



Best Web Hosting Provider In India 2024

Palnadu Crime : పల్నాడు జిల్లాలో ఘోరం.. బాలికను ఇద్దరు పిల్లల తల్లిని చేసిన వివాహితుడు!
Palnadu Crime : పల్నాడు జిల్లాలో ఘోరం జరిగింది. బాలికను మాయమాటలతో లోబర్చుకుని.. ఇద్దరు పిల్లల తల్లిని చేశాడు ఓ వివాహితుడు. ఇద్దరు పిల్లలను దత్తత పేరుతో అమ్మేశాడు. అమ్మాయిలు కావాలంటే, ఈ నెంబర్‌ను సంప్రదించండని రైళ్ల బోగీలపై ఆమె ఫోన్ నెంబర్‌ను రాశాడు. తిరిగి ఆమెపైనే ఫిర్యాదు చేశాడు.
పల్నాడు జిల్లా రొంపిచర్లలో దారుణం జరిగింది. బాలికను మోసం చేసిన వివాహితుడు.. ఆమెపైనే ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రొంపిచర్లకు చెందిన బత్తుల నాగరాజు (31)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2017లో తన ఇంటి సమీపంలో నివసించే 13 ఏళ్ల బాలికపై కన్నేశాడు. మాయమాటలతో చెప్పి ఆ బాలికను లోబర్చుకున్నాడు. నాగరాజుకు పెళ్లి అయినట్లు ఆ బాలికకు తెలియదు. బాలికతో సహజీవనం చేశాడు. ఈ క్రమంలో ఆమెను ఇద్దరు ఆడపిల్లలకు తల్లిని చేశాడు. ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి.. ఆ ఇద్దరు పిల్లలను దత్తత పేరుతో అమ్మేశాడు.
భయంతో పెళ్లి..
తన కుమార్తె కనిపించడం లేదని బాలిక రొంపిచర్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. పోలీస్ విచారణలో బాలిక నంద్యాలలో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు అక్కడికి వెళ్లి, బిడ్డను తీసుకొచ్చారు. నిందితుడు నాగరాజు కూడా కొద్ది రోజులుగా నంద్యాలలో ఒక రైల్వే కాంట్రాక్టర్ వద్ద కూలీగా పని చేశాడు. పోలీసులు నాగరాజును కూడా పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. పోలీసు కేసు అవుతుందేమోనని భయంతో బాలికను పెళ్లి చేసుకున్నట్లు తాళి కట్టాడు.
అప్పటికే ఇద్దరు పిల్లలు..
నాగరాజుకు ఇప్పటికే పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని బాలిక ఆలస్యంగా తెలుసుకుంది. ఊరి పెద్ద మనుషుల ముందు పంచాయతీ పెట్టింది. అప్పటి నుంచి నాగరాజుకు దూరంగా తల్లి వద్దే ఉంటుంది. బాలికను తిరిగి తన వద్దకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు. కుదరలేదు. దీంతో బాలిక కుటుంబంపై దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. ఆమె ఫోన్ నెంబర్‌ను రైలు బోగీలపై రాసి.. అమ్మాయిలు కావాలంటే ఈ నెంబర్‌ను సంప్రదించాలని దుశ్చర్యకు పాల్పడ్డాడు.
పోలీసులకు ఫిర్యాదు..
తన పిల్లలను బాలిక కుటుంబ సభ్యులు వేరే వారికి అమ్మేశారని మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌లోనూ, శిశు సంక్షేమ శాఖలోనూ నాగరాజు తప్పుడు ఫిర్యాదు చేశాడు. పోలీసు విచారణలో అసలు విషయం బయటపడింది. అతడు ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు కేసులు పెట్టినట్లు వెల్లడైంది. అతడి ఫిర్యాదును శిశు సంక్షేమ శాఖ విజయవాడకు బదిలీ చేసింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించిన నాగరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయవాడ గాంధీనగర్‌లోని సీడబ్ల్యూసీ సభ్యులను బాధితురాలు కోరింది. సీడబ్ల్యూసీ వారు ఈ కేసును విజయవాడ మహిళా పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.
సీపీని కలిసిన బాధితులు..
నాగరాజు చరిత్ర మొత్తం బయటకు వచ్చింది. బాలికను మాయమాటలతో వంచించినట్లు స్పష్టం అయింది. తానే పిల్లలను అమ్మేసి, తిరిగి బాలిక కుటుంబ సభ్యులపై కేసులు పెట్టాడని స్పష్టం అయింది. బాలికపైన, ఆమె కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసి రాక్షస ఆనందం పొందాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబును కలిసి న్యాయం చేయాలని కోరారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్