CM CBN: చంద్రబాబు చెప్పిందొకటి, సిఎంఓ చేసేదొకటి, ఐఏఎస్‌, ఐపీఎస్‌ పోస్టింగుల్లో ఓ అధికారి మాయాజాలం

Best Web Hosting Provider In India 2024

CM CBN: ఐదేళ్ల రాజకీయ పోరాటం తర్వాత ఏపీ ప్రజలు కనివిని ఎరుగని మెజార్టీతో చంద్రబాబుకు ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని కొందరు అధికారులు గుప్పెట్లోకి తీసుకున్నారనే ఆరోపణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నవారు, వైసీపీ అనుకూల అధికారులుగా ముద్ర పడిన వారికి సైతం అనూహ్యంగా ప్రాధాన్యత దక్కుతుండటంపై కొద్ది రోజులుగా బ్యూరోక్రాట్లు పెదవి విరుస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం చంద్రబాబు నమ్మకముంచి నియమించుకున్న సిఎంఓ నుంచే జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

ఏపీలో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెలరోజులు కూడా పూర్తికాలేదు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కుదురుకుంటోంది. అన్ని ప్రభుత్వ శాఖల్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు, పదవీ కాలం పూర్తైన వారిని ఇంటికి పంపేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల్లో కీలకంగా వ్యవహరించిన అధికారులను గుర్తించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలకు భిన్నంగా ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడుతున్నాయి. దీనంతటికి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న అధికారులే కారణమని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.

పొస్టింగుల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకం న్యాయం…

ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల పోస్టింగుల్లో 2016 బ్యాచ్‌కు చెందిన గుంటూరు మునిసిపల్ కమిషనర్‌ కీర్తి చేకూరికి బదిలీల్లో కలెక్టర్ పోస్టింగ్ లభిస్తుందని భావించారు. ఆమె తన బ్యాచ్‌లో టాపర్‌గా ఉన్నారు. కీర్తి భర్త కూడా ఐఎఫ్ఎస్‌ అధికారిగా పని చేస్తున్నారు. గతంలో కడప జిల్లాలో వైసీపీ నాయకులు చెప్పిన పనుల్ని చేయకపోవడంతో వైసీపీలో ముఖ్య నాయకుడి బంధువు ఆదేశాలతో ఆయనను ప్రాధాన్యత లేని పోస్టింగ్‌కు బదిలీ చేశారు.

అదే సమయంలో రాజధాని ప్రాంతంలో ఇటీవల కీలకమైన జిల్లా కలెక్టర్‌ పోస్టింగ్ దక్కించుకున్న అధికారి గత ఐదేళ్లలో వైసీపీతో అంటకాగారు. విశాఖపట్నాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నారనే అధికారితో అంటకాగారు. ఆ పోస్టింగ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. తాజా బదిలీల్లో తనకు కోరుకున్న స్థానంలో పోస్టింగ్‌ ఇవ్వకపోతే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని కన్నీళ్లు పెట్టుకోవడంతోనే పోస్టింగ్ ఇచ్చినట్టు సిఎంఓ అధికారి సన్నిహితుల వద్ద ప్రచారం చేశారు.

నిజానికి పోస్టింగ్ దక్కడం వెనుక ముఖ్యమంత్రికి సన్నిహితుడైన సీనియర్ న్యాయవాది ఒకరు చక్రం తిప్పినట్టు సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఏ పార్టీది అయినా కొందరికి కోరుకున్న పోస్టింగులు దక్కుతాయనే గుసగుసలు ఉన్నాయి. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులకు గురైన అధికారులకు టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇబ్బందులకు గురి చేయడంపై అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

ఆ ముగ్గురు అధికారులే కీలకం…

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో జరుగుతున్న పోస్టింగులలో ముగ్గురు అధికారులు చక్రం తిప్పుతున్నట్టు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. సిఎంఓలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఐఏఎస్‌ అధికారి ముద్దాడ రవిచంద్ర ఉన్నారు. పరిపాలన వ్యవహారాలు ఆయనకు కూడా కొత్త కావడంతో జిఏడిలో ఉన్న అధికారులపై పూర్తిగా ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు సహాయంగా ఉన్న అధికారులు అంతా తామై చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ముఖ్యమంత్రి పిఎస్‌గా ఉన్న పశు సంవర్ధక శాఖకు చెందిన అధికారి ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనత పాటు గత టీడీపీ ప్రభుత్వంలో సిఎంఆర్‌ఎఫ్‌ నిధుల దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో అధికారి కూడా సిఎంఓలో తిష్ట వేశారు.

