Best Web Hosting Provider In India 2024
మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్
మీడియాను అడ్డు పెట్టుకుని అనేక చట్టాల ఉల్లంఘన
అవినీతి మీద సామ్రాజ్యం ఏర్పాటు చేసిన రామోజీరావు
చట్ట వ్యతిరేకంగా అనేక కార్యకలాపాలకు పాల్పడ్డారు
ప్రజల నుంచి డిపాటిట్ల రూపంలో అక్రమ వసూళ్లు
రామోజీ ఎన్ని నేరాలు చేసినా ఇప్పటి సీఎం చూడలేదు
తాము ఎన్ని నేరాలు చేసినా, ఎవరూ ఏమీ చేయవద్దు
పట్టించుకోవద్దన్న ధోరణిలో ఇప్పుడు రామోజీ వారసులు
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్
రామోజీ ఆర్థిక నేరస్తుడని ముందు నుంచి చెబుతున్నాం
చిట్‌ఫండ్ పేరుతో చేసిన మోసాలు అత్యంత దారుణం
అక్రమ డిపాజిట్లపై మార్గదర్శి సంస్థపై విచారణ తప్పదు
ప్రెస్మీట్లో మాజీ మంత్రి అంబటి స్పష్టీకరణ
తాడేపల్లి: మార్గదర్శి అక్రమాల నిగ్గు తేల్చాల్సిందే అని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. నాడు మీడియాను అడ్డు పెట్టుకున్న రామోజీరావు తొలి నుంచి యథేచ్ఛగా చట్టాలు ఉల్లంఘించారని, అవినీతి మీద సామ్రాజ్యం ఏర్పాటు చేశారని. చట్ట వ్యతిరేకంగా అనేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆయన ఆక్షేపించారు. ప్రజల నుంచి డిపాటిట్ల రూపంలో అక్రమ వసూళ్లు చేసిన రామోజీరావు ఎన్ని నేరాలు చేసినా, ఇప్పటి సీఎం చంద్రబాబు ఆనాడు, ఏనాడూ కన్నెత్తి చూడలేదని గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు తాము ఎన్ని నేరాలు చేసినా, ఎవరూ ఏమీ చేయవద్దు.. అస్సలు పట్టించుకోవద్దన్న ధోరణిలో రామోజీ వారసులు ఉన్నారని ధ్వజమెత్తారు. ఆదివారం తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.
రామోజీరావు ఒక ఆర్థిక నేరస్తుడని ముందు నుంచి చెబుతున్నామన్న అంబటి, చిట్‌ఫండ్ పేరుతో చేసిన మోసాలు అత్యంత దారుణం అని స్పష్టం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన ముఖ్యమంత్రులెవ్వరూ రామోజీరావు అవినీతి మీద కనీసం కన్నెత్తి చూడలేదని, చివరకు ఏ వ్యవస్థ కూడా ఆయన తప్పు చేస్తున్నారని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కనీసం ప్రశ్నించలేదని ప్రస్తావించారు. అందుకు రాష్ట్రంలో టీడీపీతో పాటు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు రామోజీకి అండగా ఉండడమే కారణమని చెప్పారు.
అయితే 2006లో తొలిసారిగా రామోజీ అక్రమ డిపాజిట్ల సేకరణ, అవినీతి సామ్రాజ్యానికి సంబంధించిన పెద్ద కుంభకోణాన్ని అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బయటకు తీశారని మాజీ మంత్రి వెల్లడించారు. హిందూ అవిభజన కుటుంబం (హెచ్‌యూఎఫ్) పేరుతో డిపాజిట్ల సేకరణ అక్రమం, అది భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) చట్టం, సెక్షన్–45(ఎస్) ప్రకారం నేరం కాబట్టి, ఆయన ఆర్బీఐకి ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు.
