CM Revanth Reddy : డీఎస్సీ వాయిదా డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల కుట్ర- సీఎం రేవంత్ రెడ్డి

Best Web Hosting Provider In India 2024

CM Revanth Reddy : తెలంగాణలో డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తు్న్నారు. డీఎస్సీ మరో మూడు నెలలు వాయిదా వేయాలని ఉస్మానియా వర్సిటీలో ఆందోళన చేస్తున్నారు. డీఎస్సీ వాయిదా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల కుట్ర కూడా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు డీఎస్సీ వాయిదా వేయాలని తనను అడిగారన్నారు. వ్యాపారం కోసం కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ తన రాజకీయ మనుగడ కోసం నిరుద్యోగులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారన్నారు.

కేటీఆర్, హరీశ్ రావు దీక్ష చేస్తే రక్షణ కల్పిస్తాం

మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి… జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. టీజీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారన్నారు. ఈ డిమాండ్‌ వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతిస్తే కోర్టుకు వెళ్తారని, నోటిఫికేషన్‌లో లేకుండా 1:100 నిష్పత్తిలో ఎలా పిలుస్తారని కోర్టు మళ్లీ గ్రూప్-1 రద్దు చేస్తుందన్నారు. గ్రూప్స్ పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్షం కుట్ర చేస్తుందన్నారు. అలాగే పలు పరీక్షలు వాయిదా వేయాలనే డిమాండ్‌ వెనుక కోచింగ్‌ సెంటర్ల కుట్ర కూడా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేద విద్యార్థులు, పేద నేతలు మాత్రమే ఎందుకు దీక్షల్లో పాల్గొంటున్నారు, కేటీఆర్‌, హరీశ్‌రావు ఎందుకు దీక్షలో కూర్చోవడం లేదని ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్ రావు ఆర్ట్స్‌ కాలేజీ ముందు దీక్ష చేస్తే రక్షణ కల్పిస్తామన్నారు. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి లాభమే కానీ తప్ప నష్టం ఉండదన్నారు. కేవలం నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పరీక్షలు వాయిదా వేయడం లేదన్నారు. నిరుద్యోగులతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శించారు. 11 వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చామన్నారు. చాలా ఏళ్లుగా జరగని డీఎస్సీని అడ్డుకోవాలని కొందరు కుట్రలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్లలను జిరాక్స్‌ సెంటర్లలో అమ్ముకున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

తన వరకూ వస్తే గానీ కేసీఆర్ కు బాధ తెలియలేదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారని కేసీఆర్‌ మాట్లాడుతున్నారని, తన వరకూ వస్తే గానీ కేసీఆర్ ఆ నొప్పి తెలియలేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో ఎంతో మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకున్నారో ప్రజలకు తెలియదనుకున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజులలోనే కూలిపోతుందని కేసీఆర్‌ అన్న మాటలు గుర్తులేదా? అని మండిపడ్డారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

డిసెంబర్ 2025 లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రాజెక్టు పనుల్లో పురోగతిని ప్రతి నెలా సమీక్ష నిర్వహించాలని చెప్పారు. నిర్దేశిత గడువులోగా కల్వకుర్తి పూర్తి చేసే ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయిలో యాక్షన్ ప్లాన్ తయారు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ పథకాల పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు. జిల్లాలో మొత్తంగా రూ. 396.09 కోట్లతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు వివిధ పనులకు శంకుస్థాపన చేశారు. ముందు కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌లను ప్రారంభించారు. అలాగే, పాలమూరు వర్సిటీలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాలికల హాస్టల్ నిర్మాణం, దేవరకద్రలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం, మహబూబ్‌నగర్‌ రూరల్‌, గండీడ్‌లో కేజీవీబీ భవనాల నిర్మాణం, మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులు, ఎస్టీపీ నిర్మాణం వంటి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

Telangana NewsTs Dsc JobsCm Revanth ReddyMahabubnagarTrending TelanganaJobsTeachers
Source / Credits

Best Web Hosting Provider In India 2024