CBN Arrest Issue: మూడున్నరేళ్ల క్రితమే చంద్రబాబు అరెస్ట్‌కు ప్రణాళికలు.. సహకరించని అధికారులపై వేధింపులు

Best Web Hosting Provider In India 2024

CBN Arrest Issue: ఆంధ్రప్రదేశ్‌ కక్ష సాధింపు రాజకీయాల్లో రోజుకో కొత్త సంగతి వెలుగు చూస్తోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, సీమెన్స్ ఒప్పందంలో ఖజానాకు గండిపడిందనే ఆరోపణలతో గత ఏడాది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి అరెస్ట్‌ చేసింది. దాదాపు 53రోజులు పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాల్సి వచ్చింది. ఒకదాని తర్వాత మరో కేసు పెట్టి చంద్రబాబును వీలైనంత కాలం జైల్లోనే ఉంచే ప్రయత్నాలు జరిగాయి. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత చంద్రబాబు ఈ కేసుల్లో బెయిల్‌పై విడుదలయ్యారు.

చంద్రబాబును జైలుకు పంపేందుకు వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల నుంచి ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగిన రాముడి విగ్రహ ధ్వంసం కేసులో చంద్రబాబు నాయుడును నిందితుడి చేర్చేందకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి.

2020 డిసెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన రామతీర్థం విగ్రహధ్వంసం కేసు దర్యాప్తును సీఐడీ చేపట్టింది. 2020 డిసెంబర్ 29వ తేదీన విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారాన్ని సృష్టించింది. హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. రాజకీయంగా వైసీపీ కూడా ఇరకాటంలో పడింది.

రామతీర్థం ఘటనలో నిందితులు ఎవరో గుర్తించలేకపోవడంతో ఏపీ ప్రభుత్వం సీఐడీ దర్యాప్తుకు ఆదేశించింది. అప్పట్లో సిఐడి బృందం కూడా ఘటనా స్థలంలో పర్యటించి దర్యాప్తు జరిపింది.

విగ్రహం తలను రంపంతో కోసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఘటనాస్థలిలో ఓ రంపాన్ని కూడా సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి అనేక ఆధారాలు పోలీసులు సేకరించినా తర్వాత కేసు పురోగతి మాత్రం బయటకు రాలేదు.

రామతీర్థంలో దుండగులు విగ్రహాన్ని మాత్రమే ధ్వంసం చేశారని, గుడిలోని ఆభరణాలు, వస్తువులేవీ చోరీకి గురి కాలేదని అప్పట్లో పోలీసులు ప్రకటించారు. దేవాలయం గురించి బాగా తెలిసిన వ్యక్తులే ద్వంసం చేసి ఉంటారని అనుమానించారు.

విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. డిసెంబర్ 29, 2020న,తలలేని స్థితిలో రాముడి విగ్రహాన్ని గుర్తించారు. రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది.

చంద్రబాబును అరెస్ట్ చేయాలని ఒత్తిళ్లు…

రామతీర్థం విగ్రహ ధ్వంసం ఘటనపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. వైసీపీ ప్రభుత్వంలో హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యవహారంలో చంద్రబాబును అరెస్ట్‌ చేసేందుకు నాటి ప్రభుత్వం సిద్ధమైంది.

ఈ కేసులో అప్పటి విజయనగరం పోలీసులు చేసిన దర్యాప్తులో కొందరు అనుమానితుల్ని గుర్తించారు. అదే సమయంలో ఉత్తరాంధ్రలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ ముఖ్య నాయకుడు ఒకరు చంద్రబాబును అరెస్ట్‌ చేయాల్సిందిగా పోలీసులపై ఒత్తిడి చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రామతీర్థం వ్యవహారంలో ప్రభుత్వం ఒత్తిడి నుంచి బయటపడాలంటే చంద్రబాబును అరెస్ట్‌ చేయడమే మార్గమని సదరు నాయకుడి భావించి పోలీసులపై తీవ్రంగా ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది.

రామతీర్థం విగ్రహ ధ్వంసంలో కుట్రదారుడిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేరును చేర్చాలని సదరు నాయకుడు తీవ్ర ప్రయత్నాలు చేశారు.ఈ వ్యవహారంలో చంద్రబాబు పాత్రపై పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు, అరెస్ట్‌లకు పోలీస్ ఉన్నతాధికారులు ఒప్పుకోలేదని సమాచారం.

చంద్రబాబు పేరును రామతీర్థం కేసులో ఎలాగైనా చేర్చాల్సిందేనని పట్టుబట్టడంతో పోలీస్ ఉన్నతాధికారులు అందుకు సమ్మతించక పోవడంతో కేసు దర్యాప్తును మరో బృందానికి అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఎలాగైనా చంద్రబాాబు పేరును చేర్చాలని కొందరు ప్రయత్నించినా అందుకు తగ్గ ఆధారాలు లేకపోవడంతో ముందుకు వెళ్లలేకపోయారు.

వైసీపీ ముఖ్య నాయకుడి చెప్పిన పని చేయని అధికారులకు ఆ తర్వాత కాలంలో వేధింపులు తప్పలేదు. ప్రాధాన్యత పోస్టింగ్‌లు బహుమతిగా దక్కినట్టు సమాచారం. చంద్రబాబును అరెస్ట్‌ చేయడానికి వీలైనన్ని మార్గాలను అన్వేషించి మాట వినే అధికారుల్ని ఏరికోరి ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

Ap PoliceAp PoliticsYsrcp Vs TdpYsrcpChandrababu Naidu
Source / Credits

Best Web Hosting Provider In India 2024