
Best Web Hosting Provider In India 2024

Mohanlal Malaikottai Vaaliban Trailer: మలయాళం ఇండస్ట్రీలో వరుస హిట్స్ కొడుతున్న మోహన్ లాల్ ఇప్పుడో పవర్ ఫుల్ రెజ్లర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మలైకొట్టాయ్ వాలిబన్ మూవీ ట్రైలర్ గురువారం (జనవరి 18) రిలీజైంది. లిజో జోస్ పెల్లిస్సెరీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మోహన్ లాల్ లుక్ లీక్ కాకుండా మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు
గత నెలలో ఈ మూవీ టీజర్ రిలీజవడంతో ఇందులో ఓ ఓటమెరుగని రెజ్లర్ గా మోహన్ లాల్ కనిపించబోతున్నట్లు తేలింది. ఇక తాజాగా మలైకొట్టాయ్ వాలిబన్ మూవీ ట్రైలర్ కూడా వచ్చేసింది. బ్రిటీష్ వారి నుంచి స్వాతంత్ర్యం కోసం ఓ ప్రాంతం చేస్తున్న పోరాటాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
మోహన్ లాల్.. ఈ వయసులోనూ..
మలయాళంలో మోహన్ లాల్ ఓ పెద్ద స్టార్. నాలుగు దశాబ్దాలకుపైగా అలరిస్తున్న ఈ స్టార్ హీరో వయసు 63 ఏళ్లు. ఇప్పుడీ వయసులో అతడు ఓ పవర్ ఫుల్ రెజ్లర్ పాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ మూవీ కోసం అతని మేకోవర్ కూడా అద్భుతమనే చెప్పాలి. మలైకొట్టాయ్ వాలిబన్ ట్రైలర్ చూస్తేనే మూవీలో మోహన్ లాల్ ఎంత శక్తివంతంగా కనిపించబోతున్నాడో అర్థమవుతుంది.
“విజయాన్ని మించిన ఆనందం మరొకటి లేదు. నేను ఆ ఆనందంలో మునిగిపోయాను. కానీ అందులోనే నమ్మకద్రోహం ఉందని తెలుసుకోలేకపోయాను. నిన్ను నువ్వు మైమరచిపోయినప్పుడు ద్రోహానికి గురి కావడం సహజమే. ఇప్పుడు మంగోడు బరిలో మోసం తప్ప క్రీడాస్ఫూర్తి లేదు. అక్కడంతా రక్తం, కన్నీళ్లే. ఆ కన్నీళ్ల నుంచే సముద్రం పుట్టుకొస్తుంది. ఆ సముద్రం లోతుల్లో నుంచే మండే సూర్యుడు ఉద్బవిస్తాడు” అనే పవర్ ఫుల్ డైలాగులతో ఈ ట్రైలర్ మొదలవుతుంది.
ఆ తర్వాత సీన్ లోకి మోహన్ లాల్ ఎంట్రీ ఇస్తాడు. అతని ఇంటెన్స్ లుక్ మూవీపై అంచనాలు పెంచేస్తోంది. ఈ సినిమా గురువారమే (జనవరి 18) సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ మూవీకి యూఏ సర్టిఫికెట్ లభించగా.. మూవీ రన్ టైమ్ 155 నిమిషాలు (2 గంటల 35 నిమిషాలు)గా ఉంది. థియేటర్లోకి వచ్చే ఫ్యాన్స్ అసలు నిరాశ చెందరని మోహన్ లాల్ అన్నాడు.
“ఈ జానర్ లో ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాలో ఎవరూ మూవీ తీయలేదు. మలైకొట్టాయ్ వాలిబన్ మూవీని భారీస్థాయిలో నిర్మించాం. థియేటర్లోకి ఓపెన్ మైండ్ తో వచ్చే ప్రేక్షకులు నిరాశ చెందరు” అని మోహన్ లాల్ అన్నాడు. జనవరి 25న ఈ సినిమా రిలీజ్ కానుంది.
మరోవైపు మోహన్ లాల్ ఈ మధ్యే నేరు మూవీలోనూ నటించిన విషయం తెలిసిందే. ఈ కోర్టు రూమ్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అయింది. రూ.86 కోట్లు వసూలు చేసిన నేరు.. జనవరి 23న ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమాలో ప్రియమణి కూడా నటించింది. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మలయాళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.