Kids Health: మీ పిల్లలకు రోజుకు ఎంత తీపిని తినిపిస్తున్నారు? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే వారికి భవిష్యత్తులో కష్టమే

Best Web Hosting Provider In India 2024

చక్కెర రెండు రకాలు. పండ్లు, కూరగాయల్లో సహజంగానే కొంత చక్కెర ఉంటుంది. అలాగే మనం స్వీట్లు తినడం ద్వారా కొంత చక్కెరను ఆహారంగా తింటాం. సహజ చక్కెర తినడం వల్ల ఆరోగ్యానికే మేలు జరుగుతుంది. కానీ పంచదారతో చేసిన ఆహారాలను అధికంగా తినడం వల్ల ఆ పంచదార శరీరంలో అధికంగా చేరితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పిల్లలకు అధికంగా చక్కెర ఆహారాలు ఇష్టం. కానీ ఇలా బాల్యంలో అధికంగా పంచదారతో చేసిన ఆహారాలను పెట్టడం వల్ల వారికి భవిష్యత్తులో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

హెచ్ టీ లైఫ్ స్టైల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, న్యూ ఢిల్లీలోని పంజాబీ బాగ్లోని క్లౌడ్నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్, పీడియాట్రిషియన్ డాక్టర్ అభిషేక్ చోప్రా ఇలా సమాధానమిచ్చారు, “చక్కెర అధిక వినియోగం వల్ల ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులు, టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పండ్ల రసంలో చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక విరేచనాలు, గ్యాస్ట్రిక్, కడుపుబ్బరం వంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే అసిడిటీ, దంత క్షయం వంటివి వచ్చే ప్రమాదం కూడా ఉంది. పిల్లలు చక్కెర వేసిన తీపి పానీయాలను ఎంత తగ్గిస్తే అంత మంచిది. పండ్ల రసాలను పంచదార కలపకుండా ఇవ్వడమే మంచిది.

పిల్లలకు పంచదారతో చేసిన తీపి పదార్థాలను ఎంత తక్కువగా తినిపిస్తే అంత మంచిది. పండ్లు, కూరగాయల్లో ఉన్న చక్కెరతో పాటూ, ఇతర ఆహారపదార్థాల వల్ల తిన్న చక్కెర కూడా చేరి పిల్లల్లో చాలా మార్పులు కలుగుతాయి. ఇది వారిలో చిన్న వయసులోనే బరువు పెరగడం, ఊబకాయం, దంత క్షయం వంటతి ప్రతికూల ఆరోగ్య ప్రభావాలతో ముడిపడి ఉంటుంది. యూరోపియన్ న్యూట్రిషన్ కమిటీ రెండేళ్ల వయసు నుంచి 18 సంవత్సరాల వయసు మధ్య ఉన్న పిల్లలకు పంచదారను ఎంత తక్కువగా పెడితే అంత మంచిదని చెబుతున్నారు. 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పసిబిడ్డలలో పంచదార పూర్తిగా పెట్టకపోవడమే మంచిది. 2 నుండి 7 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు పంచదార తక్కువగా తినిపించాలి. రోజుకు 15 గ్రాముల నుండి 20 గ్రాముల వరకు ఉండవచ్చు. 7 నుండి 13 సంవత్సరాల వయస్సు ఉన్నవారు 22 నుండి 27 గ్రాములకు మించకుండా పంచదార తినాలి. 13 ఏళ్ల నుంచి19 సంవత్సరాల వయస్సు ఉన్నవారు 27 నుండి 37 గ్రాముల వరకు పంచదారను తినవచ్చు. అంతకుమించి తినకపోవడమే మంచిది.

చక్కెరను ఏ రూపంలో తినిపించాలి?

సాధ్యమైనంత వరకు సహజ చక్కెరను తీసుకుంటేనే మంచిది. అంటే పాలు, పాల ఉత్పత్తుల్లో ఉన్న చక్కెరే పిల్లలకు సరిపోతుంది. అలాగే తాజా పండ్లు, స్మూతీలు, తియ్యటి పాల ఉత్పత్తుల్లో కూడా చక్కెర ఉంటుంది. శిశువులకు చక్కెర కలిపిన పానీయాలు పాలడబ్బాల్లో వేసి ఇవ్వకూడదని వైద్యులు చెబుతున్నారు. తీపి పదార్థాలను పిల్లలకు ఎక్కువగా అలవాటు చేస్తే అనేక రకాల సమస్యలు వస్తాయి.

1. దంత సమస్యలు: ముఖ్యంగా చక్కెర పానీయాలు, క్యాండీల రూపంలో అధిక చక్కెర వినియోగం వల్ల దంత క్షయం వస్తుంది. నోటిలోని బ్యాక్టీరియా చక్కెరను ఆహారంగా తీసుకుంటుంది. దంతాల ఎనామెల్‌ను నాశనం చేసే ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది.

2. స్థూలకాయం: అధిక చక్కెర తీసుకోవడం పిల్లలలో బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. చక్కెర నిండిన ఆహారాలు, పానీయాలు తాగడం వల్ల కేలరీలు అధికంగా పెరుగుతాయి. వీటిలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి.

3. టైప్ 2 డయాబెటిస్ రిస్క్: తరచూ పెద్ద మొత్తంలో చక్కెర తీసుకోవడం ఇన్సులిన్ నిరోధకతకు కారణం అవుతుంది. టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

4. పోషక లోపాలు: అధిక చక్కెర ఆహారాలు పిల్లల ఆహారంలోని పోషకాలను తగ్గిస్తాయి. పిల్లలు చక్కెర ఉన్న స్నాక్స్, పానీయాలు తింటే వారి పెరుగుదలలో లోపం ఏర్పడుతుంది. వారికి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి.

5. ప్రవర్తనా సమస్యలు: కొన్ని అధ్యయనాల ప్రకారం అధిక చక్కెర తీసుకోవడం వల్ల పిల్లలలో హైపర్ యాక్టివిటీ సమస్యలు వస్తాయి. ఏ విషయం మీద శ్రద్ధ పెట్టలేరు.

6. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం: బాల్యంలో అధిక చక్కెర వినియోగం వల్ల భవిష్యత్తులో గుండె జబ్బులు, జీవక్రియ రుగ్మతలు వంటి దీర్ఘకాలిక వ్యాధులను అభివృద్ధి చేసే ప్రమాదం ఉంది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి

  • పంచదార నిండిన స్నాక్స్ కు బదులుగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు నిండిన ఆహారాన్ని పిల్లలకు అందించాలి.
  • నీరు లేదా పాలను ప్రాధమిక పానీయాలుగా ఎంచుకోవాలి. చక్కెర పానీయాలను పరిమితం చేయాలి.
  • ఆహార లేబుళ్ళను చదవండి. అధిక చక్కెర కంటెంట్ ఉన్న ఆహారాన్ని నివారించండి.
WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024