Saturday motivation: డబ్బులాగే సమయానికీ విలువివ్వు మిత్రమా.. నీ విలువ పెరుగుతుంది

Best Web Hosting Provider In India 2024

ఒక ఉదాహరణతో మొదలు పెడదాం. మీకొక బ్యాంక్ అకౌంట్ ఉంది అనుకోండి. అందులో ప్రతి రోజూ 86,400 రూపాయలు మాత్రమే డిపాజిట్ అవుతాయి. ఏ రోజుకారోజు డబ్బు అకౌంట్లో పడుతూనే ఉంటుంది. కానీ ఒక రోజు పడ్డ డబ్బు మరో రోజుకు ఉండదు. ఆ రోజులో మిగిలిన డబ్బంతా వృథా అయినట్లే. మీరు ఖర్చు పెట్టలేకపోయిన డబ్బంతా సాయంత్రం కళ్లా మాయం అయిపోతుంది. దీనికి పరిష్కారం ఏంటి? డబ్బు వృథా కాకూడదంటే ప్రతి రోజూ డబ్బులు తీసుకుని సరిగ్గా ఖర్చుపెట్టడమే కదా..

మనలో ప్రతి ఒక్కరి దగ్గరా అలాంటి అకౌంట్ ఒకటి ఉంది. దాని పేరే సమయం. మీరు మీ రోజును మొదలు పెట్టేటప్పుడు మీ అకౌంట్లో 86,400 సెకన్లుంటాయి. అంటే 24 గంటలన్నమాట. మీరు ఆ రోజు ఉపయోగించుకోలేక పోయిన సమయమంతా వృథా అయినట్లే. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడంలో మీరు ఫెయిల్ అయినట్లే. ఈ రోజు మిగిలిన సమయాన్ని కూడగట్టి మరో రోజు ఉపయోగించుకోలేరు. సెకను గడిచిందంటే దాన్ని వెనక్కు తెచ్చుకోవడం అసాధ్యం. ఉదయాన్నే మళ్లీ కొత్తరోజు మొదలు. రాత్రికళ్లా సమయం మొత్తం ఖాళీ..

డబ్బు లేకపోతే కనీసం అవసరానికి అప్పో సొప్పో చేయొచ్చు. కానీ సమయం అలాకాదు. అప్పు తీసుకోలేరు. లోన్లు తీసుకోలేరు. మీకున్న సమయం మీరు వాడుకోవాలంతే. మీకున్న విలువైన క్షణాల్ని ఎక్కడ, దేనికోసం ఖర్చు పెట్టాలో చాలా తెలివిగా ఆలోచించాలి. డబ్బు ఎలాగైతే ఆచీతూచీ ఖర్చు పెడతామో, సమయం అంతకన్నా విలువైనది కాబట్టి దానికి మరింత విలువివ్వాలి. ఏదైనా పని చేయడానికి సమయం ఉండట్లేదు అంటే మీరు దానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదనే అర్థం.

పని కోసం సమయం కేటాయిస్తే సంతృప్తి దొరుకుతుంది, వ్యాయామం కోసం సమయం కేటాయిస్తే ఆరోగ్యం దొరుకుతుంది, నవ్వడానికి సమయం కేటాయిస్తే ఆహ్లాదాన్నిస్తుంది, చదవడానికి సమయం కేటాయిస్తే వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది, ఇతరులకు సేవ చేయడానికి సమయం కేటాయిస్తే ఆనందాన్నిస్తుంది, మనసును ఆలోచనల్లో నిమగ్నం చేసేందుకు సమయమిస్తే మేధాశక్తి పెరుగుతుంది, ప్రార్థించడానికి సమయం కేటాయిస్తే మనశ్శాంతి దొరుకుతుంది. కాబట్టి ఆరోగ్యం, ఆనందం అన్నీ సమయం తోనే. మన అకౌంట్లో ప్రతి రోజూ పడే సెకన్లను ఎంత జాగ్రత్తగా, దేనికోసం ఖర్చు పెడుతున్నామనేది చాలా ముఖ్యం. దాంతో జీవితం రూపు రేఖలే మారిపోతాయి.

సరైన దినచర్య కోసం సమయం కేటాయించుకుని వాడుకుంటే ఎలాంటి కష్టమైనా పనైనా సులువుగా పూర్తి చేయొచ్చు. మీకిచ్చిన సమయాన్ని వాడుకుని అంబానీలా అవుతారా, అబ్దుల్ కలాం అవుతారా లేదంటే ఏమీ సాధించలేని వ్యక్తిగా మిగిలాపోతారా అని మీ చేతుల్లో ఉంటుంది.

సమయానికి ఏ ధర ఉండదు. కానీ దాన్ని కోల్పోయినప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది. అందుకే మీ చేతుల్లో ఉన్న సమయాన్ని వృథా చేయకండి. సమయం విలువ తెల్సుకుని అవసరమైన పనులకు, మీ ఇష్టమైన వ్యక్తుల కోసం, లక్ష్య సాధన కోసం ఖర్చు పెట్టండి. మీ రోజును లేవగానే అతి ముఖ్యమైన పనులను ముందుగా చేయడానికి సమయం కేటాయించి మొదలుపెట్టండి. తర్వాత మీ ప్రాధాన్యత ప్రకారం సమయాన్ని వాడుకుంటూ రోజు పూర్తి చేయండి.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024