Ayalaan: 4 రోజుల్లో 50 కోట్లు కలెక్ట్ చేసిన ఆయలాన్.. తెలుగులోనూ రిలీజ్.. రకుల్‌ హిట్ కొడుతుందా?

Best Web Hosting Provider In India 2024

Rakul Preet Ayalaan Telugu Version Release: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్’. ఇందులో టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా చేసింది. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కెజెఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె. రాజేష్ నిర్మించారు. దీనికి ఆస్కార్ పురస్కార గ్రహీత, లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. అయలాన్ ఈ నెల 12న సంక్రాంతి కానుకగా తమిళనాడులో విడుదలైంది.

 

ట్రెండింగ్ వార్తలు

అయలాన్ అంటే ఏలియన్ అని అర్థం. ఏలియన్ ఓ ప్రధాన పాత్రలో దక్షిణాది భాషల్లో సినిమా రావడం ఇదే తొలిసారి. సంక్రాంతికి విడుదలైన అయలాన్ సినిమా కేవలం నాలుగు రోజుల్లో రూ .50 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ వారంలో వంద కోట్ల మార్క్ చేరువ కానుంది. శివ కార్తికేయన్ నటనతో పాటు కామెడీ, సినిమా కాన్సెప్ట్ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సైన్స్ ఫిక్షన్ యూనివర్స్ కాన్సెప్ట్ కావడంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు కూడా సినిమాలో పుష్కలంగా ఉన్నాయని టాక్ వస్తోంది.

అయలాన్ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు దాని తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు. అయితే, సంక్రాంతికి తెలుగులో కూడా విడుదల చేద్దామనుకున్నారు. కానీ, ఇక్కడే ముగ్గురు స్టార్ హీరోలు, ఒక యంగ్ హీరో పోటీ పడుతుంటడంతో అయలాన్‌తో పాటు ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ వెనక్కి వెళ్లిపోయాయి. ఇప్పుడు ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాను జనవరి 25న తెలుగులో విడుదల చేస్తుండగా.. శివ కార్తికేయన్ అయలాన్ సినిమా తెలుగు వెర్షన్‌ను జనవరి 26న రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న తెలుగులో అయలాన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెలియజేసింది. తెలుగులో సూపర్ హిట్ అందుకున్న ‘వరుణ్ డాక్టర్’ సినిమా తర్వాత శివ కార్తికేయన్, కెజెఆర్ స్టూడియోస్, గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. అయితే, ఇప్పటికే అయలాన్ తమిళనాడులో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

 

ఇదిలా ఉంటే గత కొంతకాలంగా తెలుగులో సినిమాలు చేయని రకుల్ ప్రీత్ సింగ్ తమిళ మూవీ అయలాన్ తెలుగు వెర్షన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈసారైన రకుల్ తెలుగులో హిట్ కొడుతుందో చూడాలి. తమిళంలో హిట్ అయిన సినిమాలన్నీ తెలుగులో విజయం సాధించాలని లేదని పాత రికార్డులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రకుల్ అయలాన్ మూవీతో తెలుగు రాష్ట్రాల్లో హిట్ కొడుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే, తెలుగు రాష్ట్రాల్లోనూ శివ కార్తికేయన్, ధనుష్ పోటీ పడనున్నారని తెలుస్తోంది. వీరి ఇద్దరి సినిమాలు ఒక రోజు గ్యాపుతో తెలుగు బాక్సాఫీస్ వద్ద దండెత్తడానికి వస్తున్నాయి. వీటిలో ఏ చిత్రం సక్సెస్ సాధిస్తుందో చూడాలి. ఇక అయలాన్ మూవీలో శివ కార్తికేయన్‌, రకుల్ ప్రీత్ సింగ్‌తోపాటు ఇషా కొప్పికర్, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఫేమ్ శరద్ కేల్కర్, సీనియర్ హీరోయిన్ భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్, బాల శరవణన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024