
Best Web Hosting Provider In India 2024

OTT Comedy Movie: తెలుగు ఓటీటీల్లో ఒకటైన ఈటీవీ విన్ ఇప్పుడు మరో కామెడీ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. నిజానికి ఇదో ఫ్యామిలీ రోడ్ ట్రిప్ మూవీ. అసలు ఈ జానర్ లో తెలుగులో వస్తున్న తొలి సినిమా అంటూ ఈటీవీ విన్ ఓటీటీ ఈ మూవీని ప్రమోట్ చేస్తోంది. ఈ సినిమా పేరు వీరాంజనేయులు విహారయాత్ర.
వీరాంజనేయులు విహారయాత్ర స్ట్రీమింగ్ డేట్
ఈటీవీ విన్ ఓటీటీ ఒరిజినల్ మూవీగా ఈ వీరాంజనేయులు విహారయాత్ర వస్తోంది. ఈ సినిమాను ఆగస్ట్ 14 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సదరు ఓటీటీ శుక్రవారం (జులై 19) వెల్లడించింది. “అందరూ మెచ్చిన 90’s వెబ్ సిరీస్ తర్వాత మరో ఫ్యామిలీ డ్రామాకు సిద్ధంగా ఉండండి. తెలుగులో తొలి ఫ్యామిలీ రోడ్ ట్రిప్ మూవీ నుంచి ఫ్యామిలీ పోస్టర్ ను పరిచయం చేస్తున్నాం. ఈ అడ్వెంచర్ ఆగస్ట్ 14న ప్రారంభం అవుతుంది. కేవలం ఈటీవీ విన్ లోనే..” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ వెల్లడించింది.
అంతేకాదు కొన్నాళ్లుగా ప్రతి రోజూ తమ ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ వీరాంజనేయులు విహారయాత్ర మూవీని ప్రమోట్ చేస్తూనే ఉంది. మా బేబీ కనిపించడం లేదు.. మీకేమైనా కనిపించిందా అంటూ రోజూ ట్వీట్లు చేస్తోంది. గురువారం (జులై 18) కూడా ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించిన సీనియర్ నటుడు నరేష్.. ఏడుస్తూ తమ బేబీ కనిపించడం లేదని చెబుతున్న వీడియోను పోస్ట్ చేశారు.
ఆ బుజ్జిలాగే ఈ బేబీ..
ఇందులో కల్కి 2898 ఏడీ మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ను మా బేబీ కనిపించిందా అని నరేష్ అడగడం విశేషం. “హలో నాగ్ అశ్విన్ గారు.. మా బేబీ కనిపించిందా? ఎటు వెళ్లిపోయిందో తెలియడం లేదు. అది లేకుండా మాకు ముద్ద దిగదు. అందరినీ అడిగాను. కల్కిలో బుజ్జి తెలుసు కానీ ఈ బేబీ ఎవరో తెలియదంటూ అందరూ హేళన చేస్తున్నారు. దయచేసి మా బేబీ ఎవరికైనా కనిపిస్తే చెప్పండి” అంటూ నరేష్ ఏడుస్తూ అడిగిన వీడియో వైరల్ అయింది.
ఈ వీరాంజనేయులు విహారయాత్రలో బేబీ అంటే ఆ ఫ్యామిలీ వాడే మినీ బస్సు కావడం విశేషం. కల్కిలో ప్రభాస్ వాడే వెహికిల్ బుజ్జి అయితే.. ఈ ఫ్యామిలీ రోడ్ ట్రిప్ లో ఈ బస్సే ఆ కనిపించకుండా పోయిన బేబీ. కొన్ని రోజులుగా ఈ బేబీ కనిపించడం లేదని, ఎవరికైనా కనిపిస్తే చెప్పాలంటూ ఈటీవీ విన్ ఓటీటీ వినూత్న రీతిలో మూవీ ప్రమోషన్లు నిర్వహిస్తోంది.
గతంలో ఈటీవీ విన్ రూపొందించిన 90’s వెబ్ సిరీస్ ఇండియాలో ఎక్కువ మంది లైక్ చేసిన తెలుగు వెబ్ సిరీస్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సిరీస్ తర్వాత ఈ ఓటీటీ తీసుకొస్తున్న మరో ఫ్యామిలీ కామెడీ డ్రామా ఈ వీరాంజనేయులు విహారయాత్ర. ప్రమోషన్లు బాగానే ఉన్నాయి. మరి కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి.