మీ రోజువారీ ప్రయాణం ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతోందా? ఆంకాలజిస్ట్ ఏమంటున్నారంటే…

Best Web Hosting Provider In India 2024

మీ రోజువారీ ప్రయాణం ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతోందా? ఆంకాలజిస్ట్ ఏమంటున్నారంటే…

HT Telugu Desk HT Telugu

వాహనాల పొగ, కాలుష్యానికి ఎక్కువసేపు గురికావడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఓ ఆంకాలజిస్ట్ చెబుతున్నారు. దీన్ని నివారించడానికి కొన్ని చిట్కాలను కూడా తెలుసుకోండి.

వాయు కాలుష్యం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి (Unsplash)

సాధారణంగా, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు పొగతాగడం, పొగాకు ఉత్పత్తులను వాడటం అనే విషయం మనకు తెలుసు. అయితే, ఇటీవలి అధ్యయనాలు మాత్రం పెరుగుతున్న వాయు కాలుష్యం, పర్యావరణ కాలుష్య కారకాలకు ఎక్కువసేపు గురికావడం కూడా ఈ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతున్నాయని తేల్చాయి.

HT లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముంబైలోని HCG క్యాన్సర్ సెంటర్, మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ ఇందు అంబుల్కర్ మాట్లాడుతూ, “ఊపిరితిత్తుల క్యాన్సర్‌ మరణాల్లో 29% వరకు కేవలం వాయు కాలుష్యం వల్లే జరుగుతున్నాయి. ఇండోర్ కాలుష్యం వల్ల మరణాలు తగ్గినా, అవుట్‌డోర్ వాయు కాలుష్యం బాగా పెరిగిపోయింది” అని అన్నారు. మరి మీ రోజువారీ ప్రయాణం మీ ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతోందా?

డాక్టర్ ఇందు అంబుల్కర్ దీనిపై మాట్లాడుతూ, “అవును, పెంచుతోంది. ముఖ్యంగా మీరు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, వాహనాల పొగ ఎక్కువగా ఉన్న చోట ఎక్కువ గంటలు గడిపితే ఈ ప్రమాదం ఎక్కువ. డీజిల్ పొగ, సన్నటి కణ పదార్థం (PM2.5), నైట్రోజన్ డయాక్సైడ్, వాహనాల నుండి వెలువడే ఇతర కాలుష్య కారకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) క్యాన్సర్‌ను కలిగించేవిగా వర్గీకరించింది.

ఈ సూక్ష్మ కణాలు ఊపిరితిత్తులలోకి లోతుగా వెళ్లి, కాలక్రమేణా ఊపిరితిత్తుల కణజాలాన్ని దెబ్బతీస్తాయి. ఇవి క్యాన్సర్‌కు దారితీసే మార్పులను ప్రేరేపించే అవకాశం ఉంది” అని వివరించారు.

“వాయు కాలుష్యానికి దీర్ఘకాలికంగా గురికావడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు చూపించాయి. భారతదేశంలో, మహానగరాల్లో కాలుష్య స్థాయిలు సురక్షిత పరిమితులను మించిపోతున్నందున, ఇది ఒక పెద్ద ప్రజా ఆరోగ్య సమస్యగా మారింది. రోజువారీ ప్రయాణికులు కార్లు నడుపుతున్నా, బైక్‌లు నడుపుతున్నా, లేదా ప్రజా రవాణాను ఉపయోగిస్తున్నా హానికరమైన కాలుష్య కారకాలకు నిరంతరం గురవుతారు, ముఖ్యంగా పీక్ ట్రాఫిక్ వేళల్లో” అని ఆ ఆంకాలజిస్ట్ వాయు కాలుష్యం ఊపిరితిత్తుల ఆరోగ్యంపై చూపే ప్రభావాన్ని నొక్కి చెప్పారు.

వాయు కాలుష్యం ఎదుర్కోవడానికి చిట్కాలు తెలుసుకోండి
వాయు కాలుష్యం ఎదుర్కోవడానికి చిట్కాలు తెలుసుకోండి (Unsplash)

నివారణకు పాటించాల్సిన చిట్కాలు:

“మనం ప్రయాణాలను పూర్తిగా ఆపలేం కదా, కానీ వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను తగ్గించుకోవచ్చు” అని డాక్టర్ చెప్పారు. కొన్ని నివారణ చిట్కాలను కూడా పంచుకున్నారు.

  1. ప్రయాణాల్లో నాణ్యత కలిగిన, కాలుష్య నిరోధక మాస్క్‌లు ధరించడం.
  2. కారు ఎయిర్ ఫిల్టర్‌లను శుభ్రంగా, మంచి స్థితిలో ఉంచడం.
  3. వీలైనంతవరకు తక్కువ రద్దీ గల మార్గాలను లేదా సమయాలను ఎంచుకోవడం.
  4. శుభ్రమైన, పర్యావరణ అనుకూల ప్రజా రవాణాను ప్రోత్సహించడం, ఉపయోగించడం.
  5. ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైయర్‌లను వాడటం.
  6. ముఖ్యంగా ఎక్కువ ప్రమాదం ఉన్న వ్యక్తులు ఊపిరితిత్తుల ఆరోగ్య పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవడం.

(గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా వైద్య పరిస్థితి గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే, ఎప్పుడూ మీ డాక్టర్‌ను సంప్రదించండి.)

మీ రోజువారీ ప్రయాణం వల్ల కలిగే కాలుష్యం గురించి మీరు ఆలోచిస్తున్నారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి!

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.
Source / Credits

Best Web Hosting Provider In India 2024