



Best Web Hosting Provider In India 2024

Netflix Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో సూపర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. గెలుపు ఎవరిది?
Netflix Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. గతంలో ఎమ్మెస్ ధోనీలాంటి సినిమా తెరకెక్కించిన దర్శకుడు నీరజ్ పాండే కథ అందించిన సిరీస్ ఇది.
Netflix Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ అంటే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ లకు కేరాఫ్. ఇప్పటికే ఎన్నో అలాంటి మూవీస్, సిరీస్ వచ్చాయి. తాజాగా ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ పేరుతో మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. బుధవారం (ఫిబ్రవరి 26) ఈ సిరీస్ టైటిల్ టీజర్ ను ఆ ఓటీటీ రిలీజ్ చేసింది.
ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ వెబ్ సిరీస్
నెట్‌ఫ్లిక్స్ లో ఇప్పటికే ఖాకీ: ది బీహార్ ఛాప్టర్ పేరుతో ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పుడు బెంగాల్ ఛాప్టర్ పేరుతో మరో సీజన్ రాబోతోంది. టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.
“ఖూన్ యా కానూన్ (రక్తం లేదా చట్టం).. గెలుపు దేనిది? ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది” అనే క్యాప్షన్ తో టైటిల్ టీజర్ ను ఆ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ పోస్టర్ చాలా ఇంటెన్స్ లుక్ లో ఉంది. ఇందులో సిరీస్ లోని ప్రధాన పాత్రలన్నీ కనిపిస్తున్నాయి. చాలా వరకు చేతుల్లో గన్స్ తో ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే.. రక్తం ఏరులై పారే వెబ్ సిరీస్ లా కనిపిస్తోంది.
ఈ వెబ్ సిరీస్ లో జీత్ మద్నానీ, ప్రొసేన్‌జిత్ ఛటర్జీ, శాశ్వతా ఛటర్జీలాంటి వాళ్లు నటిస్తున్నారు. కోల్‌కతాలోని బాగా అనే డాన్ ఆట కట్టించే అర్జున్ మైత్రా అనే పోలీస్ ఆఫీసర్ కథే ఈ ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్.
ఖాకీ: ది బీహార్ ఛాప్టర్ గురించి..
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇప్పటికే ఖాకీ: ది బీహార్ ఛాప్టర్ పేరుతో ఓ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. మొదట నవంబర్, 2022లో తొలి సీజన్ వచ్చింది. తర్వాత ఆగస్ట్ 2023లో రెండో సీజన్ ను కూడా తీసుకొచ్చారు.
ఈ వెబ్ సిరీస్ బీహార్ లో పేరు మోసిన ఓ క్రిమినల్ ఆట కట్టించడానికి ప్రయత్నించే ఓ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. నీరజ్ పాండే ఈ షోని కూడా క్రియేట్ చేశాడు. కరణ్ టక్కర్, అవినాష్ తివారీ, అశుతోష్ రాణా, అభిమన్యు సింగ్ లాంటి వాళ్లు నటించారు. భవ్ ధూలియా డైరెక్ట్ చేశాడు. ఈ సిరీస్ ను ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు. ఇక ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ కూడా త్వరలోనే ఇదే ఓటీటీలోకి వస్తోంది.
సంబంధిత కథనం