
Best Web Hosting Provider In India 2024

చిన్న పిల్లలు పలికే చిలకపలుకల కోసం ప్రతి కుటుంబం, తల్లిదండ్రులు ఎదురు చూస్తారు. అమ్మా, నాన్న,తాత, మామా అంటూ అందర్నీ పిలిస్తే గుండె నిండా సంతోషమే. ఈ క్షణం కోసం అంతా ఆతృతగా ఎదరుచూస్తారు. అయితే పిల్లల ఎదుగుదలలో ప్రతి మైలురాయికి ఒక సమయం అంటూ ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్లే తప్పకుండా మాట్లాడతారు. అంతేకానీ వాళ్లతో వడివడిగా పలుకులు పలికించాలని కొన్ని తప్పులు చేయకూడదు. అలాగనీ కొన్ని విషయాల్లో నిర్లక్ష్యమూ పనికిరాదు. దీనివల్ల పిల్లలకు మాట రావడం ఆలస్యం అవ్వచ్చు. వాళ్ల ఎదుగుదలకు ఇవి ఆటంకం కలిగిస్తాయి. అలా పిల్లలకు మాటలు నేర్పించే క్రమంలో చేయకూడని పొరపాట్ల గురించి తెల్సుకుందాం.
పిల్లలతో మాట్లాడకపోవడం:
బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో మాట్లాడటానికి సమయం కేటాయించలేకపోతున్నారు. మీరు చేసిన ఈ తప్పు వల్ల పిల్లల ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది. మీరు మాట్లాడింది వినడం ద్వారా మాత్రమే పిల్లలు మాటలు నేర్చుకుంటారు. కాబట్టి వీలైనంతగా వాళ్లతో సమయం కేటాయించండి. మంచి కథలు, ముచ్చట్లు చెబుతూ ఉండండి. చిన్న చిన్న మాటలు వాళ్ల ముందు మాట్లాడుతూ ఉంటే వాళ్లు వాటిని గుర్తుంచుకుంటారు. పదే పదే ఒక పదం నేర్పించి చూడండి కచ్చితంగా మీకు వాళ్లు స్పందించడం నేర్చుకుంటారు. దాన్ని మెల్లగా పలుకుతారు.
మధ్యలో ఆపడం:
ఎవరికైనా సరే పిల్లలు స్పష్టంగా మాట్లాడితే వినాలని ఉంటుంది. కానీ వాళ్లు మాటలు మొదలెట్టిన కొద్ది రోజులకే ప్రతిసారి వాళ్లను ఆపి వాళ్లు పలికిన శబ్దాన్ని సరిచేయాల్సిన అవసరం లేదు. మీరలా ప్రతిసారి వాళ్ల సంభాషణకు ఆటంకం కలిగిస్తే వాళ్లు మాట్లాడటం ఆపేస్తారు. వాళ్లను మధ్యలో ఆపకుండా క్రమంగా స్పష్టంగా మాట్లాడే అలవాటు చేయండి. వాళ్లతో పాటూ మీరు కూడా మాట్లాడుతుంటే విని సరి చేసుకుంటారు.
తోటి పిల్లలతో ఉండటం:
తల్లిదండ్రులు తమ పిల్లల్ని రోజులో కొంత సమయం వాళ్ల వయస్సు పిల్లలతో గడిపేలా శ్రద్ధ వహించాలి. తోటి పిల్లలను చూసి కొత్త విషయాలు నేర్చుకుంటారు. అంతేకాక సొంతంగా ఎదుటి పిల్లల పదాలను గ్రహించి, అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది వాళ్లలో.
స్పీచ్ థెరపీ:
చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకి త్వరగా మాట్లాడటం నేర్పడానికి స్పీచ్ థెరపీని ఆశ్రయించడం ప్రారంభిస్తారు. కానీ డాక్టర్ ను అడగకుండా ఇలాంటి తప్పు చేయకండి. వైద్యుడిని సంప్రదించిన తర్వాత మీ బిడ్డకు స్పీచ్ థెరపీ అవసరమా అని నిర్ణయించండి. పిల్లలు మాట్లాడటం ఆలస్యం చేయడానికి అనేక ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. అలాగే మీ బిడ్డను ఇతర పిల్లలతో పోల్చడం వాళ్లకు ఏమాత్రం మేలు చేయదు. వాళ్ల అభివృద్ధికి అదొక అంతరాయం అవుతుంది. ప్రతి పిల్లల ఎదుగుదల ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఒకరితో పోల్చి ఇంకా మాట్లాడట్లేదంటూ మీరు ఆందోళన పడటం, వాళ్ల మీద ఒత్తిడి పెట్టడం సరికాదు.
సలహా:
మీ బాబు లేదా పాప వయసు 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే, ఇంకా మాట్లాడటం నేర్చుకోకపోతే, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.