Best Web Hosting Provider In India 2024
సినిమాల్లో, సీరియళ్లలో కాబోతున్న కోడలికి ఏడు వారాల నగలు అప్పజెప్పడం చూస్తుంటాం. ఇంతకీ ఏడు వారాల నగలంటే ఏంటనే సందేహం ఎప్పుడైనా వచ్చిందా. వీటిని మనం బయట చూడటం చాలా తక్కువే. ఎవరికో చాలా తక్కువ మంది పెద్ద వాళ్ల దగ్గర మాత్రమే ఇవి ఉంటాయి. స్పష్టంగా చెప్పాలంటే ఉన్నత కుటుంబాల్లోనే ఎక్కువగా ఇలా వంశపార్యంగా వచ్చిన ఏడు వారాల నగలుంటాయి.
ఏడు వారాల నగలు:
ఏడు వారాల నగలు.. ఈ పేరులో ఉన్నట్లే వారంలో ఉండే ఏడు రోజుల్లో ఒక్కో రోజు వేసుకునే నగలు అన్నమాట. వారాన్ని బట్టి, గ్రహాన్ని బట్టి ఈ నగలు ఉంటాయి. ఇప్పుడు రాశులను బట్టి, జాతకాన్ని బట్టి రత్నాలున్న ఉంగరాల్ని పెట్టుకుంటున్నాం. ఫలానా దోషం ఉంటే కొన్ని రకాల రత్నాలు ఉన్న నగలు పెట్టుకోమని సూచిస్తున్నారు. కానీ ఈ సాంప్రదాయం పాతకాలం నాటిదే. వారంలో ఒక్కో రోజుకు ఒక అధిపతి ఉంటారు. దానికి తగ్గట్లుగా నగలు వేసుకుంటే స్త్రీలకు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఉంటాయని నమ్మేవారు. దాని ప్రకారమే ఏ వారానికి తగ్గట్లు ఆ రోజకు వివిధ రంగుల్లో ఉంటే స్టోన్స్ ఉంచి వీటిని తయారు చేయించుకునే వాళ్లు.
ఏ రోజుకు ఏ నగలు?
వారంలో ఏడు రోజులు ఏ రోజు ఏ నగలు వేసుకుంటారో చూడండి.
ఆదివారానికి అధిపతి సూర్యుడు. ఆయనకు ఇష్టమైన రంగు ఎరుపు. దానికోసం ఎరుపు రంగులో ఉండే కెంపులతో పొదిగిన చెవిపోగులు, హారాలు, ఉంగరాలు ఉంటాయి.
సోమవారం చంద్రునికి సంబంధించింది. ఈ రోజు ముత్యాలతో చేసిన నగలు వేసుకోవడం శుభప్రదం. అంటే ముత్యాలతో చేసిన హారాలు, ముత్యాలు పొదిగిన గాజులు, ఉంగరం లాంటివి. ముత్యాలు తెలుపు రంగులో ఉంటాయని తెల్సిందే.
మంగళవారం కుజుడిది. ఈ రోజుకు పగడాలు ఒదిగిన ఉంగరాలు, దండలు ధరించొచ్చు. పగడాలని కోరల్స్ అంటారు. ఇవి చూడ్డానికి ఆరెంజ్ రంగులో ఉంటాయి.
బుధవారం బుధ గ్రహానికి సంబంధించిన పచ్చల నగలుంటాయి. పచ్చలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటినే ఎమరాల్డ్స్ అనీ అంటారు. ఇవి పొదిగిన గాజులు, ఉంగరం లాంటి నగలు బుధవారం ధరిస్తారు.
గురువారం గురుడు లేదా బృహస్పతిది. కనక పుష్యరాగంతో చేసిన ఉంగరాలు, కమ్మలు ఈ రోజు ధరిస్తారు. ఇది పసుపు రంగులో ఉంటుంది.
శుక్రవారం శుక్ర గ్రహం కోసం వజ్రాల నగలు ధరించాలి. ముక్కుపుడక, పెండెట్లు, హారాలు, చెవి దిద్దులు ధరించొచ్చు.
శనివారం శని గ్రహానిది. శని అనగానే నలుపు రంగు అనిపిస్తుంది కానీ కాదు. ఈ రోజు నీలమణితో చేసిన నగలు వేసుకుంటారు. నీలం రంగు స్టోన్ ఉన్న ఉంగరం పెట్టుకోవచ్చు.
ఎలా డిజైన్ చేసుకోవచ్చు?
ఆ వారానికి సంబంధించిన స్టోన్ ఏదైతే దానికి సంబంధించిన చిన్న నగ అయినా పెట్టుకున్నా చాలు. శుక్రవారం రోజు వజ్రాలంటే దాంతో చేసిన ముక్కు పుడక పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లు ఈ నగలు చేయించుకోవచ్చు. ముత్యాలతో చోకర్ చేయించుకోవచ్చు. పచ్చలు పొదిగిన హారం, కెంపులతో కమ్మలు, వజ్రంతో ఉంగరం, కనక పుష్యరాగంతో స్టడ్స్.. ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఈ నగల్ని తయారు చేయించుకోవచ్చు.