Best Web Hosting Provider In India 2024
విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 30 ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల్లో అత్యధిక సీట్లున్న వైసీపీని ఎదుర్కొని ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవాల్సి ఉంది. ఒకవేళ ఓటమి చెందితే కూటమి ప్రభుత్వానికి తొలి పరాభవం ఎదురైనట్లే. ఇటీవలి తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా జరిగింది. అధికారం కాంగ్రెస్ కాకుండా…. ప్రతిపక్ష బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గెలుచుకుంది.
అఖండ మెజార్టీ తరువాత జరిగే తొలి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ కూటమి ప్రయత్నిస్తుంది. అయితే ప్రతిపక్ష వైసీపీకి ఎక్కువ ఓట్లు ఉన్న ఈ స్థానంలో కూటమికి గెలుపు పెద్ద సవాల్‌గా ఉంది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలకే జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకం అయింది.
అలాగే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం వైసీపీ తన ఉనికిని సవాల్‌గా మారింది. వైసీపీ ఈ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటే…. అధికారం కోల్పోయిన తరువాత నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు ఒక సందేశం ఇచ్చినట్లు ఉంటుంది. కనుక ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు అధికార టీడీపీ కూటమికి, ప్రతిపక్ష వైసీపీకి సవాల్‌గా మారాయి.
ఆగస్టు 30న జరిగే ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం తొలి పరీక్ష ఎదుర్కొబోతుంది. సంఖ్య బలం బట్టి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అత్యధికంగా వైసీపీకి ఉన్నారు. అధికార టీడీపీకి చాలా తక్కువ ఉన్నారు. అయితే ప్రతిపక్ష వైసీపీకి ఎక్కువ మంది స్థానిక సంస్థల సభ్యులు ఉన్నప్పటికీ, వారంతా వైసీపీ అభ్యర్థికి ఓటేస్తారా? అనే మీమాంసం నెలకొంది. అయితే తక్కువ మంది స్థానిక సంస్థల సభ్యులున్న అధికార టీడీపీ గెలవడానికి వైసీపీ సభ్యులను లాగాల్సి ఉంటుంది. టీడీపీ ఆ ప్రయత్నాలను మొదలు పెట్టింది. అయితే వైసీపీ నుంచి వలసలను నివారించడానికి ఆ పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తోంది.
అయితే ఇటీవలి జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. దీంతో జీవీఎంసీని సొంతం చేసుకోవాలని టీడీపీ కూటమి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే వైసీపీ నుంచి కార్పొరేటర్లను టీడీపీలోకి లాక్కొంటుంది. స్థానిక సంస్థలకు చెందిన వైసీపీలు ఎంపీటీసీలు, జేడ్పీటీసీలు కూడా ఇలానే టీడీపీలోకి జారిపోతే వైసీపీ గెలుపు కష్టం సాధ్యం అవుతుంది.
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 814 ఓట్లు ఉన్నాయి. అందులో వైసీపీకి 615, టీడీపీకి 215 ఉన్నాయి. ఈ సంఖ్య బలాన్ని పరిశీలిస్తే వైసీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున అభ్యర్థి లేకపోవడంతో వైసీపీకి చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. అయితే ఈసారి టీడీపీ పోటీ చేస్తుంది.
అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి, జనసేనలో చేరారు. జనసేన తరపున విశాఖ సౌత్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆ స్థానం ఖాళీగా ఏర్పడింది. ఇటీవలి కేంద్ర ఎన్నికల సంఘం ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 30న ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ఆగస్టు 6న విడుదల కానుంది. ఆగస్టు 13 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 14న నామినేషన్లు పరిశీలిస్తారు. ఆగస్టు 30 పోలింగ్ నిర్వహిస్తారు.
వైసీపీ అభ్యర్థిగా అమర్నాథ్ ప్రయత్నాలు…!
ఈ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీ చేసేందుకు తొలుత ప్రయత్నాలు మొదలపెట్టారు. అయితే ఇప్పుడు ఆలోచన నుంచి విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవలి జీవీఎంసీ కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దీంతో ఆయన ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు నామినేషన్లకు గడువు దగ్గర పడుతున్న కొద్ది ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. అధికార టీడీపీ అభ్యర్థిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. టీడీపీ పోటీ చేస్తుందా? లేక కూటమి పార్టీలైన జనసేన, బీజేపీకి వదిలేస్తుందా? అనే చర్చ జరుగుతోంది. ఇటీవలి రెండు ఎమ్మెల్సీకు ఒకటి టీడీపీ, ఒకటి జనసేన తీసుకున్నాయి. ఇప్పుడు బీజేపీకి ఇస్తారా? అనే చర్చ సర్వత్రా నెలకొంకది.
రిపోర్టింగ్ – జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్