Best Web Hosting Provider In India 2024
Munneru Floods : భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. వాగులు, వంకలు, కాలువలు, చెరువులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు కాలనీల్లోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలతో మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వాగు పరివాహకంలోని 15 కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాజీవ్ గృహకల్ప, వెంకటేశ్వర్ నగర్, మోతీనగర్, బొక్కలగడ్డ కాలనీతో పాటు ఇతర ప్రాంతాల్లోకి భారీగా వరద పోటెత్తింది. ప్రజలు రెండు మూడు అంతస్తులున్న భవనాలపైకెక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. ఇండ్లపై నుంచి తమను రక్షించాలని బాధితులు వేడుకుంటున్నారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ తమను రక్షించాలని ఆర్తనాదాలు చేస్తున్నారు.
ఇండ్లపైకి చేరి సహాయం కోసం ఎదురుచూపులు
మున్నేరు పరివాహకంలోని కాలనీ ప్రజలు ఇండ్లపైకి చేరుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద బాధితులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. అధికార యంత్రాంగం, సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. బాధితులను రక్షించేందుకు చర్యలు చేపట్టాయి. మంత్రి తుమ్మల ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడారు. మున్నేరు వరద బాధితులను రక్షించేందుకు హెలికాప్టర్లను పంపాలని కోరారు. దీంతో మున్నేరు వద్దకు హెలికాప్టర్లు చేరుకున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విశాఖ నేవీ అధికారులతో మాట్లాడి, ఖమ్మం నగరానికి నేవీ హెలికాప్టర్లను పంపాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ నుంచి ఖమ్మంకు నేవీ హెలికాప్టర్లు చేరుకోనున్నాయి.
మున్నేరు వంతెనపై రాకపోకలు నిలిపివేత
మున్నేరు వాగు ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అవుతున్నాయి. ఖమ్మం రూరల్ మండలంలోని జలగంనగర్, ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతాల్లోకి మున్నేరు వరద నీరు పోటెత్తింది. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు ఇండ్ల పైకి చేరి రక్షించాలని వేడుకుంటున్నారు. స్థానిక అధికారులకు వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టారు. ప్రకాశ్ నగర్ బ్రిడ్జి వైపున ఏడుగురు వరద నీటి ప్రవహంలో చిక్కుకుపోగా, వారిని రక్షించేందుకు సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మున్నేరు వాగు పూర్తి నీటి సామర్థ్యం కన్నా అత్యంత ఎక్కువగా ప్రవహిస్తుంది. మున్నేరు వాగు వంతెనపై నుంచి భారీ వాహనాలు, బస్సుల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
ఖమ్మం నగరంలోని కవిరాజ్‌నగర్, వీడియోస్ కాలనీ, కోర్టు ప్రాంతం, ఖానాపురం హవేలీ, మమత హాస్పిటల్ రోడ్డు, కాల్వ ఒడ్డుతో పాటు పదుల సంఖ్యలో కాలనీలు నీట మునిగాయి. కల్యాణ్ నగర్ పూర్తిగా వరద నీటితో చిక్కుకుంది. వరద నీరు క్రమంగా పెరుగుతుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గత 20 ఏళ్లలో ఈ స్థాయిలో వరదలు చూడలేదని స్థానికులు అంటున్నారు. మున్నేరు వాగు వరదలో ఏడుగురు వ్యక్తులు చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు. ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వాగు ఉద్ధృతిని చూడడానికి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు.
టాపిక్