


Best Web Hosting Provider In India 2024

Krishna Crime: కృష్ణాజిల్లాలో ఘోరం, పెళ్ళి చేసుకోవాలని వివాహితకు వేధింపులు, కాదన్నందుకు కత్తితో దాడి
Krishna Crime: కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని ఓ వివాహితను యువకుడు వేధిస్తున్నాడు. పెళ్లి చేసుకోకపోతే నిన్ను, నీ భర్తను చంపేస్తానని బెదిరించాడు. తనకు పెళ్లి అయిందని, కూతురు ఉందని, పెళ్లి చేసుకోలేనని అనడంతో ఆ వివాహితపై ఆ యువకుడు కత్తితో దాడి చేశాడు.
Krishna Crime: వివాహితను పెళ్లి చేసుకోవాలనుకున్న యువకుడు, ఆమె కాదనడంతో కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమెకు స్వల్ప గాయాలు కాగా, అడ్డొచ్చిన యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుడివాడ పట్టణంలోని భీమవరం రైల్వే గేటు ప్రాంతంలో వివాహిత నివసిస్తున్నారు. ఆమెకు భర్త, ఒక కుమార్తె కూడా ఉన్నారు. ఆమె భర్త ఆగిరిపల్లిలో పని చేస్తుండగా, ఆమె మాత్రం గుడివాడ పట్టణంలోనే బ్యూటీషియన్‌గా పని చేస్తున్నారు.
ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం 2020లో గుడివాడకు చెందిన కె. జగదీష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరూ ఫోన్ నెంబర్లు ఇచ్చుపుచ్చుకున్నారు. దీంతో అప్పటి నుంచి తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు.
ఇటీవల వారిద్ధరి మధ్య వివాదం చోటు చేసుకుంది. అప్పటి నుంచి జగదీష్‌కు ఆమె దూరంగా ఉంటుంది. అంతేకాకుండా జగదీష్ ఫోన్ నెంబర్‌ను కూడా బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. అయితే జగదీష్ వేర్వేరు ఫోన్ నెంబర్లతో ఫోన్ చేసి వేధిస్తున్నాడు. దీంతో ఆమెకు మాత్రం జగదీష్‌తో మాట్లాడటానికి విముఖత వ్యక్తం చేసింది.
యువకుడి వేధింపులతో జగదీష్‌ను దూరంగా ఉంచడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో ఆమె పని చేసే వద్దకు వెళ్లి నానా హంగామా చేసేవాడు.
కొన్ని రోజుల క్రితం ఆమె పని చేసే బ్యూటీ పార్లర్ వద్దకు వెళ్లి, ఆమెతో ఘర్షణకు దిగి దాడి చేశాడు. అప్పుడు ఆమె జగదీష్ కుటుంబ సభ్యులు, పెద్దలకు చెప్పి హెచ్చరించారు. అయితే ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆమె పని చేసే బ్యూటీ పార్లర్ వద్దకు జగదీష్ వెళ్లాడు. ఆమె బయటకు వచ్చేంత వరకు అక్కడే బయట వేచి ఉన్నాడు. అయితే ఆమె ఎంతకీ బయటకు రాలేదు.
దీంతో రాత్రి 10 గంటల దాటిన తరువాత ఒక్కసారిగా బ్యూటీపార్లర్ లోపలకి చొరబడ్డాడు. వెంటనే తనతో తెచ్చుకున్న కత్తి తీసి ఆమెపై దాడి చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే నిన్ను, నీ భర్తను చంపేస్తానని బెదిరిస్తూ దాడికి పాల్పడ్డాడు.
ఈ క్రమంలో అక్కడే ఉన్న కొంత మంది సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిపై కూడా దాడికి దిగాడు. ఈ దాడిలో ఆమెకు స్వల్ప గాయాలు అవ్వగా, అడ్డొచ్చిన యువకుల్లో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిద్దరిని వెంటనే గుడివాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు.
బాధితుల వద్ద వివరాలు సేకరించారు. అనంతరం ఆమె కోసం నిందితుడు జగదీష్ ఆమె చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వెళ్లాడు. దీంతో అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు జగదీష్‌ను అదుపులోకి తీసుకుని, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం
టాపిక్