AP University VCs: ఇంచార్జి వీసీల నియామకాలపై రగడ..ఆరోపణలున్న వారికే పదవులు.. ఏయూ, నాగార్జునా, రాయలసీమ వర్శిటీల్లో వివాదం

Best Web Hosting Provider In India 2024

AP University VCs: ఆంధ్రప్రదే‌శ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటై నెలరోజులు గడుస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో వైస్‌ ఛాన్సలర్లు పదవుల నుంచి తప్పుకున్నారు. ఏయూ, నాగార్జున వంటి విశ్వవిద్యాలయాల్లో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. కొన్ని చోట్ల ఒత్తిళ్ల నడుమ వీసీలు పదవుల నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు యూనివర్శిటీలకు ఇంచార్జి వైస్‌‌ఛాన్సలర్లను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు విడుదలయ్యాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 17 యూనివర్శిటీలకు ఇంచార్జి వీసీలను నియమించారు. ఈ క్రమంలొ కొన్ని నియామకాలపై రగడ మొదలైంది. వీసీలకు బాధ్యతలు అప్పగించే క్రమంలో ఆ శాఖ మంత్రిని కొందరు తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం, గుంటూరులోని ఆచార్య నాగార్జునా విశ్వ విద్యాలయం, రాయలసీమ వర్శిటీల్లో నియామకాలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏయూలో ఆయన ఆత్మకే అవకాశం..

విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయ ఇంచార్జి బాధ్యతలను శశి భూషణరావుకు అప్పగించడంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఏయూ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి ఆత్మే వర్శిటీని పాలించినట్లుగానే ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి.

ఆచార్య జి.శశిభూషణరావు ఏ.యూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపల్ గా ఉన్నారు. మాజీ వీసీ ఆచార్య పీవిజిడి. ప్రసాద్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందాు.

2014-19 మధ్యకాలంలో ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు అండదండలతో శశిభూషణరావు ఏయూ పాలకమండలి సభ్యుడిగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రసాద్ రెడ్డికి వర్శిటీలో సీనియర్ ప్రొఫెసర్ గా పదోన్నతి కల్పించడంలో పాలకమండలి సమావేశాలలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.

అర్హతలు లేకపోయినా సీనియర్ ప్రొఫెసర్‌ పదోన్నతులు దక్కడంలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయూ వీసీగా ప్రసాదరెడ్డి ఏకపక్షంగా వ్యవహరించినా శశిభూషణరావు ఏనాడు వాటిని ఖండించలేదని అధ్యాపకులు చెబుతున్నారు.

ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా, ఇంజనీరింగ్ కాలేజీలోప్రసాద్ రెడ్డి చర్యలను సమర్థించారని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వారికే బాధ్యతలు అప్పగించడాన్ని అధ్యాపకులు తప్పు పడుతున్నారు. ఏయూలో చేసిన నియామకాలపై మానవవనరుల శాఖ మంత్రికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

ఆచార్య నాగార్జునలో మరో వివాదం…

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంచార్జి వీసీ నియామకం పై దుమారం రేగుతోంది. నాగార్జున యూనివర్సిటీ ఇంచార్జి వీసీగా ప్రొఫసర్ కంచర్ల గంగాధర్ 1988 నుండి కంప్యూటర్ సైన్స్ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు.

యూనివర్సిటీ వ్యవహారాలపై పెద్దగా పట్టు లేదని, బోధనేతర సిబ్బందితో పాటు సహచర అధ్యాపకులకు సైతం ఆయన గురించి పెద్దగా తెలీదని అధ్యాపకులు చెబుతున్నారు. అకడమిక్‌ విభాగంలో యూనివర్సిటీలో ఎలాంటి గుర్తింపు లేకపోయినా బాధ్యతలు కట్టబెట్టడాన్ని తప్పు పడుతున్నారుర.

