Best Web Hosting Provider In India 2024
Alapati Vs Nadendla: అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గద్దె దించే లక్ష్యంతో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించినా సీట్ల సర్దుబాటు అంత సులువుగా కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటికే పిఠాపురం, అనకాపల్లి వంటి ప్రాంతాల్లో సమన్వయ సమావేశాల్లో కొట్లాటకు దారితీశాయి. తాజాగా తెనాలి సీటుపై రగడ రాజుకుంది.
ట్రెండింగ్ వార్తలు
తెలుగుదేశం పార్టీ-జనసేన పొత్తులో భాగంగా తెనాలి సీటును మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు కాకుండా జనసేనకు కేటాయిస్తే తామంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. తెనాలి నుంచి కూటమి తరపున పోటీ చేయాలని జనసేన పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎప్పట్నుంచో భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఆయన ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారుర.
రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో తెనాలి స్థానం కోసం జనసేన పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఇదే స్థానంపై ఆలపాటి కూడా ఎప్పట్నుంచో కన్ననేశారు. చివరి నిమిషంలో తనకు సీటు దక్కదనే ఆందోళన ఆలపాటిలో ఉంది.
తాజాగా సంక్రాంతి సందర్భంగా తెనాలిలో యడ్లపాటి వెంకట్రావు నివాసంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆత్మీయ సమావేశం నిర్వహించడం, ఈ సమావేశానికి ఆలపాటి రాజాను ఆహ్వానించకపోవడం చర్చకు దారి తీసింది.
దీంతో గుంటూరు విద్యానగర్‌లోని ఆలపాటి కార్యాలయంలో తెనాలి పట్టణం, గ్రామీణం, కొల్లిపర మండలాలకు చెందిన పలువురు తెదేపా నాయకులు రాజేంద్రప్రసాద్‌తో భేటీ అయ్యారు. తెనాలిలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ‘పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేనకు కేటాయిస్తే తెదేపాకు నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు.
టీడీపీ-జనసేన పొత్తును స్వాగతిస్తున్నా అది టీడీపీకే దక్కాలని ఆలపాటి వర్గం డిమాండ్ చేస్తోంది. నాదెండ్లకు ఇవ్వాల్సి వస్తే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఆలపాటి చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు జనసేనలో నంబర్ 2 స్థానంలో ఉన్న నాదెండ్లకు తెనాలి స్థానం కోసం ఖచ్చితంగా పవన్ పట్టుబట్టే అవకాశం ఉంది.
ఆలపాటి రాజా మాత్రం పార్టీకి నష్టం కలిగించే పనులు చేయొద్దని బుజ్జగిస్తున్నారు. అధిష్ఠానం నిర్ణయం తీసుకునే వరకు వేచి ఉండాలని సర్ది చెబుతున్నారు. మరోవైపు జనసేన నాయకులు మాత్రం నాదెండ్లకు సీటు గ్యారంటీ అని చెబుతున్నారు.
టాపిక్