Warangal : నమ్మి పని ఇస్తే…. బంగారం​ షాప్​ లూటీ, చివరికి ఇలా దొరికిపోయాడు…!

Best Web Hosting Provider In India 2024

Warangal Crime News: బతుకు దెరువు కోసం వచ్చిన వ్యక్తికి నమ్మి పని ఇస్తే.. ఆ యువకుడు ఏకంగా బంగారం షాప్ నే కొల్లగొట్టాడు. పెద్ద మొత్తంలో బంగారంతో ఉడాయించి, అమ్ముకునేందుకు ప్రయత్నం చేయగా, వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ కు సంబంధించిన వివరాలు వరంగల్ సీపీ శుక్రవారం వెల్లడించారు. 

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా సాల్సింగే తాలూకా భాగ్యనగర్ ప్రాంతానికి చెందిన సురేష్ లక్ష్మణ్ బాద్ బంగారం వ్యాపారం చేసేవాడు. వచ్చే ఆదాయంతో సట్టా, మట్కా జూదాలతో పాటు తాగుడుకు అలవాటుపడ్డాడు. అనంతరం అప్పుల పాలై పిజ్జా వ్యాపారం మొదలు పెట్టాడు. అందులో కూడా నష్టం రావడంతో ఒక పక్కా ప్లాన్ వేశాడు. తన ప్లాన్ లో భాగంగానే సురేష్ లక్ష్మణ్ బాద్ మే నెలలో మహారాష్ట్ర నుంచి వరంగల్ కు వచ్చాడు. 

వరంగల్ నగరంలోని విశ్వకర్మ వీధిలో బంగారం కరిగించే వ్యాపారం చేస్తున్న సంజయ్ వద్దకు వెళ్లగా, మే 24న అతడిని నమ్మి పనిలో పెట్టుకున్నాడు. కొద్దిరోజులు సురేష్ లక్ష్మణ్ బాద్ నమ్మకంగా వ్యవహరించడంతో ఓనర్ అయిన సంజయ్ షాప్ తాళాలు కూడా అతడికే ఇచ్చి బయటకు వెళ్లేవాడు.

సీసీ కెమెరాలు ఆఫ్ చేసి.. భారీ చోరీ

సంజయ్ షాప్ గత నెలలో పెద్ద మొత్తంలో బంగారం రాగా, దానిపై సురేష్ లక్ష్మణ్ బాద్ కన్నేశాడు. దాదాపు 800 గ్రాముల బంగారం కాగా, దానిని ఎలాగైనా దొంగిలించి తీసుకెళ్లాలని ప్లాన్ వేశాడు. తన పథకంలో భాగంగా జూన్ 14న షాప్ ఓనర్ సంజయ్ పని మీద బయటకు వెళ్లగా, సురేష్ షాప్ లోని సీసీ కెమెరాలను ఆఫ్ చేశాడు. అందులో ఉన్న 800 గ్రాముల బంగారాన్ని తీసుకుని అక్కడి నుంచి తన స్వగ్రామం పారిపోయాడు. 

ఇంటికి వెళ్లిన మూడు రోజుల తరువాత తన వద్ద ఉన్న ముద్ద బంగారాన్ని అమ్మే ప్లాన్ వేశాడు. కానీ ముద్దగా ఉన్న బంగారాన్ని అమ్మడం కష్టమవుతుందనే ఉద్దేశంతో తన స్నేహితుడు, పూణేలోని నస్రాపూర్‌లో బంగారం కరిగించే బట్టీ వ్యాపారం చేస్తున్న సూరజ్‌ తానాజీ యాదవ్‌ ఆలియాస్‌ పింటు వద్ద కు వెళ్లాడు. అక్కడ ముద్ద బంగారాన్ని కరిగించి, వంద గ్రాముల చొప్పున 8 బిస్కెట్లుగా మార్చాడు.

అందులో వంద గ్రాముల బంగారాన్ని సూరజ్‌ తానాజీ యాదవ్‌ కు అగ్గువ ధరకు అమ్మేశాడు. మిగిలిన 700 గ్రాముల బంగారాన్ని నిందితుడు నాగ్‌పూర్‌, అమరావతి, ముంబయి, పూణే, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో అమ్మేందుకు ప్లాన్ వేసుకున్నాడు. కానీ అక్కడ బంగారం అమ్ముడు పోకపోవడంతో విజయవాడలో అమ్మేందుకు సిద్ధమయ్యాడు.

పక్కా స్కెచ్ వేసి పట్టుకున్న పోలీసులు

దొంగతనం జరిగిన తరువాత షాపు ఓనర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ షేక్‌ సలీమా, అడిషనల్ డీసీపీ రవి అధ్వర్యంలో సీసీఎస్, మట్వాడా సీఐలతో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. 

పోలీసుల వద్ద ఉన్న టెక్నాలజీ ఆధారంగా నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో నిందితుడు బంగార అమ్మేందుకు గురువారం సాయంత్రం విజయవాడ వెళ్తున్నట్టుగా సమాచారం అందడంతో సాయంత్రం 6.30 గంటలకు వరంగల్‌ రైల్వే స్టేషన్ లో తనిఖీ చేశారు. సురేష్ ప్లాట్‌ఫారంపై వాటర్ బాటిల్ కోనుగోలు చేస్తుండగా, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. దీంతో చోరీ సొత్తు బయట పడగా, అతడిని విచారించడంతో అసలు వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. 

నిందితుడిని పట్టుకుని భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ చూపిన సెంట్రల్‌ జోన్ డీసీపీ షేక్‌ సలీమా, అడిసనల్ డీసీపీ రవి, సీసీఆర్బీ ఏసీపీ డేవిడ్‌రాజు, వరంగల్‌ ఏసీపీ నందిరాంనాయక్‌, సీసీఎస్, మాట్వాడా సీఐలు అబ్బయ్య, గోపీ, ఏఏవో సల్మాన్‌పాషా తదితరులను వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel

టాపిక్

Crime NewsWarangalTelangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024