Best Web Hosting Provider In India 2024
AP CMO Appointments: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేదానికి అధికారులు చేసే దానికి ఎక్కడ పొంతన ఉండదని మరోసారి తేలిపోయింది. మంత్రులు మొదలుకుని, సచివాలయం వరకు కీలకమైన బాధ్యతల్లో ఉద్యోగుల నియామకాల్లో అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నా ఆచరణలో మాత్రం అది జరగడం లేదు. ముఖ్యమంత్రిని మభ్యపెట్టడంలో కొందరు అధికారులు విజయం సాధిస్తున్నారు.
అవినీతి ఆరోపణలు ఉన్నవారు, గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని కూడా ప్రాధాన్యత కల్పించడంలో కొందరు అధికారులు చక్రం తిప్పుతున్నారు. తాజాగా సీఎంఓలో జరిగిన నియామకమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఉద్యోగికి గతంలో క్లీన్ చిట్ ఇచ్చిన అధికారి, తాజాగా అతడిని సిఎంఓలో తన సెక్రటరీగా నియమించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగిందంటే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ నీటి పారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేసే పిల్లి క్రాంతి కుమార్‌ను రూ.90వేలు లంచం తీసుకుంటుండగా 2015 మే 7న తెలంగాణ ఏసీబీ పట్టుకుంది. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించడానికి లంచం డిమాండ్ చేయడంతో అతను ఏసీబీని ఆశ్రయించాడు.
దీంతో ఏసీబీ ట్రాప్ చేసి నగదు తీసుకుంటుండగా పట్టుకుంది. 2015 మే8న ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడంతో మే22 వరకు రిమాండ్ విధించారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఏపీ ప్రభుత్వఉద్యోగుల ప్రవర్తనా నియమావళి ప్రకారం తెలంగాణ ప్రభుత్వం మే 7నుంచి క్రాంతి కుమార్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వ్యవహారంపై ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగి తనపై వచ్చిన అభియోగాలను తోసిపుచ్చి ఉన్నతాధికారులకు అభ్యర్థనలు ఇచ్చాడు.2015 ఏప్రిల్ 27నే తాను ఫిర్యాదికి చెక్కును ఇచ్చేశానని దానిని అదే రోజు అతను కలెక్టరేట్ ఎస్‌బిహెచ్ శాఖలో మార్చుకున్నాడని అందులో పేర్కొన్నాడు. తనపై వచ్చిన లంచం ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపింది.
ఈ వ్యవహారంపై కరీంనగర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ ఎం.వెంకటేష్ నేతృత్వంలో విచారణ జరిగింది. 2014లో రాష్ట్ర విభజన జరిగినా అప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన పూర్తి కాలేదు. 2016 మే 7న ఏర్పాటైన ఎంక్వైరీ ఆఫీసర్ 2016 ఆగస్టు 17న నివేదిక సమర్పించారు.
ఈ కేసులో ఫిర్యాది దారుడైన బంటు నారాయణరెడ్డి చేసిన అభియోగాలు నిరాధారమని ఎంక్వైరీ ఆఫీసర్ నివేదికలో పేర్కొన్నారు. వినయ్ డ్రిల్లర్స్ సంస్థ తరపున చేసిన పనులకు సంబంధించిన చెల్లింపులకు లంచం డిమాండ్ చేశారని ఏసీబీకి ఫిర్యాదు చేశారని. పెండింగ్ బిల్లులకు సంబంధించి 2015 ఏపరిల్ 30వ తేదీన డిఏఓ చెక్కులు జారీ చేశారని, ఫిర్యాదుదారుడు పేర్కొన్నట్టు మే 1న చెక్కు జారీ చేయలేదని పేర్కొన్నారు.
ఐదు రోజుల తర్వాత ఫిర్యాదు చేయడం దురుద్దేశంతో అని నివేదికలో పేర్కొన్నారు.లంచం ఇవ్వకపోతే పనులు భవిష్యత్తులో పనులు రాకుండా చేస్తానని బెదిరించారనే ఆరోపణలు కూడా నిజం కాకపోవచ్చని నివేదికలో పేర్కొన్నారు. ఆ తర్వాత ఉద్యోగుల విభజనలో క్రాంతికుమార్ ఏపీకి వచ్చారు.
ఆదిలాబాద్ డిఏఓ పిల్లి క్రాంతి కుమార్‌పై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి రుజువు లేదని ఎంక్వైరీ ఆఫీసర్ నివేదిక ఇచ్చారు. ఫిర్యాదు చేసిన ఇతర ఆరోపణలు ఆ తేదీల్లో జరగడానికి అవకాశం లేదని నిందితుడిపై ప్రాసిక్యూషన్ జరపడానికి సహేతుక కారణాలు లేవని నివేదికలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో 2017 డిసెంబర్ 6వ తేదీన పిల్లి క్రాంతి కుమార్ అభ్యర్థన మేరకు తెలంగాణ ప్రభుత్వం 2015 మే 7 నుంచి 2016 మే 5వ తేదీ వరకు సస్పెన్షన్ కాలాన్ని రద్దు చేయడంతో జీతం చెల్లించవచ్చని 2018 మే 9న ఏపీ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడు సస్పెన్షన్‌లో ఉన్న కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించడంతో పాటు వేతనం చెల్లించాలని ఆర్థిక శాఖ కార్యదర్శిముద్దాడ రవిచంద్ర 2018 మే 9న ఉత్తర్వులు జారీ చేశారు.ఆ తర్వాత క్రాంతి కుమార్ ఏపీ ఆర్థికశాఖలో విధుల్లో చేరాడు. అప్పట్లో ఆర్థిక శాఖలో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.
తాజాగా పిల్లి క్రాంతి కుమార్ ఏపీ సీఎం ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రకు వ్యక్తిగత కార్యదర్శిగా నియమిస్తూ జూన్20న జిఏడి సెక్రటరీ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీబీ ఆరోపణలు ఎదుర్కొన్న అధికారికి ఆర్ధిక శాఖ బాధ్యుడిగా గతంలో క్లీన్ చిట్ ఇచ్చిన ముద్దాడ రవిచంద్ర తాజాగా అతడిని వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకోవడం వెనుక మతలబు ఏమిటనే చర్చ ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో సాగుతోంది.
సంబంధిత కథనం
టాపిక్