
Best Web Hosting Provider In India 2024

Akash Puri Name Change: టాలీవుడ్ యువ హీరో తన పేరు మార్చుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు. తన బర్త్ డే రోజే ఈ పేరు మార్పు విషయాన్ని అతడు వెల్లడించడం విశేషం. ఒక రోజు ముందే తన జీవితంలో ఓ మార్పు వస్తుందని చెప్పిన అతడు.. గురువారం (జులై 25) ఈ పేరు మార్పు గురించి చెప్పాడు.
ఆకాశ్ పూరి పేరు మారింది
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు యువ హీరో ఆకాశ్ పూరి. మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ లాంటి సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో తన జీవితంలో ఒక మార్పు రాబోతోందని బుధవారం (జులై 24) అతడో ట్వీట్ ద్వారా అభిమానులను టీజ్ చేశాడు. అయితే అది పేరు మార్పు అని తాజాగా వెల్లడించాడు.
ఇన్నాళ్లూ ఆకాశ్ పూరిగా ఉన్న తన పేరును ఇక నుంచి ఆకాశ్ జగన్నాథ్ గా మార్చుకుంటున్నట్లు తెలిపాడు. “నా పేరులో మార్పు చోటు చేసుకుంది. ఇక నుంచి నేను ఆకాశ్ పూరి కాదు.. నా పేరు ఆకాశ్ జగన్నాథ్” అని గురువారం (జులై 25) ట్వీట్ చేశాడు. ఈ పోస్టుతోపాటు తాను ఎంతో రాజసంగా కుర్చీలో కాలు మీద కాలేసుకొని కూర్చున్న ఫొటోను జత చేశాడు.
ఫ్యాన్స్ రియాక్షన్ ఇదీ
ఆకాశ్ పూరి పేరు మార్పు పోస్టులపై అభిమానులు రియాక్టయ్యారు. “సూపర్ బ్రదర్” అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఇక మరొకరు స్పందిస్తూ.. “అన్నా మీరు త్వరలోనే మూవీ ఇండస్ట్రీలో ఎదుగుతారు” అని అన్నారు. మేము నిన్ను ఏజే అని పిలుస్తాం అని ఇంకో ఫ్యాన్ కామెంట్ చేశారు. ఈ కొత్త మార్పుతో మీ కెరీర్లోనూ మార్పు జరగాలని ఆశిస్తున్నా అని ఓ అభిమాని అనడం విశేషం.
టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అతని తనయుడు ఆకాశ్ 2007లో వచ్చిన చిరుత మూవీ ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తర్వాత ఏక్ నిరంజన్, బిజినెస్‌మ్యాన్ సినిమాల్లో నటించాడు. 2015లో వచ్చిన ఆంధ్రా పోరి సినిమాతో తొలిసారి హీరోగా చేశాడు. 2018లో మెహబూబా చేశాడు. తర్వాత రొమాంటిక్, చోర్ బజార్ చేసినా అన్నీ వైఫల్యాలుగానే మిగిలపోయాయి.
మరోవైపు పూరి జగన్నాథ్ తన నెక్ట్స్ మూవీ డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. అతని చివరి సినిమా లైగర్ తీవ్రంగా నిరాశ పరిచినా.. ఇప్పుడు రాబోయే ఈ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా ఈ డబుల్ ఇస్మార్ట్ వస్తోంది.