Best Web Hosting Provider In India 2024
శుక్రకణాలు తయారయ్యే ప్రక్రియను స్పెర్మాటోజెనిసిస్ అంటారు. పురుషుడి శరీరంలో స్పెర్మ్ తయారు కావడానికి శరీరం నిరంతరం ఈ ప్రక్రియను జరుపుతుంది. ఒక్కసారి స్కలనం (శుక్రకణాలు బయటకు రావడం) ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిన శుక్రకణాలు శరీరంలో మళ్లీ తయారు కావడానికి సమయం పడుతుందా? అసలు వీటి ఉత్పత్తి ఎలా జరుగుతుందో తెలియాలి.
స్పెర్మాటోజెనిసిస్
సాధారణంగా వృషణాల్లో శుక్రకణాలు వృద్ధి చెందడానికి 50 నుంచి 60 రోజులు పడుతుంది. ఇవి పూర్తిగా పరిపక్వత చెందడానికి మరో రెండు వారాల సమయం పడుతుంది. అంటే మొదటి నుంచి చివరిదాకా శరీరంలో శుక్రకణాలు తయారు కావడానికి 74 రోజుల సమయం అవసరం. అయితే పురుషుని ఆరోగ్యం, వయసు బట్టి ఒక్కొక్కరిలో ఈ సమయం మరింత పెరగొచ్చు. దానివల్లే స్పెర్మ్ కౌంట్ తగ్గే సమస్య వస్తుంది.
మరి ఒకసారి కలయికలో పాల్గొన్నా, హస్తప్రయోగం తర్వాత జరిగిన స్కలనం వల్ల 74 రోజుల దాకా పురుషుని శరీరంలో శుక్రకణాలుండవా అనే ప్రశ్న అక్కర్లేదు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. కొత్త వాటి స్థానం నిరంతరం భర్తీ అవుతూనే ఉంటుంది.
రోజులో ఎన్ని శుక్రకణాలు ఉత్పత్తవుతాయి?
రోజుకు మిలియన్ల కొద్దీ శుక్రకణాలు తయారవుతాయి. ఓ లెక్క ప్రకారం ఆ సంఖ్య సెకనుకు 1500. ఒక ప్రక్రియ పూర్తయ్యేసరికి శరీరం దాదాపు 8 మిలియన్ల దాకా శుక్రకణాలను తయారు చేస్తుంది. ఒక మి.మీ వీర్యంలో 20 నుంచి 300 మిలియన్ల దాకా శుక్రకణాలుంటాయి. అయితే ఈ సంఖ్య జీవన విధానం, ఆరోగ్యం వల్ల మారిపోతుంది.
జీవిత కాలం
ఒక శుక్రకణం పూర్తిగా పరిపక్వత చెందాక వృషణాల్లో ఉంటుంది. స్కలనం జరిగినప్పుడు వీర్యం ద్వారా బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చిన స్పెర్మ్ కొన్ని నిమిషాల్లోనే నశిస్తుంది. మహిళ శరీరంలోకి ప్రవేశించిన శుక్రకణం మూడు నుంచి అయిదు రోజుల దాకా జీవిస్తుంది. దీని ద్వారానే సంతానం కలుగుతుంది.
స్ఖలనం ద్వారా పురుషకణాల సంఖ్య తగ్గుతుందా?
ఒకే రోజులో ఎక్కువసార్లు హస్త ప్రయోగం చేసుకున్నా, ఎక్కువ సార్లు కలయికలో పాల్గొన్నా వాళ్లలో తాత్కాలికంగా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అలానీ ఆ సంఖ్య సున్నాకి పడిపోదు. మరీ ఎక్కువగా తగ్గిపోదు. సంతానోత్పత్తికి అవసరమయ్యేన్ని శుక్రకణాలు మాత్రం శరీరంలో తప్పకుండా ఎప్పుడూ ఉంటాయి.
ఎక్కువ రోజులు స్కలనం అవ్వకపోతే మాత్రం పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ అనేది కాస్త పెరగడం అయితే వాస్తవమే. అందుకే సంతానం కోసం ప్రయత్నించే వాళ్లకు మహిళల్లో అండం విడుదలయ్యే కనీసం మూడు రోజుల ముందు నుంచి స్కలనం అవ్వకుండా చూడాలని చెబుతారు. అప్పుడు శుక్రకణాల సంఖ్య పెరిగి సంతానోత్పత్తి అవకాశాలూ పెరుగుతాయి.
శుక్రకణాల ఉత్పత్తి పెరగాలంటే..
1. ఎక్కువసేపు వేడి వాతావరణంలో ఉండకూడదు. వేడి నీటి స్నానాలు, విపరీతమైన వ్యాయమాలు శుక్రకణాలను దెబ్బతీయొచ్చు.
2. వదులుగా ఉన్న లోదుస్తులు వేసుకోవాలి.
3. మీ ఆరోగ్యం పాడుచేసేది ఏదైనా శుక్రకణాల నాణ్యత మీదా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.
4. పోషకాలున్న ఆహారం, నాణ్యమైన జీవనశైలి స్పర్మ్ కౌంట్, నాణ్యత పెంచుతాయి.