
Best Web Hosting Provider In India 2024

ఒకప్పుడు నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి లాంటి బ్లాక్‍బస్టర్ సినిమాలను తెరకెక్కించారు డైరెక్టర్ విజయ్ భాస్కర్. క్లాసిక్‍లుగా నిలిచిన కామెడీ మూవీలను అందించారు. అయితే, జై చిరంజీవి తర్వాత ఆయనకు హిట్‍లు రాలేదు. క్లాస్‍మేట్స్, భలే దొంగలు సహా వరుసగా వైఫల్యాలు వచ్చాయి. 2013లో తెరకెక్కించిన మసాలా కూడా బోల్తా కొట్టింది. దీంతో గ్యాప్ వచ్చింది. అయితే, గతేడాది తన కుమారుడు శ్రీకమల్‍ను హీరోగా పరిచయం చేస్తూ డైరెక్టర్ విజయ్ భాస్కర్.. జిలేబీ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.
గతేడాది ఆగస్టు 18వ తేదీన జిలేబీ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయింది. రీ-ఎంట్రీ సినిమాతో డైరెక్టర్ విజయ్ భాస్కర్ తన వింటేజ్ మార్క్ చూపలేకపోయారు. అయితే, థియేటర్లలో రిలీజైన సుమారు 11 నెలల తర్వాత ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
జిలేబీ సినిమా ఈ వారంలోనే జూలై 13వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆహా నేడు అధికారికంగా వెల్లడించింది. “గిలిగింతల జిలేబీ. మన ఆహా తప్పకుండా చూడండి. జూలై 13న ఆహాలో జిలేబీ ప్రీమియర్” అని ఆహా నేడు ట్వీట్ చేసింది.
జిలేబీ సినిమాలో శ్రీకమల్ సరసన శివానీ రాజశేఖర్ హీరోయిన్‍గా నటించారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, బోడుపల్లి శ్రీను, సాయి కుమార్ బబ్లూ, వైవా కన్నీ, చమ్మక్ చంద్ర కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని గుంటూరు రామకృష్ణ, అంజు అస్రానీ నిర్మించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం ఇచ్చారు.
జిలేబీ చిత్రంతో సీనియర్ డైరెక్టర్ విజయ్ భాస్కర్‌కు నిరాశే ఎదురైంది. రీ-ఎంట్రీలో ఫ్లాఫ్ ఎదురైంది. కథ ఔట్‍డేడెట్‍గా ఉండడం, కథనం కూడా ఆసక్తికరంగా లేకపోవటంతో ఈ చిత్రం సక్సెస్ కాలేకపోయింది. ఒకప్పటి మ్యాజిక్‍ను విజయ్ భాస్కర్ రిపీట్ చేయలేకపోయారు.
స్టోరీ లైన్
బాయ్స్ హాస్టల్‍లోకి ఓ అమ్మాయి రహస్యంగా ప్రవేశించడం, తప్పించుకునేందుకు ప్రయత్నించడం చుట్టూ జిలేబీ సినిమా స్టోరీ తిరుగుతుంది. హాస్టల్ నుంచి బయటపడేందుకు హీరో కమల్ (శ్రీకమల్) హెల్ప్ తీసుకుంటుంది లక్ష్మి భారతి అలియాజ్ జిలేబీ (శివానీ రాజశేఖర్). ఈ క్రమంలో కొందరు స్నేహితులు, జిలేబీ తండ్రి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేదే ఈ మూవీ స్టోరీగా ఉంది. కథలో పెద్దగా మలుపులు లేకపోవడం, స్కీన్‍ప్లే కూడా ఫ్లాట్‍గా ఉండటంతో ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది.
ఆహాలో హరోం హర
సుధీర్ బాబు హీరోగా నటించిన హరోం హర సినిమా జూలై 11వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. జూన్ 14వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం నెలలోగానే ఓటీటీలో అడుగుపెడుతోంది. హరోం హర చిత్రానికి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. సుధీర్‌కు జోడీగా మాళవిక శర్మ ఈ చిత్రంలో నటించగా.. సునీల్ కూడా ఓ మెయిన్ రోల్ చేశారు. జయప్రకాశ్, రవి కాలే, అర్జున్ గౌడ కీరోల్స్ చేశారు.