Best Web Hosting Provider In India 2024
Creamy Layer: షెడ్యూల్డ్ కులాల ఉప-వర్గీకరణను అనుమతిస్తూ సుప్రీం కోర్టు గురువారం ఇచ్చిన తీర్పులో, ఎస్సీ వర్గాలకు ఉద్దేశించిన రిజర్వేషన్ ప్రయోజనాల నుండి షెడ్యూల్డ్ కులాలలోని ‘క్రీమీ లేయర్’ వర్గాలని మినహాయించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు పేర్కొంది.
ప్రస్తుతం ‘క్రీమీ లేయర్’ అమలును ఓబీసీ వర్గాల రిజర్వేషన్లకు మాత్రమే వర్తింప చేస్తున్నారు. అర్హులకు మాత్రమే రిజర్వేషన్లు వర్తింప చేయాలనే డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది. పేదరికం, వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని పలు డిమాండ్ల నేపథ్యంలో క్రీమీ లేయర్ అంశం తెరపైకి వచ్చింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ బిఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, బేలా త్రివేది, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణను సమర్థిస్తూ తీర్పును వెలువరించింది. ధర్మాసనంలో ఆరుగురు న్యాయమూర్తులు ఉప వర్గీకరణను సమర్థించగా, జస్టిస్ త్రివేది విభేదించారు.
ఉప వర్గీకరణను సమర్థించిన ఆరుగురు న్యాయమూర్తులలో నలుగురు, ఎస్సీలకు క్రీమీలేయర్ మినహాయింపు తప్పనిసరిగా వర్తింపజేయాలని తమ తీర్పులలో స్పష్టంగా పేర్కొన్నారు.
జస్టిస్ BR గవాయి తన తీర్పులో, “రాష్ట్రం షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వర్గాల్లో క్రీమీ లేయర్‌ను గుర్తించి, వారిని నిశ్చయాత్మక చర్యల నుండి మినహాయించే విధానాన్ని రూపొందించాలన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచినట్లు నిజమైన సమానత్వాన్ని సాధించడానికి ఇదే ఏకైక మార్గమన్నారు.
రిజర్వేషన్ల ప్రయోజనం పొందిన ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి పిల్లలను రిజర్వేషన్ పొందని వ్యక్తి పిల్లలతో సమాన పీఠంపై ఉంచలేమని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. జస్టిస్ విక్రమ్ నాథ్ కూడా ఈ అభిప్రాయాన్ని ఆమోదించారు, ఓబీసీలకు వర్తించే క్రీమీలేయర్ సూత్రం ఎస్సీలకు కూడా వర్తిస్తుందని చెప్పారు.
మొదటి తరానికి మాత్రమే రిజర్వేషన్లు పరిమితం చేయాలని జస్టిస్ పంకజ్ మిథాల్ పేర్కొన్నారు. మొదటి తరంలో ఎవరైనా రిజర్వేషన్ ద్వారా ఉన్నత స్థితికి చేరుకున్నట్లయితే, 2వ తరం వారికి రిజర్వేషన్‌కు అర్హత ఉండదని జస్టిస్ మిథాల్ పేర్కొన్నారు.
జస్టిస్ సతీష్ చంద్ర శర్మ జస్టిస్ గవాయ్ అభిప్రాయంతో ఏకీభవించారు.క్రీమీలేయర్ గుర్తింపు అంశం రాష్ట్రానికి రాజ్యాంగపరమైన ఆవశ్యకతగా మారాలని అన్నారు. 2018లో, జర్నైల్ సింగ్ వర్సెస్ లచ్చి నారాయణ్ గుప్తాలో సుప్రీంకోర్టులోని 5 గురు న్యాయమూర్తుల బెంచ్, పదోన్నతులలో రిజర్వేషన్ల సందర్భంలో ఎస్సీ/ఎస్టీలకు క్రీమీలేయర్ మినహాయింపును వర్తింపజేయవచ్చని పేర్కొంది.
రిజర్వేషన్ మొత్తం లక్ష్యం ఏమిటంటే, వెనుకబడిన తరగతుల పౌరులు సమాన ప్రాతిపదికన ఇతర భారతదేశంలోని పౌరులతో చేతులు కలిపి ముందుకు సాగేలా చూడడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ తరగతిలోని క్రీమీలేయర్ మాత్రమే ప్రభుత్వ రంగంలోని ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాలన్నింటినీ మూటగట్టుకుని, తమను తాము శాశ్వతం చేసుకుంటే, మిగిలిన తరగతిని ఎప్పటిలాగే వెనుకబడి ఉంటే ఇది సాధ్యం కాదని అభిప్రాయపడింది.
టాపిక్