Best Web Hosting Provider In India 2024
Cancer Symptoms: మన దేశంలో అత్యధిక శాతం మంది గుండె జబ్బుల వల్ల మరణిస్తున్నారు. గుండె జబ్బుల తర్వాత స్థానం క్యాన్సర్‌ది. క్యాన్సర్‌లో అనేక రకాలు ఉన్నాయి. మన శరీరంలో ఏ అవయవానికైనా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మనదేశంలో ప్రతి ఏటా పదకొండు లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. వారిలో ఎంతోమంది మరణిస్తున్నారు.
ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పొట్ట క్యాన్సర్, నోటి క్యాన్సర్ బారిన పడుతున్న వారే అధికంగా ఉన్నారు. చాలామందికి వ్యాధి ముదిరిపోయిన తర్వాతే నిర్ధారణ అవుతుంది. దీనివల్ల వారు జీవించే అవకాశాలను కోల్పోతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ క్యాన్సర్ లక్షణాలను తెలుసుకోవాలి. కొన్ని ఊహించని క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ వల్ల వస్తున్నాయని కూడా చాలామందికి తెలియదు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన క్యాన్సర్ లక్షణాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోండి.
గొంతు బొంగురు పోవడం
దగ్గు రావడం తగ్గినా తర్వాత కొన్ని రోజులకు గొంతు బొంగురు పోవడం కొందరిలో కనిపిస్తుంది. అయితే ఇది జలుబు లేదా అలెర్జీల వల్ల జరుగుతుంది అనుకుంటారు. దీర్ఘకాలికంగా దగ్గు వేధిస్తున్నప్పుడు మీ గొంతులో మార్పు వచ్చినప్పుడు కచ్చితంగా ఊపిరితిత్తులు లేదా గొంతు క్యాన్సర్ పరీక్షను చేయించుకోవాలి. ధూమపానం చేసేవారిలో నిరంతర దగ్గు వచ్చి ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ రావచ్చు. కాబట్టి మిమ్మల్ని దీర్ఘకాలంగా దగ్గు వేధిస్తూ గొంతు బొంగురు పోయినట్టు అయితే వెంటనే పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
మింగలేకపోవడం
ఆహారం మింగుతున్నప్పుడు గొంతులో ఏదో అడ్డుకున్నట్టు అనిపిస్తుంది. కానీ చాలామంది దీన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఆ సమయంలో నీళ్లు తాగి ఆహారాన్ని గొంతులో నుంచి లోపలికి పంపించేస్తారు. నిజానికి మింగడంలో ఇబ్బంది ఎదురైతే అది అన్నవాహిక లేదా గొంతు, పొట్ట క్యాన్సర్లకు సంకేతం. దీని లాన్సెట్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం గొంతులో మింగడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్న వ్యక్తులకు అధికంగా అన్నవాహిక క్యాన్సర్ వస్తున్నట్టు గుర్తించారు.
రాత్రి చెమటలు పట్టడం
కొంతమందికి రాత్రిపూట చెమటలు అధికంగా పడతాయి. దీనికి కారణం ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా జ్వరం అనుకుంటారు. అదే మహిళల్లో అయితే మెనోపాజ్ వల్ల లేదా నెలసరి వల్ల పడుతున్నాయని అనుకుంటారు. ఇలా రాత్రిపూట చెమటలు పట్టడం అనేది లింఫోమా క్యాన్సర్ లేదా లుకేమియా తో బాధపడుతున్న వారిలో కనిపించే సంకేతం. రాత్రిపూట చెమటలు పట్టడం, హఠాత్తుగా బరువు తగ్గడం, జ్వరం రావడం ఇవన్నీ కూడా క్యాన్సర్‌కు సంకేతాలే.
గుండెల్లో మంట
గుండెల్లో మంటగా అనిపిస్తున్నప్పుడు లేదా ఛాతీలో మంటగా అనిపిస్తున్నప్పుడు యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల జరుగుతుందని అనుకుంటారు. కొన్నిసార్లు ఇది పొట్ట లేదా అన్నవాహిక క్యాన్సర్ లక్షణం కావచ్చు. దీర్ఘకాలికంగా మీరు ఇలా యాసిడ్ రిఫ్లెక్స్ తో బాధపడితే వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
చర్మం కింద గడ్డలు
చర్మం కింద చిన్న చిన్న గడ్డలు లేదా తిత్తుల్లాంటివి ఏర్పడితే వాటిని తేలికగా తీసుకోకండి. అవి కాలక్రమణా పెరుగుతూ ఉంటాయి. నొప్పి కూడా ఉండవు. ఆ గడ్డలు క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది. అలా శరీరంలో గడ్డలు హఠాత్తుగా వస్తే ఒకసారి వైద్యులను కలవడం మంచిది.
నొప్పి
కారణం లేకుండా శరీరంలోని కొన్ని భాగాల్లో నొప్పిగా అనిపిస్తుంది. ఉదాహరణకు ఎముక నొప్పిగా అనిపిస్తే అది ఎముక క్యాన్సర్ ప్రారంభం లక్షణం కావచ్చు. కాబట్టి ఎలాంటి దెబ్బ తాకకుండా శరీరంలో ఏదైనా ప్రదేశంలో నొప్పి వస్తూ ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి.
నోటిలో పుండ్లు
కొందరికి నోట్లో పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి. ఆ పుండ్లు మందులు వాడినా తగ్గకపోతే అది నోటి క్యాన్సర్‌కు కారణం కావచ్చు. నోటిలో తెలుపు లేదా ఎరుపు రంగులో పుండ్లు వస్తే వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేసుకోవాలి. నోటిలో పుండ్లు వచ్చినప్పుడు ఎంతకి మానకపోతే అది నోటి క్యాన్సర్ సంకేతం కావచ్చు.
దురద
చర్మం పై అప్పుడప్పుడు దురద వేస్తుంది. అవి అలెర్జీల వల్ల కలుగుతూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు కారణం లేకుండా చర్మంపై విపరీతమైన దురదలు వస్తూ ఉంటాయి. లింఫోమా వంటి క్యాన్సర్లకు ఇది ప్రారంభ లక్షణం. దురద, దద్దుర్లు వంటివి తరచూ వస్తూ ఉంటే జాగ్రత్తపడాలి.
చెవి నొప్పి
ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేకుండా గాయాలు కాకుండా చెవి నొప్పి వేధిస్తూ ఉంటే తేలికగా తీసుకోకండి. అది గొంతు క్యాన్సర్ సంకేతం. ప్రత్యేకించి గొంతులో ఏదో ఉన్నట్టు అనిపించినా, మింగడంలో ఇబ్బంది అనిపించినా జాగ్రత్తపడాలి. చెవి నొప్పితో పాటూ మింగడంలో ఇబ్బంది ఏర్పడితే వెంటనే వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఇది మెడ క్యాన్సర్‌కు సంకేతంగా చెబుతారు వైద్యులు.
టాపిక్