


Best Web Hosting Provider In India 2024

Compulsory Telugu: తెలంగాణలో అన్ని స్కూళ్లలో ఇక తెలుగు బోధన తప్పనిసరి.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
Compulsory Telugu: తెలంగాణలో మాతృభాషలో బోధన తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అన్ని రకాల పాఠశాలల్లో తెలుగులో విద్యాబోధన తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలతో పాటు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ స్కూళ్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.
Compulsory Telugu: పాఠశాలల్లో మాతృభాష బోధన విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్, మండలపరిషత్ ఎయిడెడ్ , ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగులో బోధన తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగతి రాణా మెమో జారీ చేశారు.
అన్ని పాఠశాలల్లో విధిగా తెలుగు బోధన ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణలో పాఠశాలల్లో నిర్బంధ తెలుగు బోధన చట్టం 2018 నుంచి అమల్లో ఉంది. అయితే ఇది పలు కారణాలతో అమలు కాలేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సీబీఎస్‌ఈ బోర్డు యాజమాన్యాల బోర్డుతో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ పాఠశాలల్లో ఈ నిర్ణయం అమలవుతుంది.
2025-26 విద్యా సంవత్సరంలో 9, 10 తరగతులకు తప్పనిసరిగా తెలుగు బోధన అమలు చేస్తారు. పరీక్షలు కూడా నిర్వహిస్తారు. తెలుగును సరళీకృత విధానంలో బోధించి, చదువుకునే వారి అభిరుచి పెంచుతూ చదువును కొనసాగించడానికి తెలుగు వాచకం వెన్నెలను 9,10 తరగతి విద్యార్థులకు బోధించాల్సి ఉంటుంది. ఈ మేరకు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ సిలబస్‌లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం సంచలన నిర్ణయం..
తెలంగాణలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీతో పాటు అన్ని బోర్డుల పరిధిలోని పాఠశాలల్లో 9, 10 తరగ తుల్లోనూ తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో 1-10 తరగతుల వరకు అన్ని బోర్డుల పరిధిలో మాతృభాష తెలుగును విధిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం 2018 మార్చి 30న చట్టం చేసింది. అధికారులు అదే సంవత్సరం జూన్‌లో జీవో 15 జారీ చేశారు. సీబీఎస్ ఈ లాంటి ఇతర బోర్డుల పరిధిలోని పాఠశాలల్లో ఇప్పటివరకు 1 నుంచి 8వ తరగతి వరకు మాత్రమే తెలుగును బోధిస్తున్నారు.
8వ తరగతి వరకు త్రిభాషా సూత్రం అమల్లో ఉన్నందున ఆంగ్లం, హిందీతోపాటు తెలుగును ఒక సబ్జెక్టుగా మాత్రమే అయా పాఠశాలల్లో బోధిస్తున్నారు. తొమ్మిది, పది తరగతుల్లో మాత్రం రెండు భాషలకు సంబంధించిన సబ్జెక్టులే ఉంటాయి. అందులో ఒకటి ఆంగ్లం తప్పనిసరిగా ఉంటుంది. మరొకటి హిందీ లేదా వేరే భాషలను, విద్యార్థుల మాతృభాషలను చదువుకుంటున్నారు. తెలంగాణలో ఉత్తరాదికి చెందిన విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాల విద్యార్థులు హిందీను ఐచ్చికంగా ఎంచుకుంటున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో ఇకపై విద్యార్థులు ద్వితీయ భాషగా తెలుగును తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరంలో 9వ తరగతిలో, ఆ తర్వాత సంవత్సరంలో పదిలో తెలుగు సబ్జెక్టును విధిగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మాతృభాష తెలుగు కాని వారి కోసం 2018-19లోనే వెన్నెల పేరిట సులభమైన తెలుగు వాచకం పుస్తకాన్ని విద్యాశాఖ రూపొందించింది. ప్రస్తుతం దాన్ని 1-8 తరగతి వరకు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తది తర పాఠశాలల్లో చదివే వారు ఉపయోగిస్తున్నారు. 9, 10 తరగతుల విద్యార్థులు కూడా వెన్నెల పుస్తకాన్ని ఉపయోగించేందుకు అధికారులు అనుమతిచ్చారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ, ఐబీ, ఐసీఎస్‌ఈ బోర్డు యాజమాన్యలలో విధిగా తెలుగు బాషలో బోధనతో పాటు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్