Rohith Vemula Case : రోహిత్ వేముల దళితుడు కాదు..! హైకోర్టులో కేసు క్లోజ్ రిపోర్ట్ దాఖలు

Best Web Hosting Provider In India 2024

Rohith Vemula Case Updates :  హెచ్‌సీయూ పీహెచ్‌డీ స్కాలర్‌ రోహిత్‌ వేముల (Rohith Vemula)ఆత్మహత్య కేసును మూసివేస్తున్నట్లు తెలంగాణ పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు హైకోర్టులో మార్చి 21వ తేదీన క్లోజర్ రిపోర్ట్ ను సమర్పించారు. ఈ నివేదికలో పలు కీలక అంశాలను పోలీసులు ప్రస్తావించారు.

2016 జనవరిలో రోహిత్ వేముల(Rohith Vemula Case) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల తర్వాత…. అప్పటి సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, శాసనమండలి సభ్యుడు ఎన్ రామచందర్ రావు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావులకు క్లీన్ చిట్ ఇస్తూ తెలంగాణ పోలీసులు కేసు క్లోజర్ రిపోర్టు దాఖలు చేశారు. 

రోహిత్ వేముల షెడ్యూల్డ్ కులానికి చెందినవాడు కాదని పోలీసులు రిపోర్టులో ప్రస్తావించారు. తన అసలు కులం బయటపడుతుందనే భయంతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని  ముగింపు నివేదికలో తెలిపారు. రోహిత్ వేముల తల్లి రాధికను డీఎన్ఏ టెస్ట్ కు సిద్ధంగా ఉన్నారా అని అడగగా.. మౌనంగా ఉండిపోయారని రిపోర్టులో ప్రస్తావించారు.

హెచ్ సీయూలో విద్యార్థుల ఆందోళన…..

క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేయటంతో హెచ్ సీయూ(HCU) విద్యార్థులు ఆందోళనకు దిగారు. శుక్రవారం పలు విద్యార్థి సంఘాలు… ధర్నా చేపట్టారు.  పోలీసుల విచారణ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు వీసీ అప్పారావుతో పాటు మరికొందరు బీజేపీ నేతల తీరే కారణమని ఆరోపించారు. కేవలం రోహిత్ కులంపై మాత్రమే విచారణ జరిపిన పోలీసులు… కేసులో నిందితులుగా ఉన్నవారి పాత్రపై విచారణ జరిపించలేదని ఆరోపించారు.

రోహిత్ వేముల(Rohith Vemula Case) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పీహెచ్‌డీ స్కాలర్‌గా ఉన్నారు, అతను జనవరి 17, 2016న వర్శిటీ హాస్టల్ లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ లెటర్ కూడా వెలుగులోకి వచ్చింది. 

తన పుట్టుకే ఘోరమైన ప్రమాదంగా పేర్కొంటూ రోహిత్ వేముల సూసైడ్ లెటర్ రాశాడు. “ఇలాంటి ఉత్తరం మొదటిసారి వ్రాస్తున్నాను.  నా పుట్టుక ఘోరమైన ప్రమాదం. నా చిన్ననాటి ఒంటరితనం నుంచి నేను ఎప్పటికీ కోలుకోలేను. నా గతం…ఈ ఉత్తరం చదువుతున్న మీరు నా కోసం ఏదైనా చేయగలిగితే నాకు 7 నెలల ఫెలోషిప్ రావాలి. దయచేసి నా కుటుంబానికి వచ్చేలా చూడండి. రామ్‌జీకి నేను ఇవ్వాల్సిన 40 వేలు తిరిగి ఇవ్వండి. దయచేసి అతనికి చెల్లించండి” అని సూసైడ్ లో లేఖలో పేర్కొన్నాడు.

కేసులో దత్తాత్రేయ పేరు….

2015లో హెచ్‌సీయూలో ఏబీవీపీ, పలు దళిత సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. అయితే వర్సిటీ జాతి వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందంటూ నాటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ(bandaru dattatreya) మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. 

ఇదే ఏడాది నవంబరులో సెంట్రల్ వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సిఫారసుతో.. ఐదుగురు విద్యార్థులపై వీసీ అప్పారావు బహిష్కరణ వేటు వేశారు.  ఇంతలోనే 2016 జనవరి 17న రోహిత్‌ వేముల తన హాస్టల్‌ రూమ్‌లోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని  సూసైడ్ చేసుకున్నాడు.

రోహిత్ వేముల సూసైడ్ అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వర్శిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో వీసీతో పాటు దత్తాత్రేయపై(bandaru dattatreya) గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. రోహిత్ వేముల సూసైడ్ తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడిన స్మృతి ఇరానీ…. రోహిత్ వేముల దళితుడు కాదని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ కూడా అప్పట్లో  చర్చనీయాంశంగా మారాయి.

కేసు రీఓపెన్….!

మరోవైపు తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోహిత్ కేసును రీఓపెన్ చేయాలని డీజీపీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు కేసును పునర్విచారణ చేయాలని సైబరాబాద్ సీపీకి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. 
ఈ నేపథ్యంలో కేసు పునర్విచారణకు అనుమతి ఇవ్వాలని పోలీసులు…. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది.

 

 

IPL_Entry_Point

టాపిక్

Telangana NewsTrending TelanganaHyderabadTs Police
Source / Credits

Best Web Hosting Provider In India 2024