Best Web Hosting Provider In India 2024
బాలాపూర్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. తన ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడనే కారణంతో ప్రశాంత్‌ను నిందితుడు చంపేశాడు. బాలాపూర్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రశాంత్(24) తన ప్రియురాలితో చాటింగ్ చేస్తున్నాడని కక్ష పెంచుకున్న మాధవ యాదవ్.. ఆరుగురు స్నేహితులతో కలిసి హత్య చేశాడు. హత్య తర్వాత పరారైన వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పట్టపగలే హత్య..
ఈ హత్య కేసు విచారణలో పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. హత్య చేసిన వారికి గంజాయి, మద్యం అలవాట్లు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మద్యం విషయం పక్కనబెడితే.. వీరికి గంజాయి ఎక్కడి నుంచి వస్తోందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రశాంత్ మర్డర్ దృశ్యాలు.. సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. పట్టపగలే హత్య చేసి నిందితులు దర్జాగా వెళ్లిపోయారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో ప్రశాంత్ తల్లి గుండెలవిసేలా రోదించింది.
కత్తితో దాడి..
హత్యకు గురైన ప్రశాంత్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం పరీక్ష జరిగింది. పరీక్ష తర్వాత ప్రశాంత్ సహా నలుగురు వ్యక్తులు పాన్‌షాపు వద్దకు వచ్చి సిగెరెట్ తీసుకున్నారు. ఇదే సమయంలో నలుగురి మధ్య వివాదం జరిగింది. ప్రశాంత్ స్నేహితుల్లో ఒకరు ప్రశాంత్‌పై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. దాడి జరిగిన ప్రదేశాన్ని మహేశ్వరం డీసీపీ సునితారెడ్డి పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
విషాదమే మిగిలింది..
ప్రశాంత్‌ది ఖమ్మం. 20 ఏళ్ల కిందట ప్రశాంత్ కుటుంబం బాలాపూర్ వచ్చి స్థిరపడింది. ఒక్కగానొక్క కుమారుడిని బాగా చదివించాలని అతని తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చారు. కానీ.. వారికి విషాదమే మిగిలింది. చేతికి అందివచ్చిన కుమారుడు ఇలా హత్యకు గురవడంతో.. ప్రశాంత్ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తన కుమారుడిని అతని స్నేహితులు ఇంటికి వచ్చి తీసుకెళ్లి.. ఇలా హత్య చేశారని రోధిస్తోంది.
టాపిక్