



Best Web Hosting Provider In India 2024

Minister Lokesh : వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించారు, వైసీపీ సభ్యుల వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ ఫైర్
Minister Lokesh : గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనమండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రి లోకేశ్ కు మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఇంగ్లీషు భాష, వీసీలు, ఎన్డీయేకు మద్దతు, ప్రత్యేక హోదాపై మంత్రి లోకేశ్ సమాధానాలు చెప్పారు.
Minister Lokesh : గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఏపీ శాసన మండలిలో వాడీవేడి చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ముందే ఎలా చెప్పారని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. దీంతో మంత్రి లోకేశ్ గవర్నర్ ప్రసంగాన్ని ఇంగ్లీషులో చదివి వినిపించారు. ఏపీలో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, కొత్త ప్రాజెక్టుల వల్ల భారీగా ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
అయితే లోకేశ్ ఇంగ్లీషులో ప్రసంగం చదవడంపై వైసీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలిపారు. తెలుగు ప్రసంగాన్ని చదవమని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేవు సభలో వాగ్వాదం జరిగింది. అనంతరం మంత్రి లోకేశ్ తెలుగులో చదివి సమాధానం ఇచ్చారు.
గవర్నర్ ప్రసంగంపై
గవర్నర్ ప్రసంగం తెలుగు, ఇంగ్లీష్‌లో ప్రచురణల మధ్య తేడా ఉందంటూ వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. దీంతో మండలిలో గందరగోళం నెలకొంది. గవర్నర్ తో అబద్దాలు చెప్పించారని, ప్రజలను ఇబ్బంది పెడుతూ సుపరిపాలన అంటున్నారని వైసీపీ ఎమ్మెల్సీ కల్యాణి ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంలో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని స్పష్టంగా ఉందని వైసీపీ ఎమ్మెల్సీ కల్యాణి అన్నారు. దీనిపై మంత్రి లోకేష్ సమాధానమిస్తూ…తాము ఉద్యోగాలు ఇచ్చామని ఎక్కడా చెప్పలేదన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించామనే చెప్పామన్నారు. నియమించామని చెప్పలేదని స్పష్టం చేశారు.
వైసీపీ సభ్యులు అవాస్తవాలు మాట్లాడాలన్నారన్నారు. ఇంగ్లీష్ మీడియం కావాలని అంటున్న వైసీపీ సభ్యులకు…ఇంగ్లీష్‌లో సమాధానం చెప్తే ఇబ్బంది అంటారని మంత్రి అన్నారు. గవర్నర్ ప్రసంగం తెలుగు అనువాదంలో తేడా ఉందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. తప్పుంటే మార్చుకుంటామని చెప్పండని పేర్కొన్నారు.
వీసీలపై వాడీవేడి చర్చ
వైసీపీ ఎమ్మెల్సీ కల్యాణ్ మాట్లాడుతూ… ప్రజలను ఇబ్బంది పెడుతూ సుపరిపాలన అంటున్నారని, వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించారని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేకపోతే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం లేదని అంటున్నారని, నిధులు ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు. దీనిపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేయడం కాదు. వీసీలకు ఎవరు ఫోన్ చేసి రాజీనామా చేయమని బెదిరించారో చెప్పండి. ఛాలెంజ్ చేసి అడుగుతున్నా.. విపక్ష సభ్యులు గవర్నర్ అవమానించేలా మాట్లాడుతున్నారు. మాటలు చెప్పడం కాదు, ఆధారాలు ఇవ్వండి. మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా.. మీరు ఆధారాలిస్తే ఇప్పటికిప్పుడు ఎంక్వయిరీకి ఆదేశిస్తా” అని లోకేశ్ అన్నారు.
రాష్ట్ర ప్రయోజనా కోసం ఎన్డీయే మద్దతు
“రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్నికల ముందే ఎన్డీయేకు మద్దతు తెలిపాం. మేం పదవులు ఏమీ కోరలేదు. రాష్ట్రానికి నిధులివ్వాలని అడిగాం. మా పైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడినట్లు మేము చెప్పినట్లు వక్రీకరిస్తున్నారు. టీడీపీ, జనసేన రెండూ కలిసి ఎన్డీయేకు మద్దతు తెలిపాయి. రైల్వే జోన్ తెచ్చాం, విశాఖ ఉక్కుని కాపాడాం, అమరావతి, పోలవరానికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చాం”- మంత్రి లోకేశ్
“ఆ రోజు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ అన్నారు. ఏమైంది? టీడీపీ, జనసేన రెండూ కలిసి ఎన్డీయేకు మద్దతు తెలిపాయి. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని ముందుగానే చెప్పాం. అధికారంలోకి రాగానే రూ.13 వేల కోట్లు రాష్ట్రానికి తీసుకొచ్చాం. అమరావతి, పోలవరానికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చాం. విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కును కాపాడుకున్నాం” –మంత్రి లోకేశ్
సంబంధిత కథనం
టాపిక్