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సిఎంఆర్‌ఎఫ్ అక్రమాలపై విచారణ చేపట్టారు. దాదాపు మూడేళ్లకు పైగా సిఎంఆర్‌ఎఫ్‌ను పూర్తిగా నిలిపివేశారు. ఈ క్రమంలో అప్పటి సచివాలయ ఉద్యోగ సంఘం నాయకుడికి లొంగిపోయిన సదరు అధికారి జిఏడిలో స్థానం సంపాదించారు. గత ప్రభుత్వంలో చెప్పినట్టు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. జిఏడి జనరల్‌ డిపార్ట్‌మెంట్‌లో అత్యున్నత స్థానంలో ఉన్న అధికారిపైనే ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా ఉన్న ఐఏఎస్‌ అధికారి ఆధారపడుతున్నారనే విమర‌్శలు ఉన్నాయి. ముఖ్యమైన పోస్టింగుల విషయంలో ఇప్పుడు వారే చక్రం తిప్పుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడిగా విధుల్లో చేరిన మరో అధికారి తనకు సాయంగా మరో ముగ్గురు సహాయకుల్ని నియమించుకున్నారు. వీరంతా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులే కావడం విశేషం. ముఖ్యమంత్రి సహాయకుడికి మరో ముగ్గురు సహాయకులు ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వేర్వేరు ప్రభుత్వ శాఖలకు చెందిన వారిని సచివాలయ విధుల్లో నియమించుకుని వారి ద్వారా పనులు చక్కబెడుతున్నారనే గుసగుసలు ఉన్నాయి. గన్నవరంలో వెటర్నరీ సర్జన్‌గా పనిచేసే వ్యక్తితో పాటు, గుంటూరులోని కోపరేటివ్ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు ప్రస్తుతం సిఎంఓలో పాగా వేశారు. వీరందరి నియామకాలకు సిఎం కార్యదర్శి జూన్‌ 19న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

పాత వాళ్లే పాగా వేశారు…!

వైసీపీ ప్రభుత్వంలో సిఎంఆర్‌ఎఫ్‌లో విధులు నిర్వర్తించిన వైద్యురాలిని మాతృ సంస్థకు పంపాలని ఎన్నికలకు ముందు అప్పటి ఇన్‌ఛార్జి ఆదేశించారు. నాటి ప్రభుత్వంలో జిఏడిలో ఉన్న అధికారి అభయంతో తాజాగా ఆమెకు మళ్లీ సిఎంఆర్‌ఎఫ్‌లోనే పోస్టింగ్ దక్కింది. దీనికి సిఎంఓలో పాగా వేసిన మాజీ సిఎంఆర్‌ఎఫ్‌ అధికారి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది.

ఇక ప్రోటోకాల్ విభాగంలో చాలా ఏళ్ల క్రితమే రిటైర్ అయిపోయిన మహిళా అధికారిని ఇప్పటికి అదే శాఖలో కొనసాగిస్తున్నారు. సదరు అధికారిణి భర్త కూడా సచివాలయ ఉద్యోగి కావడంతో గత ప్రభుత్వంలో ఆమె కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ చేసి చాలా కాలమైనా కొత్త ప్రభుత్వంలో కూడా ఆమెను కొనసాగించేందుకు టీడీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధమైంది.

ప్రస్తుతం సిఎంఓను గుప్పెట్లో పెట్టుకున్న అధికారులు వైసీపీ హయంలో అంతులేని అధికారాన్ని అనుభవించిన వారే అయినా వారిని చంద్రబాబు కొనసాగించడంపై అధికారుల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో కొందరికి ప్రాధాన్యత, మరికొందరిని అప్రాధాన్య పోస్టింగుల్లో నియమించడంతో చంద్రబాబును ఏమరుస్తున్నారా, ఆయనకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయా అనే చర్చ జరుగుతోంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

Chandrababu NaiduGovernment Of Andhra PradeshTelugu NewsLatest Telugu NewsBreaking Telugu NewsAndhra Pradesh News
Source / Credits

Best Web Hosting Provider In India 2024