Best Web Hosting Provider In India 2024
Telangana Record of Rights Bill 2024 : భూముల నిర్వహణకు సంబంధించి తెలంగాణలో కొత్త చట్టం రాబోతుంది. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ‘ది తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ బిల్-2024’ ముసాయిదాను ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై ప్రజాభిప్రాయాలను సేకరించిన తర్వాత…. చట్టంగా మారుస్తామని తెలిపింది. ఆగస్టు 23వ తేదీ వరకు అభ్యంతరాలను సేకరించనున్నారు.
ఈ ముసాయిదా ప్రకారం….. తహసీల్దార్లతోపాటు ఆర్డీవోలకూ మ్యుటేషన్ చేసే అధికారం ఇవ్వనుంది. మ్యుటేషన్ సమయంలో విచారణకు అవకాశం కల్పిస్తుండగా… తప్పుగా తేలితే మ్యుటేషన్ నిలిపివేసే అధికారాలను కట్టబెట్టనుంది. ప్రతి భూకమతానికి భూ ఆధార్ ఉండనుంది. హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటారు. అప్పీల్, రివిజన్‌లకు వెసులుబాటు కల్పిస్తూ బిల్లును రూపొందించారు.
ఈ ముసాయిదా బిల్లు పేర్కొన్న వివరాల ప్రకారం….. ప్రతి భూకమతానికి తాత్కాలిక, శాశ్వత భూదార్ (ప్రత్యేక గుర్తింపు సంఖ్య) ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత రికార్డులను పరిశీలించి తాత్కాలిక సంఖ్య ఇస్తారు. సర్వే చేసిన తర్వాత శాశ్వత భూదార్ కేటాయిస్తారు. గతంలో ఉన్న చట్టాల అమలులో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కొత్త చట్టం విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పారు.
2020లో తీసుకొచ్చిన ఆర్వోఆర్ చట్ట ప్రకారం… చాలా ఇబ్బందులు ఉన్నాయి. అప్పీల్, రివిజన్ వ్యవస్థలు లేకపోవటంతో భూ యజమానులకు అనేక సమస్యలు ఏర్పడ్డాయి. కలెక్టర్లకు ఎక్కువ అధికారాలు ఉండటంతో క్షేత్రస్థాయిలోని అధికారులు ఏం చేయలేని పరిస్థితి ఉండేది. అయితే కొత్త చట్టంలో మూడంచెల అప్పిలేట్ అథారిటీలను నియమించనున్నారు. తహసీల్దారు, ఆర్డీవోల మ్యుటేషన్లపై అభ్యంతరాలను స్వీకరించే అవకాశం ఉంది.
ఆర్వోఆర్ రికార్డుల్లో తప్పులుంటే వాటిపై మొదటి అప్పీలుపై రివిజన్ అధికారాలు కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్‌కు ఇవ్వనున్నారు, ఇక రెండో అప్పీలుపై సీసీఎల్‌ఏకు, మూడో అప్పీలుపై ప్రభుత్వానికి చేసుకునే వీలు ఉంటుంది. కొత్త చట్టం ద్వారా పహాణీలను కూడా అప్డేట్ చేస్తారు.
అభిప్రాయాల సేకరణ….
ఈ ముసాయిదా బిల్లుపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది ప్రభుత్వం. https://ccla.telangana.gov.in/Welcome.do వెబ్ సైట్ ద్వారా అభిప్రాయలను సేకరించనుంది. ఇప్పటికే ముసాయిదా బిల్లును వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఆగస్టు 23వ తేదీ వరకు ప్రభుత్వానికి అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది.
సలహాలు, సూచనలను ror2024-rev@telangana.gov.in కు ఈ–మెయిల్ ద్వారా కూడా పంపే అవకాశం ఉంది. ఇలా కాకుండా ల్యాండ్ లీగల్ సెల్, సీసీఎల్‌ఏ కార్యాలయం, నాంపల్లి స్టేషన్‌రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, అబిడ్స్, హైదరాబాద్–500001కు పోస్టు ద్వారా పంపే ఛాన్స్ ఉంది. అభ్యంతరాల స్వీకరణ తర్వాత… పూర్తిస్థాయిలో చర్చించి కొత్త చట్టం తీసుకురానున్నారు.
టాపిక్