
Best Web Hosting Provider In India 2024

Mushroom Fry: పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో చేసే రెసిపీలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మేము పుట్టగొడుగుల ఫ్రై రెసిపీ ఇచ్చాము. ఈ మష్రూమ్ ఫ్రై చేసుకుంటే దీని ముందు చికెన్ ఫ్రై కూడా ఎందుకు పనికిరాదు. అంత టేస్టీగా ఉంటుంది ఇది. పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. కారంగా తినేవారు దీన్ని కాస్త స్పైసీగా చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌గా ఈ మష్రూమ్ ఫ్రై చేసుకుని చూడండి. ఆ రెండింటి కాంబినేషన్ అదిరిపోతుంది.
మష్రూమ్ ఫ్రై రెసిపీకి కావలసిన పదార్థాలు
తెల్లని బటన్ మష్రూమ్స్ – 10
జీడిపప్పులు – పావు కప్పు
ఉల్లిపాయ – ఒకటి
టమోటో – ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
పచ్చిమిర్చి – ఒకటి
కరివేపాకులు – గుప్పెడు
జీలకర్ర – ఒక స్పూను
నూనె – తగినంత
కారం – అర స్పూను
పసుపు పొడి – చిటికెడు
గరం మసాలా – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నిమ్మరసం – ఒక స్పూన్
మష్రూమ్ ఫ్రై రెసిపీ
1. జీడిపప్పులను నీటిలో వేసి పావుగంట పాటు నానబెట్టుకోవాలి.
2. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. అందులో జీలకర్ర వేసి వేయించాలి.
5. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి.
6. పచ్చిదనం పోయి, సువాసన వచ్చేవరకు ఆ పేస్టును వేయించాలి.
7. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.
8. ఉల్లిపాయల రంగు మారే వరకు వేయించాలి.
9. మష్రూమ్స్ ను సన్నగా తరిగి శుభ్రంగా కడిగి ఉల్లిపాయల మిశ్రమంలో వేసి వేయించుకోవాలి.
10. చిన్న మంట మీద పావుగంట సేపు వేయిస్తే వాటి పచ్చివాసన పోతుంది.
11. ఆ తర్వాత కారం పొడి, గరం మసాలా, పసుపు, కరివేపాకులు వేసి కలుపుకోవాలి.
12. టమోటో ప్యూరీని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
13. ఇందులో ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
14. చిన్న మంట మీద చేస్తే ఈ ఫ్రై చక్కగా అవుతుంది.
15. మొత్తం ఇంకిపోయి ఫ్రై లాగా అయినప్పుడు పైన నిమ్మరసం చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.
16. ఇది అన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా రుచిగా ఉంటుంది.
కొన్ని రకాల ఆహారాలు కొందరిలో అలెర్జీలను కలగజేస్తాయి. అలాంటి వాటిల్లో పుట్టగొడుగులు కూడా ఉన్నాయి. మీకు పుట్టగొడుగులు అలెర్జీ ఉందో లేదో ముందే తెలుసుకోండి. అలెర్జీ ఉంటే వీటిని తినకపోవడం మంచిది లేకుంటే పుట్టగొడుగులు తిన్న వెంటనే చర్మంపై దద్దుర్లు దురదలు వంటివి కనిపిస్తే మీకు ఎలర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. ఎలాంటి ఎనర్జీ లేనివారు పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకుంటే శారీరక మానసిక ఆరోగ్యం ఎంతో చక్కగా ఉంటుంది