AP Floods : ఏపీలో 13 వేల మంది పునరావాస కేంద్రాలకు తరలింపు, 69 వేల హెక్టార్లలో పంట నష్టం- హోంమంత్రి అనిత

Best Web Hosting Provider In India 2024


AP Floods : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ ద్వారా వరద పరిస్థితులపై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా సహాయ పునరావాస కార్యక్రమాల్లో అధికారిక యంత్రాంగం నిమగ్నమైందని మంత్రి తెలిపారు. ఇంత వరకు 294 గ్రామాలకు చెందిన 13,227 మంది ముంపు బాధితులను 100 పునరావాస కేంద్రాలకు తరిలించామన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలు ముంపు ప్రాంతానికి చెందిన 600 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం 5 బోట్లు , 1 హెలికాఫ్టర్ సిద్ధంగా ఉంచామని మంత్రి అనిత తెలిపారు.

ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలో 62,644 హెక్టార్లలో వరి పంట, 7218 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీట మునిగాయని హోంమంత్రి అనిత తెలిపారు. రాయనపాడు రైల్వే స్టేషన్ లో తమిళనాడు ఎక్స్ ప్రెస్ ను నిలుపుదల చేసిన కారణంగా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నయ ఏర్పాటు చేశామన్నారు.

రైల్వే ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు

శనివారం అర్ధరాత్రి రాయనపాడు సాటిలైట్ రైల్వే స్టేషన్ చేరుకున్న తమిళనాడు ఎక్స్ ప్రెస్ లోని సుమారు 1600 మంది ప్రయాణికులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. సృజన ఆదేశాలతో విజయవాడ ఆర్డీవో పర్యవేక్షణలో రెవెన్యూ అధికారులు ప్రయాణికులను సురక్షితంగా విజయవాడ రైల్వే స్టేషన్ కు తరలించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద ఉద్ధృతి దృష్ట్యా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన ట్రాక్టర్ల ద్వారా, అక్కడ నుంచి 30 ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులను సురక్షితంగా విజయవాడ రైల్వే స్టేషన్ కు తీసుకువచ్చారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జిల్లా రెవెన్యూ యంత్రాంగం అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేసింది.

కృష్ణానదికి వరద ఉద్ధృతి

కృష్ణా నది ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 3,60,030 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,86,715 క్యూసెక్కులు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 4,93,782 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5,75,903 క్యూసెక్కులు ఉన్నాయని పేర్కొంది. పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 6,20,900 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 6,75,230 క్యూసెక్కులుగా ఉంది.

ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 7,69,443 క్యూసెక్కులు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాగులు, వంకలు పొంగిపోర్లుతాయని, ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

13 గంటల ఆపరేషన్.. 80 మంది సిబ్బంది

నూజివీడు దగ్గర పెద్ద చెరువుకు భారీగా గండి పడటంతో ఒకేసారి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చింది. దీంతో వరద నీరు చుట్టుపక్కల గ్రామాలను చుట్టుముట్టింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే అధికార యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేశారు. ఎస్పీ కిషోర్ దగ్గరుంచి సహాయక చర్యలు పర్యవేక్షించారు. మంత్రి పార్ధసారధి పలు మార్లు ఘటనా స్థలానికి చేరుకొని సమీక్షించారు. అధికారులు సకాలంలో స్పందించటంతో ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను కాపాడి పునరావాస కేంద్రాలకు తరలించారు.

సంబంధిత కథనం

టాపిక్

FloodsAp RainsVijayawadaAmaravatiImd AmaravatiTelugu NewsAndhra Pradesh News

Source / Credits

Best Web Hosting Provider In India 2024