Bulldozer justice : ‘బుల్డోజర్​ జస్టిస్​’కి సుప్రీంకోర్టు చెక్? ‘దోషిగా తేలినా..’

Best Web Hosting Provider In India 2024


దేశంలో నానాటికి పెరిగిపోతున్న ‘బుల్డోజర్​ జస్టిస్​’ కల్చర్​పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. క్రిమినల్​ కేసులో నిందితుడిగా ఉన్నంత మాత్రనా, ఆస్తులను ఎలా కూల్చివేయగలరు? అని ప్రశ్నించింది. ఈ మేరకు ప్రభుత్వాలు చేపడుతున్న బుల్డోజర్​ చర్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

దేశవ్యాప్తంగా ఈ బుల్డోజర్​ జస్టిస్​ వ్యాపించకుండగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్​ తరపు వాదనలు వినిపించిన సీనియర్​ న్యాయవాది దుష్యంత్​ దావే అన్నారు. మరోవైపు దీనికి బదులిచ్చిన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహ్తా.. ఈ విషయంలో సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

“క్రిమినల్​ కేసులో నిందితుడిగా ఉన్నంత మాత్రాన స్థిరాస్తులను కూల్చివేయలేము. అక్రమంగా కట్టిన వాటినే కూల్చవేయగలము,” అని తుషార్​ మెహ్తా కోర్టుకు తెలిపారు.

దీనిపై స్పందించిన జస్టిస్​ బీఆర్​ గవై.. “మీరు దీనికి కట్టుబడి ఉంటే, ఈ మేరకు మార్గదర్శకాలు ఇస్తాము. నిందితుడిగా ఉన్నా, దోషిగా తేలినా.. ఆస్తులను కూల్చివేయలేము,” అని అన్నారు.

“అక్రమంగా కట్టినదైతే తప్పులేదు. ప్రజా రహదారులకు ఆటంకం కలిగించే ఎలాంటి అక్రమ కట్టడాలను మేము రక్షించము. కానీ నిజంగానే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆస్తులను కూల్చుతున్నట్టు అయితే దీనిపై మార్గదర్శకాలు అవసరం. వాటిని డాక్యుమెంట్​ చేయాలి,” అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

“ముందు నోటీసులు ఇచ్చి, సమాధానాలు అడిగి, న్యాయ వ్యవస్థను సంప్రదించి, అప్పుడు కూల్చివేస్తే ఎలా ఉంటుంది? ఈ మేరకు మార్గదర్శకాలు ఎందుకు ఇవ్వకూడదు?” అని జస్టిస్​ విశ్వనాథ్​ అభిప్రాయపడ్డారు.

అక్రమంగా కట్టిన కట్టడాలను తాము సమర్థించడం లేదు కానీ కూల్చివేతలకు మార్గదర్శకాలు అవసరం అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

దిల్లీ జహంగీర్​పురిలో కూల్చివేత ఘటనపై దాఖలైన పిటిషన్​ మీద న్యాయవాదులు వాదనలు వినిపించారు. కొన్ని ఘటనల్లో రెంటుకు తీసుకున్న ఆస్తులను కూడా ధ్వంసం చేశారని పేర్కొన్నారు.

రాజస్థాన్​లో జరిగిన మరో ఉదాహరణ కూడా ప్రస్థావనకు వచ్చింది.

“రాజస్థాన్​ ఉదయ్​పూర్​లో ఓ ఇంటిని కూల్చివేశారు. ఓ విద్యార్థి, తన క్లాస్​మెంట్​ని పొడిచేస్తే, అతని ఇంటిని కూల్చేశారు. ఓ వ్యక్తి కుమారుడు తప్పు చేస్తే, ఇంటిని కూల్చివేయడం సరైనది కాదు,” అని జస్టిస్​ విశ్వనాథ్​ పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై సెప్టెంబర్​ 17వ విచారణ చేపట్టనున్నట్టు, అప్పటికి ఇరు వర్గాలు ఈ విషయంపై సూచనలతో ముందుకు రావాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

నేరాలకు పాల్పడినా, నేరం చేశారన్న అనుమానాలు ఉన్నా ఈ మధ్య కాలంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు సంబంధిత వ్యక్తుల ఇళ్లపైకి బుల్డోజర్లను తీసుకెళ్లి ధ్వంసం చేస్తున్న దృశ్యాలు నిత్యం వార్తల్లో కనిపిస్తూనే ఉంటున్నాయి. యూపీ సహా ఇతర రాష్ట్రాల్లో దీనికి ‘బుల్డోజర్​ జస్టిస్​’ అన్న పేరు కూడా వచ్చింది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024



Source link