




Best Web Hosting Provider In India 2024

Warangal Suicide: స్నాప్‌చాట్ పరిచయమే కొంప ముంచిందా! ఇంటర్ స్టూడెంట్ సూసైడ్ కేసులో ఆసక్తికర విషయాలు
Warangal Suicide: వరంగల్ నగరంలో రెండు రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వరంగల్ కు చెందిన ఓ యువకుడితో హనుమకొండ గోపాలపూర్ కు చెందిన బాలిక ప్రేమలో పడగా, ఇద్దరూ చనువుగా ఉండటం చూసిన బాలిక తండ్రి యువకుడి గొంతు కోశాడు.
Warangal Suicide: ప్రియుడి గొంతు కోయడంతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన రెండు రోజుల క్రితం వరంగల్ నగరంలో తీవ్ర కలకలం రేపింది. బాధిత యువకుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతుండగా.. అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.

స్నాప్ చాట్ చాటింగ్ ద్వారానే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. అనంతరం తరచూ చాటింగ్ చేసుకోవడం, అందులోనూ ఒకే కాలేజీ అని తెలిసిన తరువాత ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. ఆ ప్రేమ వ్యవహారమే ఇప్పుడు ఇంతటి దారుణానికి కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏడాది కిందట పరిచయం
వరంగల్ చైతన్య నగర్ ప్రాంతానికి చెందిన కూతాటి భరత్ కుమార్ హనుమకొండ వడ్డేపల్లిలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదివాడు. అదే కాలేజీలో హనుమకొండ గోపాలపూర్ శ్రీనివాస కాలనీకి చెందిన ఓ బాలిక కూడా చదివింది. కాగా ఆ ఇద్దరి మధ్య స్నాప్ చాట్ అనే యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది.
దాదాపు ఏడాది కిందట స్నాప్ చాట్ చాటింగ్ ద్వారా ఇద్దరి మధ్య స్నేహం కుదరగా.. ఆ తరువాత అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకే కాలేజీ అని తెలియడంతో తరచూ కలుసుకునేవారు. ఇంతవరకు బాగానే ఉండగా.. ఇద్దరి ప్రేమ వ్యవహారం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు షీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు అబ్బాయి తల్లిదండ్రులతో పాటు అమ్మాయి పేరెంట్స్ ను కూడా పిలిచి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. అబ్బాయి మరోసారి బాలికను కలవకుండా చూడాలని అతడి తల్లిదండ్రులకు సూచించారు. దీంతో అతడిని తల్లిదండ్రులు హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ లో చేర్పించారు.
దాడి చేసి.. గొంతు కోసి..
బాలిక తల్లిదండ్రులు ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగులు కాగా.. ఈ నెల 28న ఎవరి డ్యూటీకి వాళ్లు వెళ్లిపోయారు. దీంతో బాలిక భరత్ కు కాల్ చేసి ఇంటికి పిలిచింది. బాలిక చెప్పిన ప్రకారం ఉదయం 10.30 గంటల సుమారులో భరత్ అక్కడికి వెళ్లగా.. స్థానికులు కొందరు గమనించి బాలిక తండ్రికి సమాచారం ఇచ్చారు.
దీంతో మధ్యాహ్నం 3.30 గంటల సుమారులో బాలిక తండ్రి ఇంటికి చేరుకోగా.. అప్పటికే ఇద్దరూ మాట్లాడుకుంటుండటం చూసి ఆయన ఆగ్రహంతో రగిలిపోయాడు. యువకుడిపై దాడి చేయడంతో అతడు గోడ దూకి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
కానీ బాలిక తండ్రి, వారి బంధువు మరో వ్యక్తి కలిసి భరత్ ను పట్టుకున్నారు. అనంతరం కత్తితో యువకుడి గొంతు కోసే ప్రయత్నం చేశారు. దీంతో అతను అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. ప్రేమికుడితో ఉండగా తన తండ్రి చూడటం, గొడవ కూడా జరగడంతో భయాందోళనకు గురైన బాలిక వెంటనే ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకుంది.
గమనించిన స్థానికులు ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. అప్పటికే బాలిక మృతి చెందింది. కాగా గొంతుపై గాయంతో ఇంటికి వెళ్లిన యువకుడిని హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇదిలాఉంటే సోషల్ మీడియా యాప్ ద్వారా ఏర్పడిన పరిచయం.. రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టడంతో పాటు ఓ బాలిక ఆత్మహత్యకు కారణమైందనే చర్చ జరుగుతోంది.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
టాపిక్