Immunity boosters: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకునే సహజ మార్గాలు ఇవే

Best Web Hosting Provider In India 2024

రోగనిరోధక శక్తి పెరగాలంటే మందులు వాడాల్సిన అవసరం లేదు. మన రోజూ వారీ జీవితంలో కొన్ని మార్పుల వల్ల సహజంగానే రోగ నిరోధక శక్తి క్రమంగా మెరుగుపడుతుంది. తరచూ జలబు, జ్వరాలు రావడం, నీరసంగా ఉండటం.. లాంటి సమస్యలకు రోగ నిరోధక శక్తి తక్కువుండటం కారణం. వర్షాకాలంలో ఈ సమస్యల నుంచి బయటపడాలింటే రోగనిరోధక శక్తి అవసరం. దాన్ని సహజంగా పెంచుకునే మార్గాలేంటో చూసేయండి.

1. రెయిన్ బో డైట్:

అంటే మనం తినే ఆహారంలో అన్ని రకాల కూరగాయలు, పండ్లు ఉండాలి. పాలకూర పప్పు భోజనంలో తింటే సాయంత్రం పూట నారింజ పండు లేదా క్యారట్ తినడం.. క్యాప్సికం కర్రీ తింటే బెర్రీలు తినడం.. ఇలా రోజులో రకరకాల రంగులున్న పండ్లు కూరగాయలు తినాలి. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఏవైనా అంతే. ఎక్కువగా సి విటమిన్ ఉండే నిమ్మజాతి పండ్లు తీసుకోవచ్చు. వీటివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బెర్రీలు, ఆరెంజ్, నిమ్మకాయలు, క్యాప్సికం..లాంటివి ఎక్కువ తినాలి. అలా తినలేకపోతే ఒకేసారి స్మూతీలా చేసుకోవచ్చు. బెర్రీలు, బనానా, గుప్పెడు పాలకూర, చియా గింజలు కలిపి పాలు లేదా నీళ్లతో మిక్సీ పట్టి స్మూతీ తాగేయొచ్చు. ఇలా రకరకాలుగా ప్రయత్నించొచ్చు.

2. ఆల్కహాల్:

ఆల్కహాల్ తాగడం వల్ల చాలా రకాల వ్యాధులొస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి కూడా ఇది కారణం. ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ఆల్కహాల్ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గిపోతుంది. మనిషి బలహీనంగా మారిపోతారు. కాబట్టి దీనికి దూరంగా ఉంటే ఆరోగ్యం తెచ్చుకున్నట్లే.

3. ప్రొటీన్:

శరీరం ఎదుగుదలకు, శక్తికి ప్రొటీన్ అవసరం. కాబట్టి హెల్తీ ప్రొటీన్ ఎంచుకోవాలి. గుడ్లు, శనగలు, పెసర్లు, మీల్ మేకర్, చికెన్, పప్పులు, బీన్స్ లాంటివి మంచి ఎంపిక. వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. పన్నీర్, టోఫు, చీజ్, పాల ఉత్పత్తుల్ని కూడా చేర్చుకోవాలి.

4. నీళ్లు:

మన శరీరంలో ఎక్కువ శాతం ఉండేది నీరు. ఎప్పటికప్పుడు శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవాలి. హెర్బల్ టీలు, కూరగాయలు జ్యూసులు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగుతుండాలి. తప్పకుండా రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. ఇది శరీరం ఆరోగ్యంగా ఉండేలా సాయపడుతుంది. కిడ్నీ సంబంధిత వ్యాధుల్తో పాటూ చాలా రకాల రోగాల్ని మనకు రాకుండా కాపాడుకోవచ్చు.

5. వ్యాయామం:

మెట్లు ఎక్కడం, నడవటం లాంటివి మానేయకండి. రోజులో కొన్ని పనులకు నడిచే వెళ్లాలని నియమం పెట్టుకోండి. రోజులో కనీసం అయిదు రోజులైనా అరగంట పాటూ వ్యాయామం చేయండి. యోగాసనాలు చేయొచ్చు. డ్యాన్స్ చేయొచ్చు. జాగింగ్ చేయొచ్చు. ఏదో ఒక రకంగా శరీరం కదిలేలా చూసుకోండి.

6. శ్వాస వ్యాయామాలు:

శ్వాస మీద ధ్యాస పెట్టి ద్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి అనేక రోగాలకు కారణం. కాబట్టి రోజుకు కనీసం అయిదు నిమిషాలన్నా శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటాం. దీని ప్రభావం మన రోగనిరోధక శక్తిమీద తప్పకుండా ఉంటుంది.

7. నిద్ర:

రోజంతా ఎంత కష్టపడ్డా మన శరీరం మరమ్మతు చేసుకునేది మనం పడుకున్నప్పుడు. సరైన నిద్రలేకపోతే ఊరికే నీరసంగా అనిపిస్తుంది. నిద్ర పట్టకపోతే మంచి బాతింగ్ సాల్ట్ తో స్నానం చేయడం, ఎలక్ట్రానిక్ డివైస్ వాడకుండా ఉండటం, నిద్రపోయే సమయం కన్నా కనీసం రెండు గంటల ముందే తినడం లాంటి నియమాలు పాటించాలి. దాని ద్వారా తొందరగా నిద్ర పడుతుంది. కొత్త ఉత్సాహంతో మరో రోజు మొదలుపెడతారు.

ఇవన్నీ పాటించడం ద్వారా మన రోగనిరోధక శక్తి క్రమంగా మెరుగుపడుతుంది. ఎలాంటి మందులు అవసరం లేకుండా ముందు ఇవి ప్రయత్నించి చూడండి.

 

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024