Best Web Hosting Provider In India 2024
ఈ ఆగస్టు నెలలోనూ బోలెడు సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఓటీటీల్లోకి వరుస కడుతున్నాయి. ఓటీటీ ప్రేక్షకుల కోసం వచ్చేస్తున్నాయి. అందులో తెలుగులో కొన్ని ముఖ్యమైన చిత్రాలు ఆగస్టులో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి. వీరాంజనేయులు విహారయాత్ర చిత్రం నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది. నభా నటేశ్ డార్లింగ్ కూడా ఇదే నెలలో ఓటీటీలోకి రానుంది. ఇలా.. ఆగస్టులో తెలుగు ఓటీటీల్లోకి రానున్న టాప్-5 సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.
వీరాంజనేయులు విహారయాత్ర
వీరాంజనేయులు విహారయాత్ర సినిమా ఇటీవల టీజర్, ప్రమోషన్లతో మంచి బజ్ తెచ్చుకుంది. సీనియర్ యాక్టర్ నరేశ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలో వస్తోంది. ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్‍కు రానుంది. ఫ్యామిలీ రోడ్ ట్రిప్ కామెడీ డ్రామాగా వీరాంజనేయులు విహారయాత్ర చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు వినోద్ గాలి. ఈ మూవీలో అస్థికలకు కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పడం మరో హైలైట్. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆకట్టుకోవడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వీరాంజనేయులు విహారయాత్ర మూవీని ఆగస్టు 14 నుంచి ఈటీవీ విన్‍లో చూసేయవచ్చు.
భారతీయుడు 2
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించిన ఇండియన్ 2 (భారతీయుడు 2) చిత్రం ఆగస్టులోనే ఓటీటీలో రానుందని తెలుస్తోంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. జూలై 12వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ సీక్వెల్ మూవీ డిజాస్టర్ అయింది. ఆగస్టు తొలి వారంలోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి భారతీయుడు 2 వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఆలస్యమైతే మూడో వారంలో స్ట్రీమింగ్‍కు రావొచ్చు. భారతీయుడు 2 చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాంక భవానీ శంకర్, ఎస్‍జే సూర్య, బాబీ సింహా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
డార్లింగ్
ప్రియదర్శి, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన డార్లింగ్ చిత్రం చాలా అంచనాలతో వచ్చింది. జూలై 19న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, బాక్సాఫీస్ వద్ద భారీగా నిరాశపరిచింది. ఈ మూవీకి ఆరంభం నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు అనుకున్న స్థాయిలో రాలేదు. ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. డార్లింగ్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ కొనుగోలు చేసింది. ఆగస్టులోనే స్ట్రీమింగ్‍కు తీసుకురానుంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.
రక్షణ
హీరోయిన్ పాయల్ రాజ్‍పుత్ ప్రధాన పాత్ర పోషించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం రక్షణ ఆగస్టు 1వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు అంతగా రాలేదు. నాలుగేళ్ల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆలస్యాలు, వివాదాల తర్వాత ఇప్పుడు వచ్చింది. రక్షణ చిత్రానికి దర్శక, నిర్మాతగా వ్యవహరించారు ప్రణదీప్ ఠాకూర్. ఆత్మహత్యల వెనుక మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ రక్షణ మూవీ సాగుతుంది. ఆగస్టు 1 నుంచి ఈ చిత్రాన్ని ఆహాలో చూసేయవచ్చు.
పేకమేడలు
యువ నటుడు వినోద్ కిషన్, అనూష కృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన పేకమేడలు సినిమా జూలై 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ కామెడీ డ్రామా చిత్రానికి మూవీ టీమ్ విభిన్నంగా ప్రమోషన్లను చేసింది. దీంతో కాస్త బజ్ తెచ్చుకోగలిగింది. ఈ చిత్రం మంచి స్పందనే తెచ్చుకుంది. ఎంటర్‌టైనింగ్‍గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నీలగిరి మామిళ్ల ఈ పేకమేడలు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కుడా ఆగస్టులోనే ఓటీటీలోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఓటీటీ ప్లాట్‍ఫామ్ వివరాలు త్వరలోనే బయటికి వచ్చే అవకాశం ఉంది.
కల్కి వస్తుందా?
కల్కి 2898 ఏడీ చిత్రం భారీ బ్లాక్‍బస్టర్ అయింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ జూన్ 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పటికే రూ.1,100 కోట్ల కలెక్షన్లు దాటేసింది. నెల దాటినా ఇంకా ఈ చిత్రానికి మంచి థియేట్రికల్ రన్ ఉంది. ఈ సినిమాను 10 వారాల తర్వాతే ఓటీటీలోకి తీసుకొస్తామని మూవీ టీమ్ గతంలో చెప్పింది. కల్కి 2898 ఏడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్, నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి. అయితే, కల్కి చిత్రం ఆగస్టు మూడో వారం లేకపోతే చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. మరి ఈ చిత్రంలో ఓటీటీల్లోకి ఆగస్టులో వస్తుందా.. సెప్టెంబర్ వరకు ఆగాల్సిందేనా అనేది చూడాలి.
హాలీవుడ్ సినిమా డ్యూన్ 2 (జియోసినిమా) ఆగస్టు 1వ తేదీన జియోసినిమా ఓటీటీలో.. ‘కింగ్‍డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్’ ఆగస్టు 2న డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు రానున్నాయి. స్టార్ హీరోయిన్ త్రిష చేసిన తొలి వెబ్ సిరీస్ బృంద ఆగస్టు 2వ తేదీన సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.
టాపిక్