తాజాగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఆర్టీఏ మాజీ కమిషనర్ శంకర్ నాయక్.. తన ఎకరంన్నర భూమిని దున్నుతుండగా అడ్డుపడిన రైతు భద్రయ్య పై, అతని కుటుంబీకులపై దాడికి పాల్పడటంతో మనస్థాపానికి గురైన భద్రయ్య తన వ్యవసాయ భూమి వద్దే పురుగుల మందు తాగి ఆత్మాహత్యా యత్నానికి పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యులు భధ్రయ్యను హుటాహుటిన ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భద్రయ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఒక మాజీ ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారి అయి ఉండి కూడా తమ భూమిని ఆక్రమించి గత మూడు సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాడని భద్రయ్య భార్య భాగ్యమ్మ ఆరోపిస్తోంది.
అమ్మనందుకే ఆక్రమణ..
తమ కుటుంబీకులు అందరూ మూడేళ్ళ కిందట భూమిని అమ్మేసుకున్నారని ఆమె చెబుతోంది. కాగా పిల్లల భవిష్యత్ కోసం తమ ఎకరంన్నర భూమిని అమ్మకుండా కాపాడుకుంటూ వస్తున్నామని చెప్పింది. అయితే తమ భూమిపై కన్నేసిన శంకర్ నాయక్ తనకు భూమిని అమ్మాలని ఒత్తిడి చేశాడని వాపోయింది.
ఎకరం రూ.4 లక్షలకే తనకు విక్రయించాలని ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఎంతకీ తాము ఒప్పుకోకపోయేసరికి బలవంతంగా ఆక్రమించున్నాడని భద్రమ్మ తెలిపింది. అలా ఆక్రమించుకుని గడిచిన మూడేళ్ళుగా దున్నుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
అప్పటి నుంచి తన భర్త భద్రయ్య భూమి కోసం పోరాడుతూనే ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోతోందని వాపోయింది. ఎస్సై, తహసీల్దార్, మంత్రి వద్దకు వెళ్లి కాళ్ళ మీద పడినా తమకు ఏ ఒక్కరూ న్యాయం చేయలేదని విలపించింది. తాజాగా ఆక్రమణదారుడికి సంబంధించిన వ్యక్తులు ట్రాక్టర్ తో భూమిని దున్నుతున్న సమయంలో తన భర్త వారిని అడ్డుకున్నాడని చెప్పింది.
దీంతో ఆయనతో పాటు మా కుటుంబీకులపై కూడా వారు దాడికి యత్నించారని పేర్కొంది. దీంతో మనస్థాపంతో తన భర్త భద్రయ్య చేలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని బోరున విలపిస్తోంది. కాగా భద్రయ్య భూమిపై కన్నేసింది ఒక మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారి కావడం గమనార్హం. ప్రస్తుతం భద్రయ్య ఖమ్మంలోని ఒక ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.
రిపోర్టింగ్ – కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.
సంబంధిత కథనం
టాపిక్