KTR: మేడిగడ్డ విజిట్ ఎఫెక్ట్.. కేటీఆర్‌ పై కేసు నమోదు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Best Web Hosting Provider In India 2024

KTR: కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని, భారీగా నిధులు దుర్వినియోగమయ్యాయంటూ నిత్యం ఏదో ఒక చర్చ జరుగుతుండగా, తాజాగా కల్వకుంట్ల కుటుంబానికి వరుస కేసులు కలవరపెడుతున్నాయి.

ఇప్పటికే కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను వచ్చే నెల 5న జయశంకర్ భూపాలపల్లి కోర్టులో హాజరుకావాల్సిందిగా న్యాయం స్థానం ఆదేశాలు జారీ చేయగా, తాజాగా మరో విషయం బయటకు వచ్చింది.

జులై 26న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ ను విజిట్ చేయగా, ఆ తరువాత ఆయనతో పాటు ప్రాజెక్టును సందర్శించిన మరికొందరు నేతలపైనా మహాదేవపూర్ పీఎస్ లో కేసు నమోదైంది. దీంతో బీఆర్ఎస్ పార్టీలో మరోసారి కలవరం మొదలైంది.

అసలేం జరిగింది..?

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఎన్డీఎస్ఏ విచారణ, కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిత్యం చర్చల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే భారీ వర్షాలు కురవడం, పైనుంచి వచ్చే వరదతో కాళేశ్వరం నిండుకుండలా మారడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదలడం స్టార్ట్ చేశారు.

దీంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడంతో మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను కాంగ్రెస్ నేతలు భూతద్దంలో చూపుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, ఈ మేరకు ప్రాజెక్టును సందర్శించి అసలు విషయాలను ప్రజలకు వివరించేందుకని కేటీఆర్ జులై 26 మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించారు.

తన వెంట బీఆర్ఎస్ లీడర్లు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్ సహా మరికొంతమందిని తీసుకెళ్లారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల వరకు ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను భూతద్ధంలో చూపి కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. అబద్దాలతో కాలం గడిపే కాంగ్రెస్ నేతలు కళ్లు తెరిచి కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారు.

పంప్ లు ఆన్ చేసి ఎడారిని తలపిస్తున్న ఎల్ఎండీ, మిడ్ మానేర్, ఎస్సారెస్పీ వరద కాల్వలు నింపి ఎక్కువ ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే కేసీఆర్ నేతృత్వంలో 50 వేల మంది రైతులతో కలిసి వచ్చి తామే కాళేశ్వరం పంప్ లను ఆన్ చేస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన అనంతరం వాస్తవాలను ప్రజలకు తెలిసేలా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.

డ్రోన్స్ తో విజువల్స్.. కేటీఆర్ పై ఫిర్యాదు

కేటీఆర్ అండ్ టీమ్ మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధులు డ్రోన్ సహాయంతో మేడిగడ్డ విజువల్స్ చిత్రీకరించారు. ఆ తరువాత ప్రాజెక్టుకు సంబంధించిన విజువల్స్ ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ మేడిగడ్డ బ్యారేజ్ వద్ద డ్రోన్ వినియోగించడానికి ఎలాంటి పర్మిషన్లు తీసుకోలేదు.

మీడియాలో ప్రసారమైన మేడిగడ్డ విజువల్స్ పరిశీలించిన ఇరిగేషన్ ఏఈఈ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మేడిగడ్డ బ్యారేజ్ తెలంగాణకు అతి ముఖ్యమైన ప్రాజెక్టు కాబట్టి, అనుమతి లేకుండా డ్రోన్ విజువల్స్ తీసి విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల బ్యారేజ్‌కు ముప్పు పొంచి ఉందని అధికారులు భావించారు. ఈ మేరకు అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా, అనుమతి లేకుండా డ్రోన్ ఎగుర వేయడంతో పాటు విజువల్స్ తీసినందుకు సదరు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఏఈఈ జులై 29న మహదేవ్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆయన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు సెక్షన్ 223(B) r/w 3(5) BNS కింద కేటీఆర్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదు చేశారు. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో హాజరు కావాల్సిందిగా కేసీఆర్ ను నోటీసులు జారీ కాగా, ఇప్పుడు కేటీఆర్పై కేసు నమోదు కావడం పార్టీ నేతలను కలవరానికి గురి చేస్తోంది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel

టాపిక్

KtrBrsTs PoliceKaleshwaram ProjectMedigadda BarrageTs Politics
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024