అయితే ఆ విచారణను సవాల్ చేస్తూ.. రామోజీ అనేకసార్లు కోర్టుల తలుపు తట్టారని.. చివరకు రాష్ట్ర విభజన తరవాత 2018 డిసెంబరు 31న ఉమ్మడి హైకోర్టును కూడా రెండుగా చేసిన రోజున, రామోజీ వ్యూహాత్మకంగా మార్గదర్శిపై కేసు కొట్టేయమని తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే.. అదే రోజు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చి, మార్గదర్శిపై కేసు కొట్టివేశారని అంబటి రాంబాబు వివరించారు. వ్యవస్థల మేనేజ్మెంట్ అంటే అదీ అని ఆయన అభివర్ణించారు.
పట్టువదలని ఉండవల్లి అరుణ్‌కుమార్, మార్గదర్శి అక్రమ డిపాజిట్లపై విచారణ జరపాలని కోరుతూ, 2019, డిసెంబరు 16న సుప్రీంకోర్టును ఆశ్రయించారని, దాంట్లో ఇంప్లీడ్ అవుతామని రాష్ట్ర ప్రభుత్వం కూడా పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసిందని వెల్లడించారు. వాటిని విచారించిన సుప్రీంకోర్టు, మార్గదర్శిపై కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేయడాన్ని తప్పు పడుతూ, తిరిగి విచారించాలని ఆదేశించిందని తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతుండగా, రామోజీ క్వాష్ పిటిషన్ సరికాదంటూ.. ఈనెల 13న ఆర్బీఐ తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌తో.. మార్గదర్శిలో దశాబ్దాలపాటు సేకరించిన డిపాజిట్లు అక్రమమని, చట్ట విరుద్ధమని మరోసారి తేటతెల్లం అయిందని, దాంతో ఆ సంస్థపై విచారణ తప్పదని అంబటి రాంబాబు వివరించారు.
మార్గదర్శి ద్వారా రామోజీరావు 2006 నాటికి 2.75 లక్షల మంది నుంచి చట్ట విరుద్ధంగా రూ.2,610 కోట్ల డిపాజిట్లు సేకరించారని అంబటి రాంబాబు తెలిపారు. నాడు సీఎంగా ఉన్న వైయస్ రాజశేఖర్‌రెడ్డి మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వ్యవహారంపై చర్యకు దిగితే, దాన్ని పత్రికాస్వేచ్ఛపై దాడిగా దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. తాను ఎన్ని అక్రమాలు చేసినా ఎవరూ కనీసం కన్నెత్తి చూడకూడదన్నట్లు ఆనాడు రామోజీ వ్యవహరిస్తే.. ఇప్పుడు ఆయన వారసులు కూడా అదే ధోరణితో ఉన్నారని ఆక్షేపించారు.
ఇప్పుడు ఆర్బీఐ స్వయంగా స్పష్టం చేసిన నేపథ్యంలో మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వ్యవహారంలో బాధ్యులు, ఆ సంస్థలో డైరెక్టర్లపై కోర్టులో విచారణ తప్పదని, నేరం రుజువైతే శిక్ష కూడా తప్పదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
ఇక, ఎక్కడ, ఎ ఆఫీసులో చిత్తుకాగితాలు తగలబెట్టినా, గత మా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం, టీడీపీకి, ఎల్లో మీడియాకు పరిపాటిగా మారిందన్న మాజీ మంత్రి, ఏ ఆఫీస్‌లోనూ కనీసం చెత్త కాగితాలు కూడా తగలబెట్టవద్దని జీఓ జారీ చేయమని సూచించారు.
ఇక పోలవరంకు సంబంధించి, ప్రాజెక్టును తొందరగా పూర్తి చేయాలన్న తాపత్రయంలో స్పిల్‌వే, స్పిల్ ఛానల్, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్.. అన్నింటి పనులు ఒకేసారి మొదలుపెట్టామని ఇప్పుడు ఆ శాఖ మంత్రి స్వయంగా అంగీకరించినందువల్ల, వారి తప్పిదం ఒప్పుకున్నట్లు అయిందని అంబటి రాంబాబు వివరించారు.