Best Web Hosting Provider In India 2024
సెల్ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ నోట్లో పెట్టుకుని షాక్ తో ఏడాదిన్నర బాలిక మృతి చెందింది. ఈ సంఘటన కడెం మండలం కొత్త మద్దిపడగలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… కొత్తమద్దిపడగ గ్రామానికి చెందిన దుర్గం సుశీల రాజలింగు దంపతులకు ఆరాధ్య ఇరువురు కుమార్తెలున్నారు. చిన్న కుమార్తె ఆరాధ్య (08) గురువారం రాత్రి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్న సమయంలో ఆడుకుంటూ వెళ్లి చార్జింగ్ కేబుల్ ని పట్టు కొని నోట్లో పెట్టుకుంది.
ఛార్జింగ్ కేబుల్ కి స్విచ్ వేసి ఉండడంతో ఒక్కసారిగా షాక్ కొట్టడంతో అక్కడికక్కడే పాప స్పృహ కోల్పోయింది. దీంతో వెంటనే చిన్నారి ఆరాధ్యను తల్లిదండ్రులు ఇద్దరు ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆరాధ్యను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో క్షణం క్రితం వరకు తమ కళ్ల ఎదుట సందడిగా కదలాడిన తమ బిడ్డ విగతజీవిగా మారి మృతి ఒడిలోకి వెళ్లడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఆసుపత్రిలో తమ కూతురిని చూసి వారు రోధించిన తీరు అక్కడున్న వారిని కలచి వేసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఛార్జింగ్ కేబుల్స్, సెల్ ఫోన్లు చిన్నారులకు వీలైనంత దూరంగా ఉంచాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ఆరాధ్య మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి.
టాపిక్