అధ్యాపక వృత్తిలో ఉండగానే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం 4ఏళ్లు సెలవుపెట్టి వెళ్లారని చెబుతున్నారు. రెండేళ్లుగా మాజీ వీసీకి అనుకూలంగా వ్యవహరించారని , మాజీ వీసీ హయంలో జరిగిన అవినీతి అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉండదని అధ్యాపకులు, విద్యార్ధి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

గత ఐదేళ్లలో యూనివర్శిటీకి అవసరం లేకున్నా పెద్ద ఎత్తున వైసీపీ సానుభూతి పరులకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.100కోట్లకు పైగా యూనివర్శిటీ నిధులు దుర్వినియోగం చేశారని, కాంట్రాక్టర్లకు దాదాపు రూ.3కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉందని, ఈ పనులు చక్కబెట్టడం కోసమే కొందరు చక్రం తిప్పి ఇంచార్జి బాధ్యతలు దక్కేలా చేశారని ఆరోపిస్తున్నారు. మాజీ వీసీ అనుచరులకు గెస్ట్‌ ఫ్యాకల్టీగా అవకాశం కల్పించారని కొత్త ప్రభుత్వంలో వైసీపీ అనుకూలురికే బాధ్యతలు అప్పగించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

విజిలెన్స్‌ విచారణ సిఐడి కేసులున్నా బాధ్యతలు…

రాయలసీమ యూనివర్సిటీ ఇంచార్జ్ వీసీగా ఎన్‌టికే నాయక్ ఎంపికపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయక్‌పై విజిలెన్స్ ఎంక్వయిరీ పెండింగ్‌లో ఉంది.

రాయలసీమ యూనివర్శిటీలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఉన్నత విద్య మండలి జరిపిన విచారణలో రూ.1.39కోట్ల విలువైన ఓచర్లు, రూ.7.70లక్షల విలువైన ఫర్నీచర్‌ మాయమైనట్టు విజిలెన్స్‌2016లో జరిగిన విచారణలో గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందడంతో మాజీ వీసీ జే.వీ.ప్రభాకర్‌, 2016లో వీసీగా ఉన్న ప్రొఫెసర్ కృష్ణనాయక్, అప్పటి రిజిస్టార్ ప్రొఫెసర్ ఎన్‌టికె.నాయక్‌ సూపరింటెండెంట్‌ నారాయణప్పలపై విచారణ జరిపి దోషులెవరో నిర్థారించాలని నాటి ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత్రా దావ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ఆధారంగా అభియోగాలను నమోదు చేసి సిఐడి విచారణ జరిపారు.

రాయలసీమ యూనివర్శిటీలో రిజిస్టార్‌గా పనిచేసిన ఎన్‌టికె నాయక్‌పై విచారణ జరిపి, ఛార్జిషీట్ నమోదు చేసేందుకు 2023 జనవరి27వ తేదీన నాటి వర్శిటీ రిజిస్టార్‌ ప్రభుత్వానికి అనుమతించారు. ప్రొఫెసర్‌ ఎన్‌.టి.కె.నాయక్‌తో పాటు సూపరింటెండెంట్‌ ఎం.వి.నారాయణప్పలపై ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు యనివర్శిటీ పాలక మండలి 2024 జనవరి 24న అమోదం తెలిపింది. దాని ఆధారంగా ఛార్జిషీట్ కు అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విచారణ ఇంకా జరుగుతుండగానే ఇంఛార్జి విసిగా నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యాశాఖలో ఏమి జరుగుతోంది…

విద్యాశాఖలో తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల వెనుక ఓ అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాయలసీమ జిల్లాలో అత్యంత వివాదాస్పందగా వ్యవహరించిన సదరు అధికారి కొత్త ప్రభుత్వంలో మంత్రి పేషీలో పాగా వేశారు. ఇంటెలిజెన్స్‌ నివేదికల్లో అతనికి ప్రతికూలంగా ఉన్నా, అవినీతి ఆరోపణలు వచ్చినా సదరు అధికారి విజయవంతంగా మంత్రి పేషీలో పాగా వేశారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపున తీసుకునే కీలక నిర్ణయాల్లో తప్పదోవ పట్టిస్తూ ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

WhatsApp channel

టాపిక్

TdpChandrababu NaiduAndhra Pradesh NewsEducationAp UniversitiesGovernment Of Andhra Pradesh
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024