Best Web Hosting Provider In India 2024
Tharun Bhascker Casting Call: ఓ జంటకు విడాకులు ఇప్పించడానికి నటీనటులు కావాలట. అవును మీరు విన్నది నిజమే. ఓ డివోర్స్ నోటీస్ రూపంలో తరుణ్ భాస్కర్, వేణు ఉడుగుల మూవీ కోసం క్యాస్టింగ్ కాల్ ఉండటం విశేషం. ఈ ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్లు నిర్మిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు వంశీ రెడ్డి దొండపాటి డైరెక్ట్ చేస్తున్నాడు.
విడాకుల నోటీసు రూపంలో క్యాస్టింగ్ కాల్
తెలంగాణ నేపథ్యం, గ్రామీణ వాతావరణంలో వస్తున్న సినిమాల సంఖ్య ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. అలాంటిదే ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. దర్శకులు తరుణ్ భాస్కర్, వేణు ఉడుగుల కాంబో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను ఓ విడాకుల నోటీసులో అనౌన్స్ చేస్తూ.. ఇందులో నటించేందుకు యువ నటీనటులు కావాలని మేకర్స్ పిలుపునివ్వడం విశేషం.
ఇడుపు కాయితం అంటూ పక్కా తెలంగాణ యాసలో డివోర్స్ నోటీస్ పై ఈ క్యాస్టింగ్ కాల్ ఉంది. శుక్రవారం (ఆగస్ట్ 2) మేకర్స్ సోషల్ మీడియా ద్వారా దీనిని అనౌన్స్ చేశారు. డైరెక్టర్ వేణు ఉడుగుల తన ఇన్‌స్టాగ్రామ్ లో దీనిని షేర్ చేశాడు. “క్యాస్టింగ్ కాల్ అలెర్ట్. యారో సినిమాస్, డీఎస్ఎఫ్ తమ ప్రొడక్షన్ నంబర్ 2 కోసం 20 నుంచి 60 ఏళ్ల వయసు మధ్య ఉన్న నటీనటుల కోసం చూస్తోంది.
ఇదొక రూరల్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ. తరుణ్ భాస్కర్ ఇందులో నటిస్తున్నాడు. ఈ సినిమాను బూసం జగన్మోహన్ రెడ్డి, వేణు ఉడుగుల నిర్మిస్తున్నారు. వంశీ రెడ్డి కథ అందించి దర్శకత్వం చేస్తున్నారు. మీ ప్రొఫైల్స్ ను 9032765555కు వాట్సాప్ చేయండి. అక్టోబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది” అనే క్యాప్షన్ తో షేర్ చేశాడు.
ఇడుపు కాయితం ఇలా..
ఇడుపు కాయితం పేరుతో రూ.50 స్టాంప్ పేపర్ మీద ఈ క్యాస్టింగ్ కాల్ అనౌన్స్‌మెంట్ చేశారు. అందులో ఏముందంటే.. “తేదీ 12-12-2024 బేస్తారం రోజున ఇల్లంతకుంట శ్రీసీతారామచంద్ర స్వామి గుడెనుక సమ్మక్క సారలమ్మ గద్దెలకాడ, మర్రిశెట్టు కింద జమ్మికుంట వాస్తవ్యులైన బూర సమ్మయ్య గౌడ్ బిడ్డ శ్రీలతకు పోత్కపల్లి గ్రామ వాస్తవ్యులైన గోడిశాల పోశాలు కొడుకు శ్రీనివాస్ గౌడ్ కు ఇడుపు కాయితం పంచాయితీ జరుగుతాంది. ఆ పంచాయితీ పెద్దలుగా, సాక్షులుగా కుటుంబ సభ్యులుగా నటించడానికి నటీనటులు కావాలె.. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు సంప్రదించండి” అని ఉండటం విశేషం.
ఈ క్యాస్టింగ్ కాల్, మూవీ అనౌన్స్‌మెంట్ తోనే సినిమాపై మేకర్స్ ఆసక్తి పెంచారు. ఇదొక రూరల్ రొమాంటిక్ కామెడీ డ్రామా అని చెప్పడంతో టాలెంటెడ్ దర్శకుడు, నటుడు తరున్ భాస్కర్ నుంచి మరో వెరైటీ పాత్రను ఆశించవచ్చు. ఈ సినిమాకు నిర్మాతగా ఉన్న వేణు ఉడుగుల గతంలో విరాట పర్వం మూవీతో సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఇక తరుణ్ భాస్కర్ అయితే పెళ్లిచూపులు మూవీతో దర్శకుడిగా పరిచయమై.. తర్వాత ఈ నగరానికి ఏమైంది, కీడాకోలాలాంటి సినిమాలతో సక్సెసయ్యాడు. నటుడిగా ఇప్పటికే పదికిపైగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో అతడు నటించాడు.